తెలుగురాష్ట్రాల్లో ఎంసెట్-2015 ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసి, అటు పోలీసులు, ఇటు తల్లిదండ్రుల సహకారంతో పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణలో ఒక్క రోజు ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా...ఎందుకైనా మంచిదని ఎవరి ఏర్పాట్లు వారు చేసుకున్నారు. అయితే పరీక్షల నిర్వహణ ఎంత పగడ్బందీగా నిర్వహించినా..ఒక్క నిమిషం నిబంధన అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ఆందోళన కలిగిం చింది. చాలా మంది విద్యార్థులకు నిమిషం నిబంధన నిజంగానే శాపంగా మారింది. ఆ ఒక్క నిమిషం.. విద్యార్థి ఏడాది పడ్డ శ్రమను క్షణంలో ఆవిరిచేసింది. విద్యార్థులు కన్నీళ్లు పెడితే.. వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు.. ఇదంతా టీవీల్లో చూసిన జనం అయ్యో పాపం అనుకున్నారు. కానీ ఒక్క నిమిషంలో విద్యార్థిని అనుమతిస్తే వచ్చే ఇబ్బందేంటో అధికారులే చెప్పాలి. నిబంధనలు మన కోసమే కానీ, నిబంధనల కోసం మనం కాదు అనేది మన అధికారులు ఎప్పుడు గ్రహిస్తారో...
- శ్రీరామ్