'ఎందుకో ఏమో' సినిమా ముక్కోణపు ప్రేమకథ. ఇలాంటి ప్రేమ కథలను చాలానే చూశాం కదా! ఇందులో ఏం కొత్తదనం అని అనుకోవచ్చు. ఇందులో మేం ఓ కొత్త పాయింట్‌ను చూపిస్తున్నాం. దాన్ని సినిమాలో చూడాల్సిందే. అలాగే సెకండాఫ్ చిత్రానికి కీలకమని' దర్శకుడు కోటి వద్దినేని తెలియజేస్తున్నారు. మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రమిది. మాలతి వద్దినేని నిర్మాత. గురువారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రం గురించి వివరించారు.
- పోసాని కష్ణమురళి ప్రేరణతో ఈ రంగంలోకి వచ్చాను. రాగానే డైరెక్టర్ అయిపోదామనుకున్నాను. కానీ ఇక్కడకు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఇండిస్టీ అంటే ఏంటో అర్థమైంది. పోసాని కష్ణమురళిగారు శ్రీహరి సినిమాలకు పనిచేస్తున్న సమయంలో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఒకట్రెండు సినిమాల్లో దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాను.
- 'శ్రావణ మాసం' తర్వాత పోసానిగారు దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలను ఆపేశారు. ఇక డైరెక్టర్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుని కథలను తయారు చేసుకుని తిరిగేవాడిని. అయితే తప్పకుండా దర్శకుడవుతాను అనే నమ్మకం ఉండేది. ప్రొడ్యూసర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఈ కథను పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమా చేద్దామన్నవారు బడ్జెట్ విషయంలో కాంప్రైమెజ్ కావాలనేవారు. ఆ సమయంలో రియల్ఎస్టేట్పై మళ్ళాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను.
- కథపై నమ్మకంతో పెద్ద సినిమాలు వున్నా విడుదలకు సిద్ధమయ్యాం. అమ్మాయి చుట్టూ తిరిగే కథ. నందు అమాయకుడిగా నటిస్తే నోయల్ కన్నింగ్ పాత్రలో కనపడతారు. సినిమా ఎంటర్టైనింగ్ సాగుతూ ఒక వైపు ప్రేమకథ. మరో వైపు ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్‌తో రన్ అవుతుంది. తప్పకుండా ఆడియెన్స్‌ను మెప్పించే సినిమా అవుతుందని గట్టి నమ్మకం ఉందని చెప్పారు.
తెరపై చూడాల్సిందే: కోటి
