గువహటి : బిజెపి కేంద్ర మంత్రి రాజన్ గోహైన్‌పై అత్యాచార కేసును అస్సాం పోలీసులు నమోదు చేశారు. నాగోవ్ జిల్లాలో ఒక యువతిపై అత్యాచారం చేసి, బెదిరింపులకు పాల్పడినందుకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్‌పై కేసు నమోదైందని సీనియర్ అధికారి తెలిపారు. నాగోవ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందిన తర్వాత ఈ నెల 2వ తేదిన కేసు నమోదు చేశామని నాగోవ్ ఎస్పి సబితా దాస్ చెప్పారు. దర్యాప్తు ప్రారంభమైందని, చట్టం ప్రకారమే ఈ కేసులో ముందుకు సాగుతామని చెప్పారు. అంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. ఐపిసి సెక్షన్లు 417(మోసం), 376 (అత్యాచారం), 506(క్రిమినల్ బెదిరిం పులు) కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. బాధితురాలి స్టేట్ మెంట్‌ను కూడా తీసుకున్నామన్నారు. వైద్య పరీక్షలకు బాధితురాలు నిరాకరించిదన్నారు. ఏడెనిమిది మాసాల క్రితం ఈ సంఘటన జరిగిందని బాధితురాలు తెలిపింది. మంత్రి, ఆ మహిళ పరస్పరం ఒకరికొకరు తెలుసునని, ఆమె ఇంటికి మంత్రి వస్తుండేవారని సీనియర్ అధికారి చెప్పారు. ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేనపుడు మంత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆయన తెలిపారు. మంత్రిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించగా, దర్యాప్తు పూర్తయిన తర్వాత అవసరమైతే అరెస్టు జరుగుతుందన్నారు.
అత్యాచార కేసులో కేంద్ర మంత్రిపై కేసు నమోదు
