కుటుంబంలోని వారంతా ఒక్కరోజైనా కలిసుంటే ఎలా ఉంటుందో గత ఏడాది 'శతమానం భవతి'లో చూశాం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. దానికి ఆ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పురస్కారం కూడా దక్కింది. ఆ సినిమాను నిర్మించిన దిల్‌రాజుతోనే ఇప్పుడితను 'శ్రీనివాస కళ్యాణం' చేశాడు. నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే చిత్రంగా ప్రచారం చేశారు.
నటీనటులు : నితిన్, రాశీ ఖన్నా, ప్రకాష్ రాజ్, సితార, రాజేంద్ర ప్రసాద్, ఆమని, జయసుధ, నందిత శ్వేత, పూనమ్ కౌర్, నరేష్, ప్రవీణ్, విద్యుల్లేఖ, సత్యం రాజేష్ తదితరులు.
సాంకేతికత :
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, సంగీతం : మిక్కీ జే మేయర్, నిర్మాతలు : రాజు, శిరీష్, రచన, దర్శకత్వం : సతీశ్ వేగేశ్న.
కథ : వాసు (నితిన్) ఛండీగఢ్‌లో ఆర్కిటెక్ట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన అతడికి సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. అక్కడే పిజ్జా సెంటర్లో పనిచేసే శ్రీ (రాశీ ఖన్నా)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ప్రతి నిమిషాన్ని డబ్బుతో ముడిపెట్టే బిలియనీర్ ఆర్కే (ప్రకాష్ రాజ్) కూతురు శ్రీ. తండ్రి కోరిక మేరకు ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసమని ఛండీగఢ్ వచ్చి ఇలా పనిచేస్తుంటుంది. కుమార్తె ఇష్టపడిందని వాసుతో పెళ్లికి సిద్ధం చేసి, నిశ్చితార్థం రోజే ఓ షరతు పెడతాడు ఆర్కే. అదే సమయంలో వాసు కూడా ఆయనకు ఒక షరతు పెడతాడు. అది వారిద్దరి మధ్యే ఉండాలనేది నిబంధన. అలాంటిది సరిగ్గా పెళ్లి సమయంలో బయటపడుతుంది? అసలు ఆ షరుతు ఏమిటి? బయటపడ్డాక పెళ్లి జరిగిందా? లేదా? అనేది కథ.
విశ్లేషణ : మన మూలాలను, సంప్రదాయాల్ని మర్చిపోయి యాంత్రిక జీవితంలో సాగుతున్న యువతను మేల్కొలిపేందుకు పలు చిత్రాలు ద్వారా దర్శక నిర్మాతలు కదలిక తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాటిని సున్నితంగా చెబుతూ ఎంటర్టైన్ చేయాలి. లేదంటే విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. ఇంతకుముంద వేగేశ్న తీసిన 'శతమానం భవతి' వినోదం పంచుతూనే సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేసింది. ఈసారి సందేశమే ప్రధానంగా మారి వినోదం పట్టించుకోకుండా చేసింది. పెళ్లి, మన సంప్రదాయాల గురించి అదే పనిగా క్లాస్ పీకుతున్న భావన కలిగిస్తుంది. మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. ఓ పండుగ. ఓ అనుభూతి.. ఇవన్నీ గతంలో కొన్ని సినిమాల్లో చెప్పేశారు. పెళ్లిని ఓ వేడుకలా చేసుకోవాలనే విషయాన్ని చాలా మందికి గుర్తు చేసిదిగా అయి ఉండొచ్చు గానీ...ఇదే పెళ్లి గురించి వెండితెరపై కొందరు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పెళ్లి అంటే ఏమిటి? పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి జరిగే క్రతువులు ఎలా ఉంటాయనేవి తాపీ ధర్నారావు తన పుస్తకంలో కొన్నేళ్ళ క్రిందటే రాసేశారు. దానికితోడు ఈమధ్య ప్రవచనాలు వల్లించే చాగంటి కోటేశ్వరరావు, నరసింహారావు లాంటి వారు విదేశాల్లో కూడా బోధించేస్తున్నారు. వాటినన్నింటినీ తెలుసుకుని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనేది దర్శక నిర్మాతలకు వచ్చిన ఆలోచనగా ప్రేక్షకుడికి కలుగుతుంది. ఈ కథకు స్ఫూర్తి తన జీవితంలో జరిగిన విషయంగా దిల్‌రాజు చెప్పుకొచ్చారు కూడా. అంటే ముందుగానే ప్రేక్షకులకు ఒక అంచనాకు వచ్చేలా చేశాడు. అయితే దాన్ని మరింతగా ఆకట్టుకునేట్లుగా చెప్పాలనే విషయాన్ని మరిచినట్లున్నారు.
'సీతారాముల కళ్యాణం సూతమురారండి.. అంటూ పెళ్లి వేడుక ఎలా చేయాలో ఆ పాటలో స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పుడు శ్రీరామనవమి పండుగ రోజున, ఇతరుల ఇళ్లల్లో పెళ్లిలు జరిగే సందర్భంలోనూ ఆ చిత్రం తరహా పాటను వింటూనే ఉంటాం. ఆ పాట వినగానే ఏదో తెలీని అనుభూతి కలుగుతుంది. అంతకంటే కొత్తగా చెప్పటానికి ఏ కథలోనూ ఏమీ ఉండదు. అలాంటి విషయాన్ని ఏదో చెప్పాలని సినిమాగా చేయడం సాహసమే. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యే పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్నాడు కనుక బోలెండంత మంది జనాలతో సందడి సందడిగా ఉంటూ మానవ సంబంధాలు, సంప్రదాయాలు, పెళ్లి గురించి మంచి విషయాలు చెబుతూ సాగిపోతుంది. ఈ క్రమంలో ఒకవైపు హీరో, మరోవైపు జయసుధ డైలాగుల రూపంలో చెప్పడానికి ప్రయత్నించడంతోనే వచ్చింది సమస్య. సగం డైలాగులతో సినిమా సాగుతుంది.
ఇక పాత్రల పరంగా తీసుకుంటే ప్రతిదీ టైం, డబ్బుతో ముడిపెట్టే ఆర్కే పాత్ర.. తన కుమార్తెను లోకజ్ఞానం తెలుసుకోమని ఆరు నెలలు బయటకు పంపుతాడు. నిమిషాన్ని కూడా డబ్బేతో లెక్కించే ఈ మనిషి ఆరు నెలలు కాలాన్ని కుమార్తె చేత వృథా చేయించడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇక మధ్యతరగతి అబ్బాయి ప్రేమిస్తుందని చెప్పగానే మిలియనీర్ అయిన తండ్రి వెంటనే గ్రీన్ స్నిగల్ ఇవ్వడం కూడా చిత్రంగా అనిపిస్తుంది. ఇక హీరోహీరోయిన్లకు ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలేమీ కనిపించవు. సినిమాలో కీలకమైన పాయింట్ అయిన దాన్ని విస్మరించారు. అంతేకాదు విరామంలో కూడా ఎటువంటి మలుపు ఉండదు. ద్వితీయార్ధంలో సినిమా ఎలా సాగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. మానవ సంబంధాల్ని మరిచిపోయి బిజీ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఒక పల్లెటూరికి వచ్చి అక్కడి వారి మధ్య కొన్ని రోజులు తిరగ్గానే మారిపోవడం అన్నది ఎన్ని సినిమాల్లో చూశామో? 'శతమానం భవతి'లోనూ చూసిందీ అదే. ఎన్నిసార్లు ఇలాంటి సినిమాలు ప్రేక్షకులపై రుద్దుతారనేది చాలా మంది ప్రశ్న? అసలు ఇలాంటి కథలు, సినిమాలు అనేవి కేవలం ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం తీస్తున్నారనేది జగమెరిగిన సత్యం. 'శతమానంభవతి' కూడా అక్కడివారి కోసం తీసిందే. ఇక్కడ కూడా హిట్ చేశారు ప్రేక్షకులు.
ఇక నటనపరంగా నితిన్‌కు నటించేందుకు పెద్దగా అవకాశం లేదు. నీట్‌గా తయారై దర్శకుడు చెప్పిన డైలాగ్‌లు చెప్పేయడం అతని క్యారెక్టర్. అంతకన్నా పెద్దగా అతను కష్టపడిందీ లేదు. 'తొలి ప్రేమ' తర్వాత రాశీ స్థాయికి తగ్గ పాత్ర కాదిది. ఆమె అందంగా కనినిపించింది కానీ నటనలో ప్రత్యేకత చూపించే అవకాశమే రాలేదు. ప్రకాష్ రాజ్ తన పాత్రను అలవోకగా చేసుకెళ్లిపోయారు. కానీ ఆయన రొటీన్‌గానే అనిపిస్తారు. రాజేంద్రప్రసాద్ ఫర్వాలేదు. నరేష్, ఆమనీలకు అసలేమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇచ్చారు. రెండో నాయికగా నటించిన కన్నడ నటి నందిత శ్వేత పాత్ర అనవసరమే చెప్పాలి. ఆమెను చూస్తుంటే రాధ కుమార్తె గుర్తుకు వస్తుంది. ప్రవీణ్, విద్యుల్లేఖ, సత్యం రాజేష్ పాత్రలు ఎంటర్టైన్ చేశారు.
సాంకేతికంగా మిక్కీ జే మేయర్ సంగీతం అంతగా ఏం లేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ప్రకృతి అందాలు కాబట్టి బాగానే తీశాడు. నిర్మాణ విలువలు ఓకే. కేవలం పెళ్లి గురించి దాని ప్రాధాన్యత గురించి ఇప్పటి తరానికి చెప్పేందుకు యూట్యూబ్‌లు, వాటప్స్ల్లో చక్కటి సందేశాలు వస్తున్న తరుణంలో సినిమాగా తీయడం సాహసమే చెప్పాలి. అందుకే ఈ సినిమా చూశాక ఓ పెళ్లి వీడియో చూసిన భావనతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.
- మురళి