'వాళ్లు ఊహించినట్టు సినిమా లేకపోతే కఠినంగా విమర్శించి, నాపై ఒత్తిడి తెచ్చే హక్కు ప్రేక్షకులకు ఉంది. ఆడియెన్స్ ఎటువంటి సినిమాను ఇష్టపడతారో చెప్పగలను గానీ, చేసిన చిత్రం ఆడుతుందో? లేదో? మాత్రం తీర్పునివ్వలేను' అని బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ అన్నారు. ఆయన నటించిన చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'. అమిర్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సేన షేఖ్ కలసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు తనను క్షమించాలని కూడా అమిర్ ఇదివరకే కోరారు. తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ అమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతోన్న 'రుబరు రోష్ని' అనే డాక్యూమెంటరీ ప్రమోషన్ పనుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ''క్షమించండి..అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దర్శకుడు విజరు కృష్ణ ఆచార్య, మా చిత్రబృందం మంచి సినిమానే తీసింది. నాతో పని చేసిన దర్శకులంతా మంచివారే. వాళ్ల ఉద్దేశాలూ మంచివే. ఓ మంచి సినిమా చేయాలన్నదే మా అందరి లక్ష్యం. కానీ కొన్నిసార్లు వైఫల్యం పొందొచ్చు. సినిమా రూపొందించడం చాలా కష్టమైన పని. నేను జట్టు నాయకుడ్ని. మా దర్శకుడు తప్పు చేస్తే నేను కూడా తప్పుచేస్తాను' అని చెప్పారు.
అమిర్ తన విధానం ఎలా ఉంటుందో వివరిస్తూ...' ఒక వేళ సినిమా విజయం సాధించకపోయినా ఆ విషయాన్ని నేను మనసులో పెట్టుకోను. ఆ సమస్య నాకు లేదు. నేను దర్శకుడ్ని నమ్ముతాను కాబట్టి వాళ్లు చెప్పినవే నేనూ చేస్తాను. కాకపోతే తప్పులు జరిగితే వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాం' అని పేర్కొన్నారు.
తనను అభిమానించే ప్రేక్షకులు, అభిమానుల విషయంలో అమిర్ ఏ విధంగా ఆలోచిస్తారో చెబుతూ ''నా పేరు చూసి ప్రేక్షకులు నా సినిమా చూడ్డానికి వస్తారు. కాబట్టి ప్రేక్షకులు నా వ్యక్తిగతం, వారి పట్ల పూర్తి బాధ్యత వహిస్తా. సినిమా విజయం సాధించి కూడా కొందరు విమర్శలు చేస్తే అది తప్పే. ప్రజలు ఏ తరహా సినిమాలను ఇష్టపడతారో నాకు తెలుసు. కానీ ఏం సినిమా ఆడుతుందో? ఏ చిత్రం ఆడదో అన్న విషయంపై మాత్రం తీర్పులివ్వలేం. అయితే ప్రేక్షకులు ఊహించనట్టు సినిమా లేకపోతే కఠినంగా విమర్శించే హక్కు వాళ్లకు ఉంటుందని నేను అనుకుంటున్నా. కొంత కోపం కూడా ఉంటే ఉండొచ్చు. చాలా కాలంగా నేను ఫ్లాప్ సినిమాలు చేయడం లేదు. అందువల్ల ప్రేక్షకుల వారి ఆగ్రహం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఇది చాలా మంచిది కూడా'' అని అన్నారు.
కథ దొరికితే కొడుకు ఎంట్రీకి సిద్ధం
అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ కూడా హీరోగా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అమిర్ తెలిపారు. సరైన కథ కోసం అన్వేషిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అమిర్‌కు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ ఇద్దరు కొడుకులు. వీళ్లు మొదటి భార్య పిల్లలు. వీరిలో ఇరా ఇప్పటికే నటుడు. జునైద్ నటుడు కావాలని తప్పన పడుతున్నాడు. 'జునైద్ కాబోయే నటుడు. సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాం. జునైద్ పనితనం నేను చూశాను. బాగుంది. నేను స్క్రీన్ టెస్ట్‌ను నమ్ముతాను. వాడు స్క్రీన్ టెస్ట్ పాసైతే యాక్టర్ అవుతాడని నమ్ముతాను, లేకుంటే అవ్వడని అనుకుంటాను'' అని అమిర్ అన్నారు.
ఆమెకు దూరంగా ఉన్నా...
జుహి చావ్ల, అమిర్ ఖాన్ జోడీగా 'క్యూయమ్యాట్ సే క్యూయమ్యాట్', 'లవ్ లవ్ లవ్', 'హమ్ హైన్ రహి ప్యార్ కీ' వంటి ఏడు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 'ఇష్క్' చిత్రం సెట్లో వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూచాయి. ఏడేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ వీరిద్దరూ కలసి ఒక్క సినిమాలోనూ నటించ లేదు. దానికి కారణాన్ని అమిర్ తాజాగా వివరించారు ' ఇష్క్ సినిమా చిత్రీకరణ సమయంలో చిన్నపాటి సమస్యల వల్ల పోట్లాడుకున్నాం. అది పెద్ద విషయం కాదు. కానీ నేనొక పెద్ద ఇగోయిస్టిక్‌గా ఆలోచించా. అందుకే సెట్లో కూడా మళ్లీ ఆమెతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. సెట్లో ఆమెకు దూరంగా ఉండేవాడ్ని. ఎందుకలా ఉండేవాడినో నాకే తెలియదు. చావ్లా వచ్చి నా పక్కన కూర్చొన్నా సరే...నేను అక్కడ నుంచి 50 అడుగుల దూరంగా వెళ్లిపోవాలనుకునేవాడ్ని(నవ్వుతూ). ఆమెనెప్పుడూ పలకరించేవాడ్ని కాదు. సీన్లు చిత్రీకరణ జరిగేటప్పుడు మాట్లాడాల్సి వస్తేనే ఆమెతో మాట్లాడేవాడ్ని. అది వృత్తిలో భాగంగానే జరిగేది అన్నట్టు. అందువల్ల ఆరేళ్ల పాటు మేం మాట్లాడుకోలేదు. కానీ రీనాతో నేను విడాకులు పొందిన విషయం తెలుసుకుని చావ్లా నాకు ఫోన్ చేసి మాట్లాడి తర్వాత వచ్చి కలుసుకుంది. తర్వాత రీనాకు, నాకు చావ్లా దగ్గరయ్యారు. మా ఇద్దరి మధ్య ఉన్న విబేధాలను చెరిపేయాలని ప్రయత్నించింది. ఆమె ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది'' అని అన్నారు అమిర్ ఖాన్.