పుస్తకం : కథానందనం (సంకలనం)
రచన : డా, భువన్
పేజీలు : 614, ధర : 400/-
ప్రతులకు : సాహితీమిత్ర సౌరభాలు, 15-21-12/3. నియర్ ఉమెస్స్ కాలేజీ,
అనకాసల్లి - 531002
సెల్ నెం : 8500669505
తెలుగు కథాలోకం ఎంతో విస్తృతమైనది. ఎన్నెన్నో కథలు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని కూడా పొందాయి. కథారచన తెలుగు సాహిత్యంలో ఒక నిర్విరామ ప్రవాహం. సమకాలీనతనీ, మానవసంబంధాలనీ, నైతికాదర్శాలను, ప్రజల సమస్యలను, ఇలా ఎన్నో అంశాలు వస్తువులుగా ఎన్నెన్నో కథలు చదువరులను అలరింపజేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన డాక్టర్ ఎంవిజె భువనేశ్వర రావు (భువన్) వంద కథలతో 'కథానందనం' పేరిట ఒక బృహత్కథాసంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో కొత్తగా రాస్తున్న వారి నుంచీ పెద్ద రచయితలుగా గుర్తింపు పొందిన వారి వరకూ ఇరవై మందిని తీసుకుని వారి కథలు ఐదేసి చొప్పున మొత్తం వంద కథల్ని ఈ సంకలనంలో అందించారు. ఈ కథలన్నింటికీ, ముఖచిత్రంతో సహా వందకు పైగా బొమ్మలు గీసి ప్రఖ్యాత చిత్రకారుడు బాలి ఈ సంకలనానికి ఒక అందాన్ని తీసుకొచ్చారు. ఈ సంకలనంలోని రచయితల్లాగే కథలన్నీ ఎంతో వైవిధ్యమయినవి కూడా.
మరొక ప్రత్యేకత ఏమిటంటే బాలి రాసిన ఐదు కథలు కూడా ఈ సంకలనంలో చోటుచేసుకుని ఉండడం. మిగిలిన వారి విషయానికొస్తే ఈ ఇరవై మందిలో పదిమంది రచయిత్రులు కూడా ఉన్నారు. హైమావతి పెబ్బిలి, ఎండ్లూరి మానస, జయశ్యామల తురగా, జ్యోతి అద్దేపల్లి, లక్ష్మీమైథిలి ములుగు, ప్రభావతి వాసా, ప్రసన్న లక్ష్మి ఏడిద, రమ రాగతి, సుశీల సోమరాజుల కథలున్నాయి. రచయితల విషయానికొస్తే నారంశెట్టి ఉమామహేశ్వర రావు, ఎం సుగుణారావు, డాక్టర్ భువన్, ఎమ్మార్వీ సత్యనారాయణ మూర్తి, యాళ్ల రాజేష్, వడలి రాధాకృష్ణ, చింతా జగన్నాథరావు, జి రంగబాబు తదితరుల కథలున్నాయి. ఈ వంద కథల నందనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రధాన కార్యదర్శి డా.కృత్తివెంటి శ్రీనివాసరావు, నేషనల్ బుక్‌ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మలు ముందు మాటలు రాశారు. అంతే కాకుండా ఒక్కో రచయిత రాసిన ఐదు కథల తర్వాత ఆ కథల తీరుతెన్నులపై ఒక్కో సమీక్షకునితో వ్యాసం రాయించడం కూడా సంకలనానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.
మానవ సంబంధాలే ప్రధానంగా వీరందరి కథావస్తువులు. తెలుగు కుటుంబాల మూడు తరాల జీవన వైవిధ్యాలు ఈ కథల్లో తొంగి చూస్తున్నాయి. పత్తిపాక మోహన్ వీటిని నూరు కథల హౌరు అన్నాడు. ఆయన రచయితల కథల గురించి ప్రస్తావిస్తే కుప్పిలి పద్మ రచయిత్రుల కథల గురించి ఆకాశంలో సగం.. ఈ కథానందనం అంటూ వివరించారు. మహిళల జీవితాల్లోని అనేక పార్శ్వాలని ఈ కథల్లో చూడగలమంటూ పేర్కొన్నారు. మధ్యతరగతి ఆత్మీయతలు, ఆకర్షణలు, నైతికబాధ్యతలు, నాగరికుల హీనవర్తన, మానవత్వపరిమళాలు, ప్రవాసాంధ్రులు, పిల్లలు పెద్దల మధ్య తరాల అంతరాలు, స్త్రీ హృదయం, హాస్యం, రాజకీయవ్యంగ్యం వంటి అనేక అంశాల కథలు చదువుకోవచ్చు. బాలిగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. బుద్ధికి పదునుపెట్టి, మనస్సుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగించే కథలివి. తెలుగు కథల ప్రచురణ బాధ్యత చేపట్టిన డా.భువనేశ్వరరావు ప్రచురించిన ఈ వందకథల సంకలనం 'కథానందనం'. మూడుతరాల జీవనచిత్రణకు దర్పణంపట్టే సంకలనమని చెప్పక తప్పదు. తెలుగు సాహిత్యాభిలాషులు, కథాప్రియులు తమ స్వీయ గ్రంథాలయంలో ఉంచుకోదగిన మంచి సంకలనమిది.
- బెందాళం క్రిష్ణారావు