పుస్తకం : నల్ల చామంతి
రచయిత : చిత్తలూరి సత్యనారాయణ
పేజీలు : 224,
ధర : రూ. 120/-
ప్రతులకు : పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1
403, విజయసారు రెసిడెన్సీ సలీమ్ నగర్, మలక్‌పేట్
హైదరాబాద్ - 500036
ఫోన్ నెం: 040-27678430
కొందరు ప్రకృతిని ప్రేమిస్తారు ఎంతగా అంటే జీవితాన్నీ, చావునూ అన్నింటినీ అందులోనే చూస్తారు. చెట్టూపుట్టా, జంతుజాతులు, మనుష్య భావాలు అన్నీ వాళ్లకు ప్రకృతిలో కనిపిస్తాయి. ప్రతీకలుగా దర్శనమిస్తాయి. మరికొందరుంటారు... జీవితాన్ని ప్రాక్టికల్‌గా అనుభవిస్తుంటారు. ఎంత ప్రాక్టికల్‌గా అంటే 'నిజం' ఎంత నిష్టూరంగా ఉంటుందో అంతగా... ఆ ఆరాధనా, ఈ ఆవేదన కలిసినప్పుడు మానవత్వం 'ఎన్లైటెన్' అవుతుంది. ఉఛ్వాసనిశ్వాసలన్నీ ఇతిమిద్దంగా లేకపోయినా అర్థవంతంగా ఉంటాయి. ఆశకూ, ఆశయానికున్న సామాన్య అర్థంలోని సన్నని పొర కూడా విచ్చులుకోని విశాలంగా కనిపిస్తుంది. చిత్తలూరి సత్యనారాయణ కవిత్వంలా విభిన్నంగా విప్పారి జ్వలిస్తుంది. 'నల్ల చామంతి' కవిత్వమంత గాఢంగా స్పృశిస్తుంది.
చిత్తలూరి సత్యనారాయణ రాసిన ఈ నల్ల చామంతి కవిత్వ పొత్తంలో మొత్తం 75 కవితులున్నాయి. ఒక్కోసారి కవితా వస్తువు రిపీట్ అవుతున్నా అంశంలో ఉన్న ఆర్థ్రత విభిన్నంగా ధ్వనిస్తుంది. 'ఇంకా ఎంతకాలం!' కవితతో మొదలై 'అమ్మలా ఎదురొచ్చే ఆమె కోసం!' కవితతో ముగిసే ఈ కవిత్వ పొత్తంలో 'భీమిలి దాకా', వెళ్లి 'నొయిడా పిల్లల కోసం' మాట్లాడి, 'వేలాడే తాజ్‌మహల్' రహస్యాన్ని జీవితానికి రాసుకుంటాడు.
'ఒక సామూహిక అక్షర దృశ్యంలోంచి...' చూస్తూ 'అనేక రకాల అక్షరాలు ఆవిష్కరించే అనేకానేక ప్రపంచాలు ఉంటాయి...' అంటాడు. 'అయితే ఆ అక్షరాలు జీవన మూలాల్లో పేరుకున్న /చీకటి పెచ్చుల్ని పెళ్లగించే/ వెలుగు గునపాలు కావాలి' అంటాడు. ఇలా ప్రతీ కవితలోనూ చాలా లోతైన అర్థాన్ని చెబుతాయీ కవితలు. వృత్తి పరంగా టీచర్ అయిన చిత్తలూరి సత్యనారాయణ 'అతడు' అనే కవిత్వంలో రాయడం తుడిచేయడమంటే/ అతనికెంతో ఇష్టం' ఎందుకో చెబుతాడు. అమ్మ పేరున రాసిన నాలుగు కవితలు విభిన్న కోణాల్ని వైవిధ్యమైన ప్రతీకలతో చెబుతాయి. 'నల్ల చామంతి' కవితలో 'తిరగరాసిన నా అక్షరాల/ ఘన చరిత్ర' ప్రశ్నిస్తూనే ఉంటుంది.
- ప్రాణి
అర్థమున్న ఆర్ధ్రత నల్ల చామంతి
