ప్రజాశక్తి- ఘంటసాల : శ్రీకాకుళాన్ని తెలుగు సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలని, దివ్యమైన సాంస్కృతిక రాజధానిగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కోరారు. మండలం శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి, పర్యాటకశాఖ, దేవాదాయ ధర్మాదాయశాఖ, దివి ఇతిహాసిక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకృష్ణదేవరాయుల బ్రహ్మోత్సవాలను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఇనాక్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయుల మహోత్సవాలను నిర్వహిస్తూ ఎందరో కవులను, రచయితలను ఆహ్వానించి వారిని సత్కరించటం తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటమేనన్నారు. బుద్ధప్రసాద్ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటిని భావితరాలకు అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇక్కడ అనేక వనరులున్నాయని, కళ, సాంస్కృతిక కార్యాలయాలను నెలకొల్సాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతుల్లో ముఖ్యమైంది సాంప్రదాయమని, తెలుగునేలపై ఆముక్తమాల్యద కావ్యాన్ని మించిన కావ్యం మరొకటి లేదని ఆయన స్పష్టం చేశారు. అందరూ సుఖపడాలని ఆచరించి చూపింది తెలుగు సంస్కృతిఅన్నారు. జాతి సంస్కృతి, మనిషి స్వభావాన్ని ఆ కావ్యం తెలిపిందని చెబుతూ తెలుగుభాషా సాంస్కృతికశాఖ వందల గ్రంధాలను అందిస్తుందన్నారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఎంతో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని, ఆంధ్రజాతికి దేవుడు మహావిష్ణువు అని తెలుపుతూ ఒకప్పుడు దేవాలయాలు కళలకు నిలయంగా కలలకు నిలయంగా ఉండేవని, వందల సంవత్సరాల నుంచి ఆలయ నృత్యాలు జరిగేవన్నారు. తర్వాత అవి కనుమరుగైన నేపథ్యంలో సప్పా దుర్గాప్రసాద్ ఆలయ నృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. కళాకారులకు జన్మనిచ్చిన భూమి శ్రీకాకుళమని, తెలుగుభాషా సంస్కృతికి జీవంపోసింది శ్రీకృష్ణ దేవరాయులన్నారు. దేవదాసీలకు సైతం అపూర్వగౌరవాన్ని ఆయన కల్పించారని, సంస్కృతిని నిలబెట్టుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భావితరాలు సంస్కృతి థృక్పదాన్ని అలవర్చుకోవాలన్నారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ అభినవ కృష్ణరాయులు మండలి బుద్ధప్రసాద్ అని, ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 400 సంవత్సరాల క్రితం మహావిష్ణువు సన్నిధిలో శ్రీకృష్ణదేవ రాయులు నిద్రపోయి ఆముక్తమాల్యద గ్రంధం రచించారని, ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తుమ్మల వరలక్ష్మి, మాజీ ఎఎంసి చైర్మన్ తుమ్మల చౌదరిబాబు, ఎంపిటిసి ఎ.సీతారామరాజు, శ్రీకాకుళం పిఏసిఎస్ అధ్యక్షులు అత్తలూరి గోపీచంద్, మాజీ సర్పంచ్ తిరుమలశెట్టి భవానితోపాటు తదితరులు పాల్గొనగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శారదాకుమారి, ఆలయ సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం శ్రీకాకుళేశ్వరస్వామివారిని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అధ్యక్షులు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రాచార్య శలాక రఘునందనశర్మ, పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు, అన్నవరపు రామస్వామి, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, కళారత్న సప్పా దుర్గాప్రసాద్, యడ్లపల్లి శ్రీదేవి దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఆకట్టుకున్న రంగవల్లులు:
తెలుగు సంస్కృతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఆదివారం మహిళలు, విద్యార్థినులు రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రధాన రహదారిపై ముగ్గులనువేసి వాటిని రంగులతో తీర్చిదిద్దారు. ఆయా ముగ్గులను ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కవులు, కళాకారులు, రచయితలు పరిశీలించారు.
సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలి
