న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రకటించిన 'పెద్ద నోట్ల రద్దు'' ఒక ప్రహసనంగా మారి విఫలమైన నేపథ్యంలో ప్రధాని మోడీని శిక్షించే సమయం ఆసన్నమైందని బిజెపి మాజీ నేత, మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన రిజర్వు బ్యాంకు వార్షిక నివేదిక పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విఫలమైనట్లు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 8, 2016 రాత్రి 8 గంటల సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఒక పనికిమాలిన ఆలోచన అని, దీనిని అమలు చేసి పెద్ద తప్పు చేశారని యశ్వంత్ విమర్శించారు. రిజర్వు బ్యాంకు చేసిన విలువైన సూచనలను పదేపదే సవరించి, చివరకు పెద్ద నోట్లను రద్దు చేశారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అమ లు లక్ష్యం చివరికి పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. కల్పిత కారణాలతో ఈ చర్యను సమర్ధించుకున్నారన్నారు. ఇప్పటికీ అసహేతుకమైన కారణాలనే చెబుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్ధను ఇంతలా దెబ్బతీసి ప్రజల జీవనశైలిని అస్ధిరత్వానికి గురిచేసిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియపై రానున్న లోక్సభ ఎన్నికల్లో మోడికి ప్రజలే శిక్ష విధించే సమయం వచ్చిందని యశ్వంత్ పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దుపై మోడీని శిక్షించే సమయమొచ్చింది : యశ్వంత్ సిన్హా
