ఒక వ్యక్తి గురించి బంధుమిత్రులు, తోటి విద్యార్థులు, ఉద్యోగులు అడపాదడపా ప్రశంసిస్తూనే వుంటారు. కానీ అతను 'నిజాయితీపరుడు' అన్న ఒక్క సర్టిఫికెట్ ముందు ఇదిగో ఇలాంటి ఎన్ని అభినందనలైనా దిగదుడుపే. అంత పవర్ఫుల్ మాట అది. పండితుడైనా పామరుడైనా ఎవరైనా సరే జీవితంలో ఆ ఒక్క మాట అనిపించుకోగలిగితే చాలు. వారి జన్మ ధన్యమైనట్టే.
అప్పుడప్పుడు పత్రికల్లో... ఆటో డ్రైవర్ నిజాయితీ, దొంగ నిజాయితీ, కూలీ నిజాయితీ, విద్యార్థి నిజాయితీ... వంటి వార్తలు సచిత్ర కథనాలుగా చూస్తుంటాం. అప్పటివరకు ఆటోలో ప్రయాణించిన కస్టమర్ విలువైన నగో, పెద్దమొత్తంలో నగదో ఆటోలో మర్చిపోయి వెళ్లిపోతే...జాగ్రత్తగా తీసుకెళ్లి మరీ ఇచ్చిరావడమంటే చిన్న విషయం కాదు. కచ్చితంగా అది అతనిలోని నిజాయితీకి నిదర్శనమే. వృత్తి రీత్యా దొంగ అయితేనేం! అందులోనూ ఎంతో కొంత నిజాయితీ వ్యక్తం చేస్తుంటారు కొందరు. దొంగతనానికి వెళ్లినచోట తను ఎంత తీసుకెళ్లిందీ, ఏం తీసుకెళ్లిందీ నోట్ పెట్టి మరీ వెళ్తుంటారు. చోరీ చేయడం నేరమే. అయినప్పటికీ అందులో ఎంతోకొంత నిజాయితీతో వ్యవహరించడమే ఇక్కడ న్యూస్. 'అతనా! తిండికి లేకపోయినా... కాళ్లు కడుపులో పెట్టుకుని పడుకుంటాడుకానీ..ఎవ్వరి ముందూ చెయ్యి చాచడు. గొప్ప నిజాయితీపరుడు...' అన్న మాటలు కార్యాలయాల్లో అత్యంత అరుదుగా వినిపిస్తుంటాయి.
సామాన్యులు సరే. పాలకుల్లో నిజాయితీ ఎంత? అంటే... 'నేతి బీరలో నెయ్యి చందమే.' ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, మేయర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పంచాయతీ సభ్యులు... ఎవర్ని తీసుకున్నా అంతే! నిజాయితీపరులను గద్దె సమీపానికి సైతం రానీకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడుతుంటారు పైసలున్న పెద్దలు. దాంతో ఇప్పుడు నిజాయితీ అనే మాటకు ఆమడ దూరంలో వున్న వారికి... డబ్బు మూటలున్న వారికే టికెట్లు, సీట్ల కేటాయింపులు. వీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాల్లోనూ నిజాయితీకి స్థానమే లేకుండా జాగ్రత్త పడుతుంటారు. చదివిన విద్య, దాని తాలూకు సర్టిఫికెట్లు.. ఆస్తులు... పాస్తుల వివరాలన్నీ తప్పుల తడకల. దొంగ సర్టిఫికెట్లే. కేవలం ఆ కారణంగానే కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ పదవులు పోగొట్టుకున్న వారిని ఎందర్ని చూడలేదు. ఇక వీరు ఎన్నికల ముందు చేసే వాగ్దానాలు, ప్రకటించే మేనిఫెస్టోలకు ... ఎన్నికలయ్యాక గద్దెనెక్కాక వారు నెరవేర్చేదానికి పొంతనే వుండదు. ముందు ఏవేవో చెప్పేస్తారు. అరచేతిలో స్వర్గం చూపించేస్తారు. అసలు వాటిని నెరవేర్చగలమా? లేదా? అన్న విచక్షణే వారిలో అణుమాత్రం కనిపించదు. వందల కోట్ల రూపాయలతో విశ్వస్థాయి రాజధానిని నిర్మిస్తానని బాబుగారు తెగ ఊదరకొట్టారు. ఇప్పుడు దాని పరిస్థితి ఎక్కడ వుందంటే...వేసిన కాడే వుంది. ఒక్క అంగుళం కూడా కదల్లేదు. మోడీజీ సైతం అంతే. ప్రధాని అయిన దగ్గర నుంచి విదేశీ ప్రయాణాలతోనే సరిపోతోంది దేశ ప్రజల గురించి ఆలోచించింది చేసింది తక్కువ. వారి దాకా ఎందుకు? పంచాయతీ సభ్యులు ఎంతెంత పొడవాటి వాగ్దానాలు చేస్తారనీ. సిమెంటు రోడ్లంటారు. గుళ్లంటారు. బళ్లంటారు. అలా చెప్పేస్తూనే వుంటారు. తమకు ఎంత మేర నిధులొస్తాయి? చేసిన వాగ్దానాలను నెరవేర్చడం ఎంతవరకు సాధ్యం? అన్న విచక్షణే వారిలో కనిపించదు.
నిజంగా చెప్పింది చేయాలన్న నిజాయితీ వుంటే ఉత్తుత్తి వాగ్దానాలతో ఊదరగొట్టేయ్యరేమో ఈ నాయకీమణ్యులు.
నేతల నిజాయితీ
