యాంత్రిక జీవనంలో
ప్రజా సమూహాన్ని ఆత్మీయంగా హత్తుకునే
యంత్రరాజం...
మధ్యతరగతి మందహాసాలకు
సాక్షీభూతం...
నేలపై నడిచే పుష్పకవిమానం...
అందరి బంధుత్వాలను
ఆప్యాయంగా కలుపుతూ
చెయ్యెత్తగానే పలకరించే చుట్టరికంతో
బతుకు బస్టాండ్ కాకుండా
కాపాడే నేస్తం...
కస్సుబుస్సులన్నింటినీ కడుపులో దాచుకుని
క్షణికావేశాలను గంటలో మాయం చేసి
చెరగని నవ్వులతో
గమ్యం చేర్చే 'గరుడ'వేగం...
అలసిసొలసిన దేహాలన్నింటికీ
జోలపాడుతూ
ఉయ్యాల ఊపులతో సేదతీర్చుతూ
నిశ్చింతగా ఇంటికి తీసుకెళ్లే
'వజ్ర' సంకల్పం...
దేశ సౌభాగ్యాన్ని పరమత సహనాన్ని
మానవత్వపు మాధుర్యాన్ని
వసుధైక కుటుంబక వారసత్వాన్ని
ప్రకృతి అందాలను
అలవికాని ఆనందాలను
నిరంతరం మోసుకెళ్లే
నిస్వార్ధపు 'ఇంద్ర' వాహనం...
కరిగిపోతున్న కాలచక్రంలో
తరిగి పోతున్న బతుకు చక్రాల ప్రభతో
త్యాగమే జీవితమైన
శకట ధేనువు...
జీవిత కాలంలో ప్రతి ఒక్కరినీ
ఆదుకున్న ఆపద్బంధువు...
పల్లెవెలుగు ప్రజా రథం...
పెరుగుతున్న మోటారు కార్ల
కాలుష్యపు కోరల్లో
మసకబారుతున్న 'పల్లె వెలుగు'లు...
పైకి 'డీిలక్స్' మెరుగుల్ని
ప్రదర్శిస్తున్నా...
రగులుతున్న డీజిల్ మంటలాంటి కష్టాలను
పుక్కిట పట్టి
గంభీరంగా రోడ్డుపై నడుస్తుంది...
బస్సు ప్రయాణమంటే
బాల్యమిత్రుణ్ణి కలుసుకున్నట్టు...
అమ్మమ్మ గారింట్లో ఆటాడుకున్నట్టు...
కన్నతండ్రి భుజాలపై కూర్చున్నట్టు...
సామాజిక బాధ్యతను 'సంచీ'లో
మోసుకెళ్ళినట్టు...
దేశ సమైక్యతను 'టిక్కెట్టు'తో కొనుక్కున్నట్టు..
మిత్రమా!
నువ్వెక్కదలుచుకున్న 'బస్సు'
కాకూడదు ఎప్పుడూ
ఒక జీవితకాలం 'మిస్సు'....
- మడత భాస్కర్
8919328582
పల్లె వెలుగు
