వానాకాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు కారణం దోమకాటు. నిల్వ ఉండే నీళ్లలో పెరిగే దోమలు ఇంటిలో చేరి చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తాయి. దోమ కుడితే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి. ఆ రోగాలను నివారించాలంటే ముందుగా దోమలను అరికట్టాలి. మార్కెట్లో ఎన్నో రకాల దోమనివారణ కాయిల్స్, లిక్విడ్స్, కెమికల్స్ వచ్చినా.. అవి చాలా ఖర్చుతో కూడినవి. వీటిని అధికంగా ఉపయోగిస్తే.. శ్వాస సంబంధమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేలా ఆరోగ్యకరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విషజ్వరాల బారినపడకుండా ఉండవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- దోమలు ఎక్కువగా ఉంటే వేడివేడి పెనంపై టీ పొడి చల్లితే.. ఆ ఘాటు వాసన భరించలేక దోమలు బయటకు వెళ్లిపోతాయి.
- ఒక చిన్న గిన్నెలో నీళ్లుపోసి అందులో ఐదు, ఆరు కర్పూరం బిళ్ళలను వేసినా.. ఆ ఘాటు వాసనకు దోమలు దూరంగా పారిపోతాయి.
- లెమన్‌గ్రాస్, పుదీనా, బంతి మొక్కలను కుండీలలో పెంచినా.. దోమలు ఆ ఇంటి పరిసరాల్లోకి రావు.
- దోమ కుట్టినచోట నొప్పి, దురదగా ఉంటే వెనిగర్‌లో ముంచిన దూదితో మృదువుగా రుద్దితే ఉపశమనం కలుగుతుంది.