ప్రజలెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణా బాధ్యత నుంచి వైదొలగడం అత్యంత దుర్మార్గం. జనం ప్రాణాలను కార్పొరేట్, ప్రయివేటు చేతిలో పెట్టి చోద్యం చూడటం దారుణం. నిర్మాణ, మౌలిక సదుపాయాల వంటి భారీ ప్రాజెక్టుల్లో వలే సర్కారీ ఆస్పత్రుల్లో కూడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాన్ని (పిపిపి) ప్రవేశపెట్టడం మానవత్వం లేని వారు చేసే పని. చంద్రబాబు ప్రభుత్వం అలాంటి అమానవీయ చర్యకు ఒడిగడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు సరిగ్గా లేవనే సాకుతో అనంతపురం జిల్లా హిందూపురం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, రాయదుర్గం, పెనుగొండ, గుత్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్సి)లో వైద్య పరీక్షలను మెడాల్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే తప్పేముంది అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రయోగా త్మకంగా అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న ఈ నిర్వాకా నికి సంబంధించి సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు ఆసాంతం చదివితే అసలు కుట్ర తెలిసొస్తుంది. సదరు స్వచ్ఛంద సంస్థకు సర్కారు నెలకు కోటి రూపాయలు ముట్టజెబుతోంది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలన్నీ ఆ సంస్థ ఉచితంగా వినియోగించుకుంటోంది. డబ్బులు తీసుకొని, ప్రభుత్వ వసతులతో రోగులకు పరీక్షలు నిర్వహిస్తే అది స్వచ్ఛంద సేవ ఎలా అవుతుంది? సూదులకు, ఎక్స్రే ఫిలింలకు, బ్యాండేజీలకు డబ్బులివ్వడా నికి చేతులు రాని సర్కారు, స్వచ్ఛంద సంస్థకు నెలకు కోటి రూపాయలు చెల్లించడానికి మాత్రం ఎక్కడలేని ఉదారత ఎందుకొచ్చింది? అనంతపురంలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రం మొత్తానికీ ఆ విధానం అమలు చేస్తామని ఉత్తర్వుల్లో సర్కారు భవిష్యత్తు కార్యాచరణపై కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వ డబ్బుతో వేరెవరో వైద్య పరీక్షలు నిర్వహించడమేంటి? ఉన్న సిబ్బంది ఏం చేస్తారు? భవిష్యత్తులో పోస్టులు నింపరా? అసలు సర్కారీ ఆస్పత్రులుంటాయా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేటట్లు ప్రభుత్వాస్పత్రులను అత్యంత దయనీయంగా తయారు చేసింది ఏలిన ప్రభుత్వాలే. ఇప్పుడేమో వైద్య పరీక్షల నిర్వహణ సరిగ్గా లేదని సేవలను ప్రయివేటీకరిస్తున్నారు. సర్కారీ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించొద్దని, పోస్టులు భర్తీ చేయొద్దని ఎవరన్నారు? మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభో అని ప్రతి రోజూ రోగులు, పేద ప్రజలు మొత్తుకుంటుంటే వారి ఆర్తనాదాలు పాలకుల చెవికెక్క ట్లేదు. పైగా ప్రభుత్వ ఆస్పత్రులను క్రమంగా నిర్వీర్యం చేసి, మొత్తానికే మంగళం పాడేందుకు ఎత్తు వేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం వైద్యరంగంలో 'సంస్కరణ'లు మొదలు పెట్టింది. ప్రపంచబ్యాంకు నిధులతో భవనాలైతే నిర్మించారు. సిరంజిల వంటి చిన్న చిన్న సౌకర్యాలను సైతం లేకుండా చేశారు. భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లు మాత్రం బాగుపడ్డారు. పైపెచ్చు పేదల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయడంతో ప్రజల్లో నిరసనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే అధ్యక్షతన సలహా కమిటీల వంటి పొద్దుపోని కార్యక్రమాలెన్నో అప్పట్లో అమలయ్యాయి. ప్రజల ఛీత్కారాలకు గురయ్యాయి. యిప్పుడు చంద్రబాబు సర్కారు మళ్లీ వైద్యరంగంలో అలాంటి 'సంస్కరణల'కు నడుంకట్టింది. కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి కార్పొరేట్లను పెంచి పోషించి, ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులివ్వకుండా ఎండబెట్టారు. ప్రస్తుత తెలుగుదేశం సర్కారు ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రయివేటీకరించేందుకు సిద్ధపడింది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రపంచబ్యాంక్ 'సంస్కరణ'లు, వాటి పర్యవ సానంగా పడే భారాలు ప్రజలకు తప్పట్లేదు. ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం దిగజారగా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలు యాభై శాతానికి పైమాటేనని ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. సివిల్ అసిస్టెంట్లు 37 శాతం ఖాళీలున్నాయి. బోధనా ఆస్పత్రుల్లో 21 శాతం వైద్యులు లేరు. కొన్ని ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలు ఆందోళనకరం. అనస్తీషియా ఖాళీలు 80 శాతం. చిన్న పిల్లల వైద్యులు 70 శాతం, గైనకాలజిస్టులు 50 శాతం ఖాళీయే. ఇక నర్సింగ్ 22 శాతం, పారామెడికల్ స్టాఫ్ 50 శాతం పోస్టులను నింపలేదు. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కయిన పేదల ఆరోగ్యం ఏం కావాలి? మాతా శిశు మరణాలు, సుఖ ప్రసవాలు, తదితర ముఖ్యమైన మానవాభివృద్ధి సూచీల్లో ఎపి అథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలను పిల్లల మరణాల్లో అత్యంత ప్రమాదకర జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది. మలేరియా, డెంగ్యూ ఎపిలో ఉధృతంగా ఉన్నాయని పేర్కొంది. టిబి, ఎయిడ్స్, అంటువ్యాధుల విషయమూ అంతే. ఎపిలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేసి ప్రభుత్వరంగంలో ప్రజారోగ్యాన్ని పటిష్టపర్చాల్సి ఉండగా, ఉన్న సౌకర్యాలను ప్రయివేటీకరించడం ఘోరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల్లేక ప్రయివేటును ఆశ్రయించి ఆస్తులు అమ్ముకుంటున్న వారెందరో ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులపై సర్కారు అజమాయిషీ నామమాత్రం. దీంతో వాటి వ్యాపార దాహానికి హద్దూ పద్దూ లేదు. ప్రభుత్వం ప్రజారోగ్య బాధ్యతను స్వీకరించి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలి. ప్రయివేటీకరణ, కుసంస్కరణలను విడనాడాలి.