హామీల బంగారు కాసులు
కురుస్తున్నారు చేనేతలంతా
ఒడి నింపుకోండి
అతుకుల బతుకుల
జీవనాల్లో మతిమరుపు
మంత్రమేస్తున్నారు!
శాంతించండి
ఆకలాకలని అరవొద్దని
మీ కడుపులకు హితవు చెప్పండి
సేద్యగాళ్లందరూ రండి
చీడ పీడల జోలికెళ్ళక
రాలినాకుల ఎరువుతో
సర్దుకోమని మీ మొక్కలకు చెప్పండి
కర్మఫలాన్ని అనుభవిస్తున్నారని నిరుద్యోగులకు సూక్తుల్ని వినిపించండి
పంచాయతీ అరుగు కాడికి
సాములొచ్చినారు
ఆడబిడ్డలందరూ రండి
రక్ష రేకుల్ని కట్టించుకోండి
ఆకలెరుగని దేహాలనిస్తున్నారు
పరకాయ ప్రవేశం చేసుకోండి
పాత మ్యానిఫెస్టోల ఇత్తడి
చెంబు తోముకుని
తియ్యటి పానకాన్ని
నింపుకుని వస్తున్నారు
జట్టులో ఉన్నోళ్ళు మాత్రం
రేషన్ చెంబులు తెచ్చుకోండి
- దారల విజయకుమారి
9177192275
ఇక బాధలుండవు (కవిత)
