ముల్లుగర్ర- కథల సంపుటి
రచయిత: డాక్టర్ వి.ఆర్.రాసాని
పేజీలు: 254, ధర: 170
ప్రతులకు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని
నవచేతన, నవతెలంగాణ, ప్రజాశక్తి బుక్ హౌస్‌లు
ఈ దేశంలో అనాదిగా కొనసాగుతున్నది నిచ్చెన మెట్ల సమాజం. శ్రమ దోపిడీకి, సాంస్కృతిక దోపిడీకీ, ఆర్థిక ఆసమానతలకూ, పీడనకూ అదే కారణం. ఈ సమాజంలో పై మెట్టు మీదున్న ప్రతి వాడు తన కన్నా కింద మెట్టు మీద ఉన్నవాడిని తక్కువగా చూస్తాడు. ఈ వరుసలో అందరికన్నా దిగువ మెట్టుమీద ఉన్నవాడు దళితుడు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో అందరూ దళితుల మీద ప్రేమ ఒలకబోస్తున్నా ఆచరణలో మాత్రం తమ అగ్రకులాధిపత్యాన్నే పాలకులు కూడా ప్రదర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని దళిత బతుకుల వెతల కతలను ''ముల్లుగర్ర'' కథా సంపుటి ద్వారా రచయిత డాక్టర్ వి.ఆర్.రాసాని చర్చకు పెట్టారు. ఈ కథాసంపుటిలోని కథలన్నీ 1988 నుంచి 2014 వరకూ వివిధ పత్రికల్లో అచ్చైనవే. రెండున్నర దశాబ్దాలకు పైగా సమకాలీనంగా గ్రామీణ దళితుల జీవితాల్లో వచ్చిన మార్పులు, వారి ఆవేదనలూ, సమస్యలను రచయిత వీటిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. మొత్తం 21 కథలున్న ఈ సంపుటిలో దేనికదే భిన్నమైనది. ప్రతి కథ కూడా ఎంతో ఆసక్తితో చదివిస్తుంది, చదువరిని తనతో తీసుకువెళ్లి ఆలోచింపజేస్తుంది. సమాజపు అట్టడుగు పొరల్లో బాధామయ గాథలనే పాటల పల్లవులుగా ఆలాపిస్తున్న వారి నరాల్లో ప్రవహించే రుధిర జ్వాలలను రచయిత ఈ కథల్లో అక్షరాలుగా మలిచారా ఆని అన్పిస్తుంది. కథలన్నీ మానవీయతను ప్రతిబింబిస్తున్నాయి. రచయితకు మహిళల పట్ల ఉన్న గౌరవానికి తార్కాణంగా ''కాంతామణి కాలిమెట్టె'', ''అమ్మా! నన్ను చంపేయవూ'',''తెల్ల గుర్రం'' వంటి కథలు నిలుస్తాయి. గ్రామాల్లోని నిమ్న కులాల్లో కట్టుబాట్ల పేరుతో కొనసాగుతున్న అమానవీయతని ''మాత'', ''అక్షింతలు'' అనే కథల్లో కళ్లకు కట్టినట్లు రచయిత చూపించారు. ఈ సంపుటిలోని 'బరియల్ పార్క్'' కథ ప్రత్యేక శిల్పంతో, మంచి కథనశైలితో జీవన వాస్తవికతను ఆవిష్కరించింది. ప్రపంచీకరణ వలన రైతుల బతుకులు ఎలా చిద్రమైపోతున్నాయో చెప్పే కథ ''పెద్ద డైలాగు'', సమాజంలో సంచారజాతులుగా ఉన్నవారి దయనీయతకు ''విషపురుగు'', ''ఆకలి'', ''నాలుగో నాటకం'' వంటి కథలు అద్దం పడతాయి. మొత్తమ్మీద విలువైన కథలను మళ్లీ ఇలా ఒకే సంపుటం ద్వారా అందించిన 'నవచేతన పబ్లిషింగ్ హౌస్' ప్రయత్నం అభినందనీయం.
- బెందాళం క్రిష్ణారావు