- సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపై కమ్యూనిస్టు పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. దేశంలోని వామపక్ష పార్టీలన్నింటికీ ప్రస్తుత ఫలితాలొక హెచ్చరిక అని, తమ పార్టీకి సంబంధించిన విధానం, వ్యూహం ఎక్కడ గాడి తప్పిందన్న దానిపై అధ్యయనం ప్రారంభించామన్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ముందుకు వెళతామన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఎక్కడ వైఫల్యం చెందామో లోతుగా చర్చిస్తామన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై శుక్రవారం నాడిక్కడ కె.నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ధనస్వామ్యంలో కమ్యూనిస్టు పార్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. అందుచేతనే చట్టసభల్లో అంతకంతకు ప్రాతినిధ్యం తగ్గిపోతున్న దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బిజెపికి అత్యధిక మెజారిటీ వచ్చిందని అభిప్రాయపడ్డారు.
ఫలితాలపై ఆత్మ పరిశీలన అవసరం
