బంధించటం, స్వేచ్ఛను హరించటం పక్షులు, జంతువుల విషయంలోనే కాదు, అనేక హక్కులు కలిగి ఉన్న మనకూ వర్తిస్తుంది. నెలల తరబడి ఒకే గదిలో బంధించటం వారి కదలికల పై రహస్య కెమెరాల నిఘా ఉంచటం, నియంత్రించటమనేది ఓపెన్ జైలు చందమే అని మానవ హక్కుల సంఘాలు ఆక్రోశిస్తున్నాయి. నియంతృత్వ మనస్తత్వానికి వికృత పోకడలకు ఇది అద్దం పడుతోందనేది వారి వాదన. తెలుగు సీజన్లో ఏం చరిత్ర సృష్టించబోతోందో కాని, టెలి విజన్ చరిత్రను పరికించి చూస్తే దేశమేదైనా భాష ఏదైనా బిగ్ బాస్ షో, దానికి మూలమైన బిగ్ బ్రదర్ షోలపై చెలరేగిన దుమారాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మాటకొస్తే ఈ షోలకు కారణమైన నవల మీద సైతం అప్పట్లో అంతే స్థాయి ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న 'రియాల్టీ షో' పట్ల తెలుగు ప్రజలకు మక్కువ ఉందని, సెలబ్రిటీలు సైతం ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలలకు పైగా తమ వ్యక్తిగత జీవితాలను, సంతోషాలను, అలవాట్లను త్యాగం చేయాల్సి వచ్చినా, భావోద్వేగాలకు గురయ్యే విధంగా దాదాపు జైలు జీవితం గడపాల్సి వచ్చినా సరే బిగ్ బాస్ పిలుపు కోసం నిరీక్షిస్తుండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
ఒకరికొకరు ఏమీ కాని పలు రంగాల ప్రముఖులు ఒకే ఇంట్లో మూడు నెలలకు పైగా కలిసి జీవించటం. సినిమా ప్రముఖులు టెలివిజన్ తారలు తదితర సెలబ్రిటీలు చూస్తున్న సినిమానో లేక ప్రోగ్రాంలో కాక వారి ఇళ్ళల్లో ఎలా ఉంటారు? ప్యాకప్ చెప్పాక వారి బిహేవియర్ ఎలా ఉంటుంది? వారికి వంట వచ్చా, ఇంటి పనులు తెలుసా, ఆఫ్ స్క్రీన్‌లో ఎల ఉంటారు? స్క్రిప్ట్ లేకుండా ఏం మాట్లాడుతారు? వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎలా ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకునే సామాన్య జనం కుతూహలమే బిగ్ బాస్ ప్రపంచ దేశాల్లో ఆదరణ రహస్యం. దేశాలు వేరైనా మనుషుల మనస్తత్వాలు దాదాపు దగ్గరే. బిగ్ బాస్ ఇల్లు మన తెలుగు ఇళ్ళతోనే మొదలు కాలేదు.. ప్రపంచంలోని అనేక దేశాల అనంతరం మన తెలుగు రాష్ట్రాలకు పాకింది. పార్టిసిపెంట్స్ ఎవరో? ఎవరో? అని వేచి చూస్తే ఫేడ్ అవుట్ ఫేస్‌లను పట్టుకొచ్చారన్న కామెంట్లూ వచ్చాయి. అయినా టీవి రేటింగ్ ఏమీ తగ్గలేదు. జనం అభిప్రాయం వేరు ఆచరణ వేరు. భిన్న అభిప్రాయాలు మన దగ్గరే మొదలు కాలేదు ప్రపంచ వ్యాప్తంగా ఈ షోతో పయనిస్తున్నాయి.
'నైంటీన్ ఎయిటీ ఫోర్' అనే నవల స్ఫూర్తితో ఈ రియాల్టీషో కి పునాది పడింది. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత ఈ నవలను 1949లో రాశారు. ఒక నియంత ప్రభువు తన దేశంలోని ప్రజల కదలికలను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన విధానం ఈ నవల సారాంశం. నవల వెలువడిన 50 ఏళ్ళకు నెదర్లాండ్స్‌కు చెందిన టీవీ ప్రెజెంటర్ జన్ మోల్ దీన్ని 'బిగ్ బ్రదర్ రియాల్టీ షో' పేరుతో అక్కడి టెలివిజన్‌లో ప్రదర్శించారు. అనంతరం ఈ షో 54 దేశాలకు పాకింది. 400 సీజన్లు పూర్తి చేసుకుంది. హిందీలో బాలీవుడ్ నటులు అర్షద్ వర్శి, శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవరించారు. డ్రగ్స్ కేసులో ఉన్న మొమైత్ ఖాన్‌ను ఈ షోకు ఎలా తీసుకున్నారు? సగటు తెలుగు జనానికి అర్థం కాని ప్రశ్న. అది కూడా ప్రోగ్రాం రేటింగ్‌ని పెంచే ఎత్తుగడే. అసలు ఆ మాటకొస్తే వివాదాల్లో ఉన్న వారిని సెలబ్రిటీలుగా పిలవటం కూడా ఈ షోలో ఒక భాగమే. హిందీలో డ్రగ్స్ కేసులో ఉన్న రాహుల్ మహాజన్, అండర్ వరల్డ్ డాన్ అబూసలేం కేసులో ఆరోపణలకు గురైన మోనికా బేడీ ఈ షోలో పాల్గొన్న వారే. ఈ ఆరోపణలు ఎలా ఉన్నా ప్రేక్షకులు తమ గదుల అరల నుండి బయటపడి ఇంట్లోని తమ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టీవి సెట్ ముందుకు చేరుతున్నారు. వారి ఫోన్, వాట్సాప్, ఫేస్ బుక్‌లకు కొంత విరామం. అదీ ఈ షో పార్టిసిపెంట్స్ మాదిరిగానే.
- కంచర్ల శ్రీనివాస్
8346611455