- వంశధార పనులపై ప్రభుత్వం అత్యుత్సాహం
- విత్తనాలు వేయొద్దంటూ హుకుం
శ్రీకాకుళం ప్రతినిధి
వంశధార ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వం చూపుతున్న అత్యుత్సాహంతో నిర్వాసిత రైతులు డీలా పడ్డారు. గతేడాదిగా ప్రాజెక్టు పనుల్లో స్తబ్దత నెలకొంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాసం అంశాలను పూర్తిగా గాలికొదిలేసింది. రైతులకు భూపరిహారం అందించడం మినహా ఇతర అన్ని విషయాల్లోనూ నిర్వాసితులకు అన్యాయం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం వంశధార ప్రాజెక్టు నినాదాన్ని తిరిగి అందుకొంది. వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనులను సత్వరమే పూర్తి చేస్తామని చెప్పి హడావుడిగా మొదలు పెట్టింది. పనులు ప్రారంభిస్తాం, పొలాల్లో ఎవరూ విత్తనాలు వేయొద్దంటూ హుకుం జారీ చేస్తోంది. 2008లో ప్రాజెక్టు పనులు నిలిపివేసిన నాటి నుండి ఖరీఫ్, రబీ సీజన్లలో వారు పంటలు పండిస్తూనే ఉన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం రెండు సీజన్లలోనూ పంటలు పండించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వేలాది మంది రైతులు ఇప్పటికే తమ పొలాల్లో విత్తనాలు చల్లారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మేలో వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక సమావేశం నిర్వహించారు. తిరిగి రెండోసారి జూలై 3న మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాసితులనుద్దేశించి మాట్లాడుతూ... రైతులెవరూ విత్తనాలు చల్లవద్దంటూ చావుకబురు చల్లగా చెప్పారు. దుక్కులు దున్నేశాం, చాలా చోట్ల విత్తనాలు కూడా వేశాం. ఎలాగోలా ఇన్నాళ్లూ ఆగారు... ఒక్క ఆరు మాసాలు గడువు ఇవ్వండని రైతులు విజ్ఞప్తి చేసినా... కుదరదంటూ మంత్రి అచ్చెన్నాయుడు తేల్చి చెప్పేశారు. భూములకు డబ్బులిచ్చేశామని, ఇంకా వాటిలో సాగు చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదని రైతులు విజ్ఞప్తిని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఆ మరుసటి రోజు నుంచే అధికారులు నిర్వాసిత గ్రామాల్లో రైతులెవరూ విత్తనాలు వేయొద్దంటూ చాటింపు వేయించారు. దీంతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. విత్తనాలు, ఇతర ఖర్చులు కోసం రైతులు ఇప్పటికే కొంత పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వం ఇప్పుడు అర్ధాంతరంగా భూములు విడిచి పొమ్మనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం ఈ మాటేదో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే చెప్పి ఉంటే, తమకు ఈ నష్టం ఉండేది కాదని రైతులు వాపోతున్నారు.
వంశధార ప్రాజెక్టు ఫేజ్-2, స్టేజ్-2కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని మూడు మండలాల పరిధిలో 20 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించింది. వాటిలో హిరమండలంలో 13 గ్రామాలు, కొత్తూరు మండలంలో 6 గ్రామాలు, ఎల్ఎన్పేటలో ఒక గ్రామం ఉన్నాయి. ప్రాజెక్టు పనుల కోసం ప్రభుత్వం 2005లోనే భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. నిర్వాసిత గ్రామాలకు చెందిన 5,200 మంది రైతులకు చెందిన సుమారు ఎనిమిది వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. రైతుల నుండి తీసుకున్న భూములకు మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం చెల్లించింది. రైతులు, ఇతర నిర్వాసితులను కలుపుకుంటే నేటివరకూ కేవలం 20 శాతం మందికి మాత్రమే పరిహారం, పునరావాసం కల్పించింది. నిర్వాసిత కుటుంబాల్లోని పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తెకు ఇవ్వాల్సిన యూత్ ప్యాకేజీని ఏ ఒక్క కుటుంబానికీ అందించలేదు. నిర్వాసిత గ్రామాల్లో ఇప్పటికీ 1,133 మందికి పట్టాలు అందించలేదు. పైగా మైదాన ప్రాంతాలలో ఏడాదికి రెండు పంటలు పండిస్తున్న బతుకుతున్న రైతులకు కొండలు, అడవుల్లో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. దీంతో రైతులెవరూ ఆ ప్రాంతాలకు వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. మరికొంత మందికి కేటాయించిన పునరావాస కాలనీల్లో కనీసం తాగునీరు లేని పరిస్థితి నెలకొంది. చాలా పునరావాస కాలనీల్లో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులను ప్రభుత్వం అరకొరగా కల్పించింది. తమ సమస్యలను పరిష్కరించకుండా ఇవ్వాల్సిన పరిహారం, పునరావాసం కల్పించకుండా తాము ఎక్కడికి పోవాలని రైతులు, నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.