సన్నజాజి తీగలా.. నాజూగ్గా.. రెవటలా... సరిగ్గా చెప్పాలంటే సైజ్ జీరోలో వుండాలి. ఇంకా స్పష్టంగా అంటే ... జెన్నిఫర్ లోపెజ్లా, కరీనా కపూర్‌లా, ఇలియానాలా ... స్లిమ్ముగా వుండాలి. ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాటలివి. అమ్మాయిలు అందుకోసం నానా తిప్పలు పడుతున్నారు. కమ్మటి తిండికి దూరమౌతున్నారు. జిమ్ములంటున్నారు. యోగా అంటున్నారు. వర్కవుట్లంటున్నారు. స్పెషల్ డైట్లంటున్నారు. ఎముకల గూళ్లలా తయారౌతున్నారు. లాభాలకోసమైతేనేమి... వీరి మనోభీష్టిని సిద్ధింపచేసేందుకైతేనేమి... సౌందర్యం ఓ పరిశ్రమలా తయారై విస్తరించింది. బరువు తగ్గించే సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సౌందర్య సాధనాల సంగతి సరేసరి. లెక్కలేనన్ని కంపెనీలు వెలిశాయి.
అర్జంటుగా సన్నబడేందుకు దగ్గర దారులు వెతుకుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునే కోమలాంగులకు కొదవు లేదు. 'నువ్వు నాకు నచ్చావ్' అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఆర్తీ అగర్వాల్ మరణోదంతం అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. సైజ్ జీరో కోసం స్వీడన్‌కు చెందిన ఓ పాతికేళ్ల యువతి ఏకంగా పక్కటెముకలనే తీయించుకుందంటే సన్నబడాలన్న కాంక్ష ఆమెలో ఎంత బలంగా వుందో అర్థం చేసుకోవచ్చు. పిడికెడు నడుము కోసం ఆమె ఎంతగా పరితపించిందో తెలుసుకోవచ్చు. మోడళ్లు, సినీ స్టార్లు సన్నగా వుండడం వల్ల వారి వృత్తిలో రాణించడానికి ఉపయోగపడవచ్చేమో! మిగతా వారి సంగతేంటి? ఇంట్లో పని చేసుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, పిల్లాపాపలను సాకాలన్నా పుష్టిగా ఆరోగ్యంగా వుండాలి. ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా ఎండబెట్టుకుంటే నాడీ వ్యవస్థ సరిగా ఎదగదన్నది నిపుణుల మాట.
నిజానికి సైజ్ జీరో కావాల్సింది ఎదిగే వయసులో వున్న అమ్మాయిలకు కాదు. అద్దాల్లో ఆకారాలు కనపడనంతగా అడ్డంగా ఊరిపోయిన రాజకీయ నేతలకు. వైడ్‌గా పెరుగుతూ లిఫ్టుల్లో ఇరుక్కుపోతున్న రాజకీయ నేతలకు జీర్ సైజ్ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు వారు చేసే ఖర్చు జీరో సైజు కావాలి. నేతలు కట్టుకునే భూలోక ఇంద్ర భవంతులు జీరో సైజ్ కావాలి. చిన్నదానికి పెద్దదానికి వారు చేసే ఆర్భాటాలు జీరో సైజ్ కావాలి. తెలివి తక్కువ నిర్ణయాలతో పర్యావరణ కాలుష్యానికి ఆజ్యం పోస్తున్న పెద్దలకు అండదండలనిస్తున్న నేతల ఆలోచనలు జీరో సైజ్ కావాలి. కనీసం అప్పుడైనా ... ఆహార పదార్థాలు, సౌకర్యాలు ఇటు నుంచి అటు బదిలీ అయి ... కొంతలో కొంతయినా సమతుల్యత ఏర్పడుతుంది. తినడానికి తిండి లేక బక్కచిక్కిన వారికి కాస్తన్నా కండ పడుతుంది !
సైజ్ జీరో !
