జాషువా రచనలు నేటి యువతకు ఆదర్శనీయమని వాణిజ్య పన్నుల శాఖాధికారిణి (సిటిఒ) బండి నాగలక్ష్మీ అన్నారు. 'జాషువా సాహిత్యం-దృక్పథం పరిణామం' అనే అంశంపై స్థానిక ఆర్కె జూనియర్ కళాశాలలో సదస్సు శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాషువా రచనలు మహాద్భుతమైనవని కొనియాడారు. ఆయన కళ్లు తెరిచే నాటికే ఎంతోమంది కవులు, రచయితలు తిరుపతి వెంకటకవి లాంటి కవులు ఉన్నారన్నారు. సాహిత్యం, సమాజాభివృద్ధికి దోహదపడే విధంగా జాషువా రాసిన రచనలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన జాషువా సమాజాన్ని కదిలించే విధంగా రచనలు చేశారన్నారు. ప్రతి అంశం తన రచనా చాతుర్యంతో సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా వ్యవహరించారని తెలిపారు. ఆర్కె సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ బండి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ అమూల్యమైనదన్నారు. చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చు కుంటూ జాషువా లాంటి కవుల రచనలను చదవాలన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్ మేనేజర్ పి.క్రాంతికిరణ్ మాట్లాడుతూ ప్రజాశక్తి బుకహేౌస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ పుస్తకాలు కొనుగోలు చేయడానికి అన్నివర్గాల ప్రజలు తరలివచ్చారన్నారు. చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కొడాలి శర్మ మాట్లాడుతూ జాషువా రచనలు మహాద్భుతమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జాషువా యువతకు ఆదర్శం
