- చిత్రం : తేజ్..ఐ లవ్ యు
- నటీనటులు : సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్, అనీష్ కురువిల్లా, పృథ్వీ-వైవా హర్ష - పవిత్ర లోకేష్ తదితరులు
- సంగీతం : గోపీసుందర్, ఛాయాగ్రహణం : ఐ.ఆండ్రూ, మాటలు : డార్లింగ్ స్వామి, నిర్మాత : కె.ఎస్.రామారావు,
- కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎ.కరుణాకరన్.
వరుసగా అపజయాలు ఎదురవుతున్నాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గొప్పగొప్ప దర్శకులతో సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మొన్న వినాయక్‌తో 'ఇంటిలిజెంట్' చేశాడు. నిరాశ పరిచింది. ఈ సారి ప్రేమకథలకు పెట్టింది పేరు అయిన ఎ.కరుణాకరన్‌తో చేశాడు. ఆ చిత్రమే 'తేజ్ ఐ లవ్ యు'. తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటివి చూసిన తర్వాత కరుణాకరున్ సినిమా చేస్తే భారీ అంచనా ఏర్పడాయి. అందులోనూ అగ్ర నిర్మాణ కేఎస్ రామారావు కాంబినేషన్ అనేసరికి క్రేజ్ పెరిగింది. ఎన్ని ఉన్నా సినిమా కథ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు లేకపోతే దానికి ప్రేక్షకాదరణ లభించలేనట్టే. పాత కథనే చెప్పినా వినూత్నంగా చెప్పే ప్రయ్నతం చేయలేకపోయారు.
కథ : చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన తేజ్ (సాయిధరమ్ తేజ్) పెద్దనాన్న, చిన్నాన్న కుటుంబాల వద్ద పెరుగుతాడు. చిన్నతనంలో ఓ మహిళను రక్షించే ప్రయత్నంలో ఓ వ్యక్తిని హత్య చేస్తాడు. అందుకు ప్రతిఫలంగా జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. తర్వాత అతడిని పెదనాన్న కుటుంబం ఆదరిస్తుంది. హ్యాపీగా సాగే కుటుంబంలో తేజ్ చేసిన ఓ పని వల్ల కుటుంబం మంతా అతడిని దూరం పెడుతుంది. కాలేజీలో చదువుకుంటూ మ్యూజిక్ బ్యాండ్ నడుపుతున్న తేజ్‌కు ఆ సమయంలోనే లండన్ నుంచి ఓ పని మీద వైజాగ్ వచ్చిన నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు తేజ్. నందిని కూడా అతడిని ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిణామంతో ప్రమాదానికి గురై నందిని తన గతాన్ని మరిచిపోతుంది. తేజ్‌ను కొత్త వ్యక్తిలా చూస్తుంది. ఆ స్థితిలో తేజ్ ఏం చేశాడు! అసలు లండన్ నుంచి నందిని ఎందుకు వచ్చింది. అన్నది మిగతా కథ.
విశ్లేషణ : ఈ సినిమా కరుణాకరన్ దర్శకుడు అనగానే ఫీల్ గుడ్ ప్రేమకథతో తెరకెక్కిస్తాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అందుకు ఆయన తీసిన 'తొలి ప్రేమ'.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా'.. 'డార్లింగ్' చిత్రాలే కారణం. అయితే ఆ సినిమాల్లో మనసుకు హత్తుకునేలా చాలా అంశాలు కన్పిస్తాయి. కానీ 'తేజ్ ఐ లవ్యూ'లో అవి లోపించాయి. మొదటి భాగమంతా ఉమ్మడికుటుంబంగా అందరూ కలిసివున్న ఫ్యామిలీలో చెల్లెలు తేజ్‌ను ఆటపట్టించడం, లండన్ నుంచి వచ్చిన నాయిక ఆడుకోవడం వంటివి చాలా సరదాగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ గతాన్ని మర్చిపోయిన నాయిక కావడంతో ఆమెను మామూలు మనిషిగా చేసే ప్రయత్నంలోనే గమనం సాగుతుంది. అది ఏమాత్రం ఆకట్టుకునేట్లుగా లేకపోవడంతో ప్రేక్షకుడికి ఫీల్ కలగలేదనే చెప్పాలి. ప్రేమకథలు చూస్తున్నపుడు హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఫీల్ ముఖ్యం. అది ఇందులో పెద్దగా అనిపించదు. సామాజిక పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒకప్పటిలా సినిమాలు తీస్తే రుచించడంలేదు.
ఇక ఆమె గతాన్ని మర్చిపోవడమేది ఓ జబ్బు అని.. ఇలాంటివి కొన్ని కేసుల్లోనే ఉంటాయని డాక్టర్ చెబుతాడు. అయితే తను తల్లిని, తండ్రిని గుర్తుపడుతుంది. లండన్ నుంచి ఇక్కడకు ఎందుకు వచ్చానో అనేది చెప్పలేకపోతుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన తేజ్‌తోపాటు ఆయన స్నేహితుల్ని కూడా గుర్తించదు. అలాంటి సమయంలో తేజ్ చేసిన ప్లాన్ డ్రమెటిక్‌గా ఉంటుంది. సినిమా అంతా దానిపైనే సాగుతుంది. ఆ మధ్య 'ఎందుకంటే ప్రేమంట'లో సైతం బతికుండగానే హీరోయిన్ ఆత్మగా మారడం అంటూ ఒక చిత్రమైన కథ చూపించాడు కరుణాకరన్. ఇలాంటి ప్రయత్నం హాలీవుడ్లో జరిగి ఉండొచ్చు. కానీ మన ప్రేక్షకులకు దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడం అన్నది కీలకం.
ఓవైపు హీరోను హీరోయిన్ వేధిస్తూ ఉంటుంది. ఆమెను అతను ప్రేమిస్తున్న సంగతి కూడా ఎవరితోనూ చెప్పడు. ఆమె తనను టార్చర్ పెడుతోందనే అంటుంటాడు. కానీ అక్కడ పాట మాత్రం 'నచ్చుతున్నదే..' అంటూ సాగిపోతుంటుంది. కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్ను, చుట్టుపక్కల ప్రాంతాల్ని అందంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇందులోనూ కెమెరా నైపుణ్యంతో అలా చేశాడు. అయితే తేజ్, అనుపమ మధ్య కెమిస్ట్రీ పెద్దగా పండలేదనే చెప్పాలి. చివర్లో మాత్రం కొంచెం సెంటిమెంట్.. ఫీల్ వర్కవుట్ చేయగలిగాడు కానీ.. మిగతా సమయమంతా చాలా భారంగా గడుస్తుంది. నటనా పరంగా ఇద్దరూ బాగానే చేశారు. చాలా వరకు యాక్షన్ జోలికి వెళ్లకుండా సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశాడు. ఐతే ఎప్పుడూ చేయని పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేసినా అతను ఇందులో కొత్తగా ఏమీ కనిపించడు. జస్ట్ ఓకే అనిపిస్తాడు. గోపీసుందర్ సంగీతం ఫర్వాలేదు. కానీ ఒక లవ్ స్టోరీకి అవసరమైన స్థాయిలో ఫీల్ లేకపోయింది. పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. 'అందమైన చందమామ..' పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. నేపథ్య సంగీతం ఇంకా బాగుండాల్సిందనిపిస్తుంది. ఐ.ఆండ్రూ ఛాయాగ్రహణం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి. డార్లింగ్ స్వామి మాటల్లో ఏ ప్రత్యేకతా లేదు. హీరోయిన్ గతాన్ని మర్చిపోయినప్పుడు 'మనస్సుకు మర్చిపోయే గుణం ఉన్నప్పుడు హృదయానికి మర్చిపోయే గుణాన్ని ఎందుకు దేవుడు ఇవ్వడంటూ..' డైలాగ్ రాశాడు. అసలు మనసు, హృదయం వేరువేరని కొత్త భాష్యాన్ని చెప్పాడు. మనసు చెప్పినట్లే బాడీలోని భాగాలు స్పందిస్తాయనే విషయాన్ని మర్చినట్లున్నాడు. దర్శకుడు కరుణాకరన్ కాలానికి తగ్గట్లుగా మారలేదనిపిస్తుంది. తన సినిమాల్నే అటు తిప్పి ఇటు తిప్పి 'తేజ్ ఐ లవ్యూ' తీసినట్లుగా ఉంది. పతాక సన్నివేశంలో తాను అంతకుముందు తేజ్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రొఫెసర్‌కు 'ప్రపోజల్ పెన్ను' ఇస్తుంది. ఆ పెన్నులో స్పీకర్ ఇమిడి ఉంటుంది. క్లైమాక్స్‌లో హఠాత్తుగా ఆ ప్రొఫెసర్ కన్పించి చెప్పగానే ఆమెకు గతం గుర్తుకు వస్తుంది. ఇదంతా ఊహాజనితంగా ఉంటుంది.
- పి.మురళి