న్యూఢిల్లీ: 2009లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 'నో-గో' ఏరియాగా ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ గ్రీన్జోన్లో మైనింగ్ కార్యకలాపాలకు సంబందించిన అనుమతులు అదానీ గ్రూప్ చేతికి అందేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని హస్దేవ్ ఆరంద్ అడవిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో వున్న పర్సా ఓపన్‌కాస్ట్ బొగ్గు గనిలో మైనింగ్ కార్యకలాపాల కోసం శతకోటీశ్వరుడు గౌతమ్ అదానీకి చెందిన ఆదానీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ యూనిట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన అటవీ సలహాకమిటీ ప్రాథమిక అనుమతులను సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలోని 841.538 హెక్టార్ల భూమి దట్టమైన అటవీ ప్రాంతంతో జీవ వైవిధ్యంతో కూడి వుంటుంది. ఈ భూముల్లో కోల్ మైనింగ్‌కు ఇప్పటికే క్లియరెన్స్‌లు వచ్చేశాయి. అయితే దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోవటంతో దీనిపై స్పందించేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధి నిరాకరించారు. ఈ బొగ్గుగని రాజస్తాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగమ్‌కు చెందినది. దీనిని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన రాజస్థాన్ కాలరీస్ లిమిటెడ్ సంస్థకు మైనింగ్ కార్యకలాపాల నిమిత్తం అప్పగించారు. ఈ ప్రాంతం మొత్తాన్ని 2009లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 'నో-గో' జోన్‌గా ప్రకటించినప్పటికీ దీనిపౖౖె తాజాగా అధ్యయనం నిర్వహించిన తొమ్మిది ప్రధాన బొగ్గు గనులను గో జోన్‌గా వర్గీకరించింది. ఈ ప్రాంతంలో దాదాపు 30 బొగ్గు గనులున్నాయి. ఆ తరువాత 2011లో నో-గో జోన్లో వున్న బొగ్గు గనులను కూడా మైనింగ్‌కు అనుమతించారు. ప్రస్తుతం అక్కడ రెండు గనుల్లో మాత్రమే మైనింగ్ జరుగుతోంది. 'రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం లేదని కానీ, ప్రతిపాదిత అటవీ భూములు జీవ వైవిధ్యం కిందకి రావని గాని నిర్ధారిస్తే' ఇక్కడ మైనింగ్‌కు సూత్ర ప్రాయంగా ఆమోదించవచ్చని సిఫార్సు చేయాలని అటవీ సలహా కమిటీ నిర్ణయించినట్లు గత నెల 15న జరిగిన కమిటీ సమావేశం మినిట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో కొద్ది మేర మాత్రమే దట్టమైన అటవీ భూములున్నట్లు తమ పరిశీలనలో తేలిందని, దీనిపై ప్రభుత్వాన్ని కూడా ఒకసారి పరిశీలించమని కోరామని డైరెక్టర్జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సిద్ధాంత దాస్ చెప్పారు. ఈ ప్రాంతంలో మైనింగ్‌కు సూత్రప్రాయంగా అనుమతులిచ్చినట్లు ఆయన నిర్ధారించారు. అయితే ఛత్తీస్‌గఢ్ బచావ్ ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా మాత్రం ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అటవీ భూములు మాత్రమే కాక, ఇది అత్యంత ప్రధానమైన ఎలిఫెంట్ కారిడార్అని, ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు అనుమతిస్తే ఇక్కడి జలవనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అంతేకాక ఇక్కడి ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల విక్రయాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వీరి అటవీ హక్కుల స్థిరీకరణ ఇంకా పూర్తి కాలేదని ఆయన వివరించారు. ప్రభుత్వం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు క్లియరెన్స్ ఇచ్చేందుకు తొందర పడుతున్నట్లు కన్పిస్తోందని శుక్లా అభిప్రాయపడ్డారు.
అదానీ గ్రూప్ చేతికి ఛత్తీస్‌గఢ్ మైనింగ్?
