రాష్ట్రంలో రానున్న మూడేళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలుమూడేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి సమూలంగా మారనున్నాయని
పంచాయతీరాజ్, గనులు శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం మానికొండలోని గోగినేని పిచ్చయ్య చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. వైసీపి గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షన సభ జరిగింది. తొలుత పాఠశాల ప్రాంగణంలోని మహాత్మ గాంధీ,గోగినేని పిచ్చయ్య చౌదరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ,విద్యార్థులకు మంత్రి చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అందులో 15,715 పాఠశాలలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో మొదటి దశలో భాగంగా గుర్తించి అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత రెండేళ్ళల్లో అన్నీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్యాన్లు, మంచినీరు, ప్రహరీగోడలు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమత్తులు, బ్లాక్ బోర్డులు, అవసరమైతే అదనపు తరగతి గదులు వంటి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. కృష్ణా జిల్లాలో 3,833 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, మొదటి దశలో 1077 పాఠశాలలు అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతున్నామంటే ప్రతిపక్షాలు గోలచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుని తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందిం చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని, అందుకు బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించమమే నిదర్శనమని అన్నారు. జిల్లాలో మానికొండ పాఠశాల ప్రత్యేక గుర్తింపు పొందిందని, అందుకే పాఠశాల అభివృద్ది కోసం నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.1.94 కోట్లతో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి మరో రూ.53 లక్షలు కేటాయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కంటే నాణ్యమైన విద్యను అందించే శక్తి,ప్రోత్సాహం ప్రభుత్వ టీచర్లలో ఉందని, ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దేందుకు ఉపాధ్యాయులు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర సభ్యులు దుట్టా రామచంద్రరావు,మాజీ శాసన సభ్యులు దాసరి వెంకటబాలవర్థనరావు,జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, జాయింట్ కలెక్టర్-2 మోహన్‌కుమార్, నూజివీడు సబ్‌కలెక్టర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, డిఈవో రాజ్యలక్ష్మీ,ఎస్. ఎస్.ఎ పిడి ప్రసాద్, మోప్నా పిడి సూర్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మవాణి తదితరులు పాల్గొన్నారు.
మూడేళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారాలి
