రౌతును బట్టి గుర్రం అనే సామెత ఊరికినే పుట్టలేదు. పాలకులు తమ విధానాలతో వ్యవసాయరంగాన్ని అంతకంతకూ సంక్షోభంలోకి నెడుతుండగా, ఆ విధానాలను పుణికిపుచ్చుకున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బిఐ) ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య రైతులకు రుణ మాఫీ పథకాలు వద్దే వద్దని రైతు వ్యతిరేకతను బయట పెట్టుకున్నారు. రీపేమెంట్ డిసిప్లిన్ కర్షకులు తప్పుతున్నారని, అది కనుక లోపిస్తే బ్యాంకులు దివాలా తీస్తాయని బుధవారం ముంబయి లో చెప్పు కొచ్చారు. ఆమె మరో అడుగు ముందుకేసి, ఒకసారి అప్పులు రద్దు చేస్తే ప్రభుత్వాలు చెల్లిస్తాయి కాబట్టి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని, కానీ మళ్లీ ఎన్నికల్లో ఇలాంటి పథకాలు వస్తాయని ఆశించి రైతులు రెండో తడవ తీసుకున్న అప్పులను సైతం చెల్లించరని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) అవుతారని రైతులను నేరస్తులుగా చిత్రీకరించారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఇంతగా ద్వేషాన్ని కుమ్మరించింది సాదాసీదా వ్యక్తి అయితే ఏదోలే అనుకోవచ్చు. దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులన్నింటిలోకి అతిపెద్దదైన ఎస్బిఐకి ఛైర్పర్సన్ ఇలా కర్షక వ్యతిరేకత ప్రదర్శించడం ఆందోళనకరం. నిజంగా రుణమాఫీ పథకాలపై వ్యతిరేకత ఉంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్వయంగా ప్రధాన మంత్రి మోడీ వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పుడే బహిరంగంగా తన అభిప్రాయాన్ని అరుంధతి వెల్లడించి ఉంటే బాగుండేది. కేంద్రంలోని అధికార పార్టీకి ఎందుకు ఎదురెళ్లాలి అని ఆమె భావించినట్లున్నారు. ఎన్నికల ప్రహసనం ముగిసి బిజెపి అధికారంలోకొచ్చాక ఇప్పుడు నింపాదిగా రుణ మాఫీపై విషం చిమ్మడం దారుణం. ఎస్బిఐ ఛైర్పర్సన్ వ్యాఖ్యలు ఇప్పుడు బిజెపికి చిలకపలుకుల్లా వినిపిస్తున్నట్లు న్నాయి. ఎందుకంటే ఎన్నికలైపోయాయి కనుక రుణ మాఫీ అమలు చేయడానికి బ్యాంకులు అడ్డుపడుతున్నాయని సాకు చెప్పి తప్పించుకోడానికి తోవ దొరికిందని సంబ్రపడుతున్నట్లున్నారు బిజెపి నేతలు. లేకపోతే ఈపాటికి అరుంధతి వ్యాఖ్యలపై ఎవరో ఒకరు స్పందించేవారే.
వాస్తవానికి తెగ బలిసిన కార్పొరేట్లే బ్యాంకులకు సున్నం పెడుతున్నారు. ఈ మాట అన్నది స్వయాన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఢిల్లీలో బుధవారమే జరిగిన సంప్రదింపుల కమిటీ భేటీలో ఉక్కు, విద్యుత్, ఇన్ఫ్రా, టెక్స్టైల్ సంస్థలకు చెందిన మొండి బకాయిలు (ఎన్‌పిఎ) బ్యాంకుల్లో పేరుకుపోయాయంటూ, వసూళ్ల కోసం రంగాలవారీగా కమిటీలు వేస్తున్నామని తెలిపారు. జైట్లీ ఇలా చెప్పారు కనుక కార్పొరేట్ల నుంచి గోళ్లూడగొట్టి బకాయిలు వసూలు చేస్తారా అనుకుంటే పొరపాటే. నిరుడు నవంబర్‌లో ఇదే అరంధతి నేతృత్వంలోని ఎస్బిఐ ఒక్క విడతలో బడా కంపెనీలకు చెందిన రూ.7 వేల కోట్ల అప్పులు రద్దు చేయగా, అందులో దేశం విడిచి పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజరు మాల్యా రుణాలు రూ.1,200 కోట్లు. వివిధ బ్యాంకులకు రూ.పది వేల కోట్లకుపైన ఎగనామం పెట్టి విదేశాలకు ఉడాయించిన మాల్యాపై అరుంధతికి ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చినట్లు? ఆమె జమానాలోనే మాల్యాకు ఎస్బిఐ నుంచి రూ.9 వేల కోట్లు మంజూరయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. కాగా అప్పట్లో ఎస్బిఐ రుణాల రద్దును బిజెపి, ముఖ్యంగా జైట్లీ పార్లమెంట్ సాక్షిగా మద్దతు పలికారు. అప్పులు రద్దు చేయడం కాదు, ఎన్‌పిఎలను ఒక పద్దు నుంచి మరో పద్దుకు మార్చామని సమర్ధించుకున్నారు. వసూలయ్యే అవకాశం లేదని బ్యాంకులు, ప్రభుత్వం తేల్చాక ఎవరైనా అప్పులు కడతారా? కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు పోటీపడి కార్పొరేట్లకు చెందిన రూ.లక్షల కోట్ల బ్యాంక్ రుణాలను బ్యాడ్ బకాయిలుగా చూపి రద్దు చేసి, పదో పరకో అప్పున్న రైతులపై అపరాధులన్న ముద్ర వేయడం దుర్మార్గం.
రుణ మాఫీ పథకాలను పలు రాజకీయపార్టీలు ఎన్నికల స్టంట్‌గా మార్చేశాయి. ఏపీలో మాఫీపై చంద్రబాబు సర్కారు ఎన్ని విన్యాసాలు చేసి రైతులను మోసం చేసిందో తెలిసిందే. మాఫీకి సాయం చేయాలంటూ 2014లోనే ప్రధానిని చంద్రబాబు కోరితే కుదరదని తోసిపుచ్చినట్లు వార్తలొచ్చాయి. అదే మోడీ యూపి రైతులకు మాఫీ వాగ్దానం చేశారు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏ విధంగా బిజెపి ఎన్నికల హామీ నెరవేరుస్తుందో చూడాలి. ఎన్‌డిఎ సర్కారులో భాగం పంచుకున్న చంద్రబాబు దీనిపై బిజెపిని నిలేయాలి. విభజన వలన నష్టపోయిన ఏపీకి కేంద్రం నుంచి మాఫీ సాయం సాధించి రైతులను ఆదుకోవాలి. కాంగ్రెస్, బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తున్నారు. రైతుల సంస్థాగత పరపతికి కోత పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పరపతి విధానాన్ని మారుస్తున్నారు. ప్రయివేటు అప్పులు, ఉత్పాదకాల ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు, పంటలకు గిట్టుబాటు ధర లేమి ఈ కారణాలతోనే లక్షలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతులు బకాయిలు చెల్లించలేకు న్నారు. ప్రభుత్వాలు రైతు వ్యతిరేకతను విడనాడితే రుణ మాఫీ పథకాల అవసరం ఉండదు. వాస్తవానికి రైతులు కోరుకునేది సర్కారీ విధానాల మార్పు వంటి శాశ్వత పరిష్కారాలు తప్ప మాఫీ వంటి తాత్కాలిక ఉపశమనాలు కాదు.