మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉంటారనేది ఓ నమ్మకం. వుండొచ్చు. వుండకపోవచ్చు కూడా. నిర్ధారణ అయిన ఉదంతాలైతే లేవు. అయితే... కవలలు కాకుండా, మనకు అస్సలు పరిచయమే లేని, మనలాంటి పోలికలున్నవారు అకస్మాత్తుగా ఎదురుపడితే గిల్లుకుని మరీ చూస్తాం. ఈ అవకాశాన్నే కల్పిస్తామంటున్నాయి సామాజిక మాధ్యమాలు. వాటి ద్వారా కలుసుకున్నవారూ ఉన్నారు.
సద్దాం హుస్సేన్, అతడి కొడుకు ఉదరు హుస్సేన్‌లు దాడుల్ని తప్పించుకునేందుకు వారిని పోలిన మనుషుల్ని వాడేవాళ్లని అంటారు. దీనిపై 'డెవిల్స్ డబుల్' అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది. హిట్లర్‌కు చాలామంది డబుల్స్ ఉండేవారట. హత్యాయత్నాల్లో వీరే బలైపోయేవారట. మన సినిమాల్లోను ఇలాంటి కథలు ఎన్నో వచ్చినా...అన్నీ హడావుడిగా సృష్టించినవే. వాటి విజయ రహస్యం మనిషి ఆలోచనలోనే ఉంది. తనలాంటి వ్యక్తులను చూడాలని, కలవాలనే ఆశ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఎదురు పడితే తప్ప ఈ విషయాన్ని అంతగా పట్టించుకోం. కానీ, కొందరు అలా కాదు తమ లాంటి వారిని వెతుకుతూ ఏళ్లకు ఏళ్లు, ఊళ్లకు ఊళ్లు తిరిగారు. ఈ కొత్త మిలీనియం తొలి ఏడాదిని పురస్కరించుకుని 2000 నుంచి కెనడియన్ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ బ్రునెల్లి 'ఐయామ్ నాట్ లుక్ అలైక్?' అనే ప్రాజెక్ట్ చేపట్టాడు. తాను అచ్చుగుద్దినట్టు హలీవుడ్ నటుడు, 'మిస్టర్ బీన్' రోవాన్ అట్కిన్సన్ను పోలి ఉంటాడనే విషయం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. వారిలానే మిగతా వాళ్లు ఒకరిని పోలిన మనుషులు ఒకరిని గుర్తించి వారి ఆల్బమ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచమంతా చుట్టొచ్చి సుమారు 200 మంది పోలిన మనుషుల పోట్రైయిట్లు తీసుకుని ఓ ఆల్బమ్ రూపొందించే పనిలో పడ్డాడు. ఇప్పటికే చాలామందిని ఆయన ఆల్బమ్‌లో చేర్చేశాడు. వీరిలో ఓ మహిళ జంట ఇద్దరికీ పెళ్లిళ్లై ఒకే వయసున్న పిల్లలున్నారు. 2011లో బ్రిటన్‌కు చెందిన జర్నలిస్టు సోఫి రాబెహ్మద్ కూడా ప్రపంచ యాత్ర చేపట్టింది. రెండేళ్ల శ్రమ తర్వాత తన మిత్రునితో కలిసి పనిచేసిన వ్యక్తే అలా ఉండటంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. బర్మింగ్హమ్కు చెందిన లారెన్ హ్యాచర్ అనే మహిళ అచ్చు తనలానే ఉండటంతో మిత్రుని ద్వారా ఆమెను లండన్‌లోని కోవెంట్ గార్డెన్లో కలుసుకుంది. ఏబీసీ చానెల్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా పనిచేసేవారికి దగ్గరి పోలికలున్న వారు తెలియజేయాల్సిందిగా ఓ తమాషా కార్యక్రమాన్ని రూపొందించింది. లారా స్పెన్సర్ అనే వ్యాఖ్యాతకైతే అచ్చు అదే ఎత్తు, ఆకృతి, హెయిర్ స్టైల్ ఉన్న అమ్మాయి దొరికింది. ఇలియట్, చాంపియన్ అనే వ్యాఖ్యాతలకు కూడా వారి లాంటి వ్యక్తులే ఎదురయ్యారు. మరో వ్యాఖ్యాత రాబర్ట్స్ అయితే తనలాంటి వ్యక్తిని చూసి వెనక్కు గంతేసింది ఆ షోలో. ఆ ఇద్దరూ కూడా నాలుగు నెలల తేడాతో అమెరికాలోనే జన్మించారు. జానీ సాండ్గ్రోవ్, మైకేల్ హారిస్‌లు అనే పరిచయంలేని వ్యక్తులు కూడా ఒకేలా ఉండటంతో వారి కామన్ ఫ్రెండ్ నవోమీ వారిని కలిపింది. వారిద్దరూ మంచి మిత్రులైపోయారు. అయితే మైకేల్, నవోమీ పెళ్లి సందర్భంగా సొంత కుటుంబం వాళ్లు కూడా పొరపాటు పడి జానీకు శుభాకాంక్షలు చెప్పారట.
అలాంటి వారికోసం సైతం ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చాలా వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. వాటిలో బాగా ఆకట్టుకుంటోంది మాత్రం 'ట్విన్ స్ట్రేంజర్స్.కామ్'. ఫేస్బుక్లో కూడా పేజీని క్రియేట్ చేసి ఒకరిని పోలిన వారిని ఓ వేదిక కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా దానిలో మీ ఫొటోలు ముఖాకృతి వివరాలు నమోదు చేయడమే. ఆ వెబ్సైట్ సృష్టికర్త 26 ఏళ్ల నియామ్ జీనీ అనే అమ్మాయికి తనలాంటి వ్యక్తినే చూశానని మిత్రులు అంటుండేవారు. మొదట్లో పట్టించుకోకున్నా అలాంటి వారిని కలుసుకోవాలని ఆలోచన పుట్టింది. వెంటనే మరో ఇద్దరు మిత్రులతో కలిసి ట్విన్ స్ట్రేంజర్స్ వెబ్‌సైట్‌ను తయారుచేసింది. ఫేస్బుక్ ద్వారా ప్రచారం కల్పించిన కొన్ని రోజులకే ఆమెను పోలిన వారి నుంచిబోలెడు పోస్టులు అందాయి. ప్రపంచ నలుమూలల్లోని అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ చివరకు మనదేశం నుంచీ ఆమెను పోలికలు ఉన్నవారు కనిపించారు. అయితే తనకు జిరాక్స్ తీసినట్టుండే అమ్మాయి మాత్రం పక్క ఊరులోనే ఉందని తెలిసి ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. కారెన్ బ్రానిగన్ అనే 29 ఏళ్ల ఐర్లాండ్ అమ్మాయి డబ్లిన్‌కు దగ్గరలోనే ఉందని తెలిసి ఆమెకు కలిసింది. సరిగ్గా తన పోలికలతో పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండటంతో చాలాసేపు అలా అవాక్కై చూస్తుండిపోయిందట. కేరెన్కు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉంటే, జీనీకి ఒక సోదరుడు, ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. వారిలో ఇంకెవరూ కూడా లేనంత దగ్గరగా కేరెన్, జీనీ కవల పిల్లల్లా ఉన్నారని ఆమె పో స్టు చేసింది. వారివురి ఫొటోలు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తోంది. ఇంకో విషయమేమిటంటే వీరిని పోలిన అమ్మాయి ఇటలీలో మరొకరు ఉన్నారట. ఈ మధ్యే వెబ్సైట్లో ఫొటో పెట్టింది. ఈ లెక్కన జీనీకి తాను అనుకున్న ఆరుగురు దొరికేలానే ఉన్నారు. మీకు కూడా మీ పోలికలున్నవారిని కలవాలని ఉంటే ఆ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని శాస్త్రవేత్తలూ నిర్థారిస్తున్నారు కూడా. మనుషుల్లో ఏ ఇద్దరిని తీసుకున్నా వారి డీఎన్ఏలోని జన్యు నిర్మాణం 99.5 శాతం జతపో లుతుంది. మిగతా 0.5 శాతంలోనే కోటి అరవై లక్షల బేస్ పెయిర్లుంటాయి. వీటి నిర్మాణంలోని భిన్నత మూలంగానే శరీర, ముఖాకృతుల్లో తేడాలు వస్తాయి. మనల్ని పోలిన వారితో ఎంత దగ్గరగా ఉంటామో జెనెటిక్ మేకప్ కూడా అంత దగ్గరగా ఉంటుందని బేయ్లర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త ఆర్థర్ బ్యూడెట్ చెబుతున్నారు. వెతకాలే కానీ... చైనా, భారత్‌లాంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో ఇలాంటి వారు ఎక్కువగా కనిపిస్తారేమో!
ఆ ఏడుగురు...
