'నేను రాను బిడ్డో మన వూరి దవాఖానకు...' అన్న పాట ఎనభైల్లో విపరీతంగా ఆకట్టుకున్న మాస్ పాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దుర్భర పరిస్థితులను ఇలా అలతి పదాలతో కళ్లకు కట్టాడో సినీ కవి. ఆశ్చర్యం! మూడు దశాబ్దాల తర్వాతా... అవే అస్తుబిస్తు భవనాలు, అరకొర వైద్యులు, మందులు, కానరాని పారిశుధ్యం.
వైద్యశాల అంటే పరిశుభ్రతకు ప్రతిరూపంలా వుండాలి. లోపలికి అడుగెట్టడంతోటే రోగికి సగం జబ్బు నయం కావాలి. అంతటి ప్రశాంత వాతావరణం వుండాలి. ఆవరణలోగాని, ఆస్పత్రిలోగాని ఎక్కడా రోగ కారకాలు కనిపించకూడదు. మన ప్రభుత్వాసుపత్రులు అలా వున్నాయా?!
ఓ వైపు ముక్కుతూ మూల్గుతూ లోపలికి వెళ్లే రోగులు. మరోవైపు మురుగు నీటి నిల్వలు. ఆ నీళ్లల్లో దోమలు, పందులు సకుటుంబ సపరివార సమేతంగా దినదినాభివృద్ధి చెందుతుంటాయి. ఆ పైన శునకాలు, మూషికాలు, సర్పాల సంగతి సరేసరి. ఇవికాక టన్నుల్లో పోగయ్యే వైద్య వ్యర్థాలు. ఇవన్నీ చూస్తుంటే... 'అవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ డస్టబిన్స్ ఆఫ్ సొసైటీ (మన ప్రభుత్వ ఆసుపత్రులు సమాజపు చెత్తకుండీలు) అన్న ఓ పెద్దాయన మాట గుర్తొస్తుంది. నిజమే కదా!
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...భయంతో బిక్కుబిక్కుమంటూ ఆస్పత్రికొచ్చిన వారికి ఆహ్వానం పలికేది, బతుకుపై భరోసా కల్పించేది వైద్య సిబ్బంది కాదు. దోమలు, ఎలుకల బృందాలే. ఐసియుల్లో వున్నా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోడానికి వుండదు. ఎప్పుడు ఏ మూషికం ఏ కలుగులోంచి బయటికొస్తుందో... రోగి శరీరాన్ని ఎక్కడ ఏ భాగంలో చప్పరిస్తుందో తెలీక ... భయంతో బిగుసుకుపోవాల్సిందే. మూషికాల ముప్పేట దాడి చేశాక... ప్రాణాలు పోయాక...మంత్రులు, ఎమ్మెల్యేలు కంటి తుడుపు మాటలు, ఉత్తుత్తి సస్పెన్షన్లు చేస్తారు. కమిటీలు, రిపోర్టులు... అంతకుమించి ఎలాంటి మార్పు జరగదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత మొత్తుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందమే.
ఎలుకల సమస్య అనేక అంశాలతో ముడి పడి వుంది. ఆస్పత్రి ఆవరణలో చెత్తా చెదారం, తినుబండారాలు- వైద్య వ్యర్థాలు పోగుబడడం వల్ల ఎలుకలు తయారౌతాయి. ఎలుకల కోసం పాములూ పోగవుతాయి. ఇన్ని సమస్యలకు ప్రధాన కారణం. ప్రభుత్వ అలసత్వమే. సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులు ప్రయివేటు ఆసస్పత్రులు పెట్టుకోవడానికి అనుమతిచ్చేదీ, వారికి ఏళ్ల తరబడి సెలవులిచ్చేదీ ప్రభుత్వమే. అక్కడి అవకతవకలను, అపరిశుభ్రతను, అవినీతిని చూసీ చూడనట్టు వదిలేసేదీ ప్రభుత్వమే. అవసరమైన మందులు, వైద్య పరీక్షలకు కావాల్సిన పరికరాలు లేకపోవడానికి, ఎలుకల పాలబడి పసిబిడ్డడు ప్రాణాలు కోల్పోవడానికి కారణం చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వమే. దాన్ని సరైన మార్గంలో పెట్టగలిగితే ... ఆస్పత్రుల్లో సమస్యలన్నీ వాటంతటవే పరిష్కారమౌతాయి.