మొదటి తరం రాయలసీమ కథలు, సంపాదకుడు: డా|| అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, పేజీలు: 240, వెల: రు. 200/-, ప్రతులకు: కె.మురళీ మోహన్, 9111-బ్లాక్ 9ఎ, జనప్రియ మహనగర్ మాల్పేట-హైదరాబాద్. సెల్: 9701371256
ఈ విలువైన పుస్తకాన్ని అబ్జ క్రియేషన్స్ సంస్థ ప్రచురించి తెలుగు కథా సాహిత్యానికి ఎంతో మహోపకారం చేసింది. ఇలాంటి బృహత్తర సాహితీ సంకలనాలు ప్రచురణల బాధ్యత ఏ అకాడమీలో విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక శాఖో, అధికార భాషా సంఘమో, తెలుగు అకాడమీనో చేయాల్సిన పనులు. వారికి ప్రాంతీయ రాజకీయాలే సరిపోతాయి. ఇదో విశిష్ట కృషి అపూర్వ అక్షర సంపదను భద్రం చేశారు. ఎప్పుడో 1882 నాటి కథలు (తొలి కథగా ప్రమాణీకరించిన గురజాడ అప్పారావు 'దిద్దుబాటు'- 1910) అందునా ''రాయలసీమ ప్రాంత మొదటి తరం కథలు (1882-1944) ఈ పుస్తకంలో సేకరించి, పరిశోధించి ప్రచురించారు. తమ పేరు లేకుండానే అత్యద్భుత కథలు రాసిన కథకుల కథలూ ప్రచురించారు. అలనాటి శారద, తెలుగు తల్లి, హిందూ సుందరి, చిత్ర గుప్త, శ్రీ సాధన, విజయ వాణి, సౌందర్య వల్లి, జన వినోదిని లాంటి ప్రసిద్ధ పత్రికల్లోని కథలు ఆ రచయితల పేర్లు పుస్తకాల చివర అనుబంధంగా ఓ చక్కటి వ్యాసం (1927- జనవరి 15 సాధన పత్రికల్లో ప్రచురణ అయిన ''చిన్న కథలు'' అనే కథా లక్షణ పరామర్శ) ప్రచురించారు. గురజాడ దిద్దుబాటు కథకు ముందే వచ్చిన 102 కథల్ని ''వివిన మూర్తి'' పట్టుకోగలిగారు. వీటిలో 92 కథలతో ''దిద్దుబాటు'' ప్రచురించారు. సింగమనేని నారాయణ, కేతు విశ్వనాథ రెడ్డి ఈ రాయలసీయ కథలు పుస్తకానికి ముందు మాటలు రాశారు. ఈ కథా సంకలనంలో కందాళ శేషాచార్యులు రాసిన 10 కథలు విద్వాన్ విశ్వంగారి 9 కథలు, ఆర్ముగం పిళ్ళై 3 కథలు, పేరులేని కథకుల కథలు 7, ఇతర పేర్లతో 2 కథలు, కె.సభా 1994 ఏప్రిల్లో 'చిత్రగుప్త' పత్రికలో ''కడగండ్లు'' కథ రాశారు. గుత్తి రామకృష్ణ ''చిరంజీవి'' కథ 1941లో రాశారు. వీరినే తొలి కథకులుగా భావించారు. కానీ 1926 జూన్ నెలలో ''మత భేదం'', ''మీనాక్షి'' కథల్ని అయ్యగారి నరసింహమూర్తి రాశారు. కథకుని పేరు లేకుండా 1918 లో ''కడపటి పైసా'' కథ సీమ తొలి కథ అన్నారు. ''ఋతు చర్య'' 1882 జనవినోదిని పత్రికలో కథే తొలి కథ అన్నారు. చాలా పెద్దకథ - సంభాషణల్తో ఉంది. గ్రాంథిక భాషలో సాగింది. తండ్రి వయసు వ్యక్తి తనను ప్రేమించడాన్ని, వేధించి వెంటబడటాన్ని తట్టుకోలేని అనాథ బాలిక లక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం. సంగీత పాఠాలు చెప్పే శ్రీరాములు నాయుడులోని కాముకత తెలిపే కథాంశం ''ప్రేమ బలి'' కథకుడి పేరు లేదు. ఇది 1936 సాధన పత్రికలో ప్రచురణైన కథ. చాలా పెద్ద కథ. అలనాటి మధ్య తరగతి కుటుంబాల గాథ ఇది. ఒక చిన్న కథ కథకుడి పేరులేని ఈ కథ 1926 సాధన పత్రికలో అక్టోబరు ప్రచురించడమైనది. కథాంశం క్లుప్తంగా రామాపురం గ్రామ పురోహితుడు వెంకటరామ శాస్త్రులు అతని భార్య లక్ష్మీదేవమ్మ ఉంటారు. వారి కొడుకు బళ్ళారిలో ఇంగ్లీషు చదువు చెప్పించాలని బళ్ళారి వెళ్ళి అక్కడ వుంటారు. వారి కొడుకు కృష్ణుడు 2వ తరగతిలో చేరతాడు. 4 సంవత్సరాల తర్వాత ఓ రోజున లక్ష్మీదేవమ్మ అన్న కొడుకు నారాయణున్ని పిలుస్తారు పరీక్షిం చదలచి..అతని జవాబులు ఆ దరపతుల్ని సంతృప్తి పరచవు. ఇది కథ. ''చిలకా గోరింక'' కథ విద్వాన్ విశ్వం రాసినది. ''స్వేచ్ఛ''ను దృష్టిలో పెట్టుకొని ప్రేమసారంతో రాసిన చిలకా గోరింక కథ, చిన్న పూలతోట...మేడలోని అమ్మాయి నిరంకుశత్వానికి ప్రతీకలా ఉంది. ఇలా అన్ని కథలు చదివింప జేస్తాయి. ఇది అభినందించదగ్గ ప్రయత్నం.
- ప్రసన్న కుమారి