నాకు వానంటే ఇష్టం
పిల్లా పెద్ద ముసలి ముతకా
బీదా బిక్కి అందరిపై కురిసే
సమానత్వం వాన
అందరినీ తడిపే ప్రజాస్వామ్యం వాన
నాకు వానంటే అందుకే ఇష్టం
మొండి గోడల మీద రంగు డాబాల మీద
పెంట కుప్పల మీద ఉద్యానవనాల మీద
పూల తోట మీద ముళ్ల బాట మీద
చీనీ చీనాంబరాల మీద
చింకి పాతల మీద కాలు మోపి
కులం కంపుగానీ మతం గబ్బుగానీ
వేయని స్వచ్ఛమైన మట్టి పరిమళంతో
ప్రేమగా కౌగిలించే వాన
అందుకే ఇష్టం నాకు వానంటే
కురిసినప్పుడల్లా నాచేత పేద పిల్లలకు
కాగితప్పడవలు పంచి పెట్టించే వాన
వాన వరదలో నా బాల్యాన్ని
కత్తి పడవపై మోసుకెళ్లే వాన
చేతులు చాచి వాన చుక్కలతో
ఆడుకుంటున్న మా వీధి బాలల
వేనవేల లేత చేతుల్లో
నా ముదురు చేయిని
లేలేత పూల కాడను చేసి
పిల్ల సీతాకోక చిలుకలతో
ఆడుకోనిచ్చే వాన
చిరిగిన నా లాగును పైకెగదోసుకుంటూ
విరిగిన నా బలపం ముక్కల్ని
తడవకుండా నా జేబులో
సరిచూసుకుంటూ
పగిలిన నా పలకను
గొడుగులా నా నెత్తి మీద
పెట్టుకుంటూ
బడి నుంచి ఇంటికి
నన్ను పరుగెత్తించిన
నా బాల్యపు వాన
వానంటే నాకందుకే
చాలా ఇష్టం
ఏ నీడ గొడుగులేని నా పుట్టెడు కన్నీళ్లను
తన నీటిచేతులతో తుడిపేసి చెరిపేసి
ప్రేమగా చేయి పట్టి లాగి
నన్నో వానోత్సవాన్ని చేసి
చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టించే
ఒక చైతన్యపు వానన్నా
దాని నెరవానతనమన్నా
నాకెంతో ఇష్టం!!
- నిరంతర
9133832246