ఢిల్లీ: మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరో బాంబు పేల్చారు. హవాలాదారుల నుంచి ఆప్‌కు భారీగా నిధులు వచ్చాయని మిశ్రా ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిశ్రా దీనికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు. ‘ఆయన అవినీతికి సంబంధించి ఆధారాలను బయటపెడుతున్నా కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారు. డొల్ల కంపెనీల ద్వారా నిధులు తీసుకుంటున్నారని వారం క్రితం ఆధారాలతో సహా నిరూపించాను. కానీ ఆప్ నుంచి ఎవరూ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి పార్టీకి నిధులు వచ్చాయి. ఏయే ఏయే కంపెనీల నుంచి నిధులు వచ్చాయని చెబుతూ ఆ కంపెనీల లెటర్‌హెడ్స్‌ను ఆధారాలుగా చూపుతున్నారో అవి నకిలీవి. ఆప్ వాటిని ఫోర్జరీ చేసింది’.అని మిశ్రా ఆరోపించారు.
‘ముఖేశ్‌కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆప్‌కు డబ్బులు వచ్చాయి. ముఖేశ్ కంపెనీ ఓ బ్యాంకుకు రుణం ఎగవేసింది. అలాంటపుడు ఆ కంపెనీ నుంచి ఆప్‌కు రూ.2కోట్లు ఎలా వచ్చాయి? అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న హేమ్‌ప్రకాశ్ శర్మ గుర్తింపును కప్పిపుచ్చేందుకు ముఖేశ్‌ను అడ్డం పెట్టుకున్నారు. ముఖేశ్ కంపెనీ వ్యాట్‌ను ఎగవేసింది. దానికి బదులుగా ఢిల్లీ ప్రభుత్వానికి, ఆప్‌కు విరాళాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. వీటన్నింటిపై సీఎం కేజ్రీవాల్ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు’? అని మిశ్రా ప్రశ్నించారు.
తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త 2014లో ఆప్‌కు రూ.50లక్షలు విరాళంగా ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఆయనకు నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ నుంచి రూ.50లక్షలు ఇచ్చారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి కేజ్రీవాల్ రూ.2కోట్లు ముడుపులు తీసుకోవడం నా కళ్లారా చూశానని మిశ్రా మొదటిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం 16 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నల్లధనాన్ని కేజ్రీవాల్ తెల్లధనంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రెండోసారి ఆరోపణలు చేశారు. కాగా ఇప్పటి వరకు ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. కానీ తన పరువుకు భంగం వాటిల్లిందంటూ మంత్రి జైన్ మిశ్రాపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.