లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఆదివారం నాడు పోలింగ్ జరగనుంది. ఈ మూడో విడతలో 12 జిల్లాలోని 69 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడత ఎన్నికలపై ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్, ఎస్పి, బిఎస్పి ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 69 స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పి అత్యధికంగా 55 స్థానాలు గెలుచుకుంది. బిఎస్పి 6, బిజెపి 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పి కూటమిగానూ, బిజెపి, బిఎస్పి విడివిడిగానూ పోటీ చేస్తున్నాయి. 69 స్థానాల నుంచి మొత్తం 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈత్వాహ నియోజక వర్గం నుంచి అత్యధికంగా 21 మంది అభ్యర్థులు, హైదర్గార్హా నుంచి కనిష్టంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో వున్నారు. లక్నో పశ్చిమ, మధ్య నియోజకవర్గాల నుంచి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడో విడతలో మొత్తం 25,603 పోలింగ్ బూత్‌ల్లో 2.41 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యూపిలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మార్చి 11న యుపి అసెంబ్లీ ఫలితాల్ని ప్రకటిస్తారు.
ముగిసిన మూడో విడత ప్రచారం : రేపు పోలింగ్
