నవ్వాలో ఏడవాలో నాకు తెలియలేదు
వాళ్ళంతా కూర్చుని నిలబడి
నీ గురించే మాట్లాడారు, చర్చించారు
అతను ఇక్కడే కూర్చున్నాడు
అతను ఇదే చేస్తుండే వాడు
ఇదిగో అతను చదువుకున్న పుస్తకం
ఇదే అతను నివసించిన గది
ఇవి అతని దృష్టినిచ్చిన కలాలు
అతను రాసుకున్న సు-లోచనాలు
అతను ఇంతటి వాడు అతను అంతటివాడు
ఆయన ఆలోచనలు అబ్బో అమోఘం!! ఇలా..
ప్రస్తుతం లోకి రండన్నట్లు
నీ కోడలు అందరికీ 'టీ' అందించింది
ఆ 'టీ'లో ఆత్మీయతా రుచి
బహుశా అది నీపై పెరుగుతున్న
గౌరవపు ఘుమ ఘుమ కావొచ్చు
***
నేనక్కడే ఓ మూల కూర్చున్నాను
కూర్చునే ఉన్నాను ఏ మాత్రం కదల్లేదు
వాళ్ళు అలాగే మాట్లాడుతూనే ఉన్నారు నీ గురించి
నేను మాత్రం నిశ్శబ్ద శిలలా ఉండిపోయాను
నా దగ్గర మాటల మూటలు లేకపొయ్యాయి
రిక్తహస్తాలతో శూన్యపు దృక్కులతో
కాలపు నిశ్శబ్దంలో పాతిన
విగ్రహంలాగా, నిగ్రహంలాగా ఉండిపోయాను
ఓ రాయితో మాట్లాడినట్టు
వాళ్ళు నాతో మాట్లాడుతూనే ఉన్నారు
చనిపోయిన నీ గురించి, నీ ఔన్నత్యం గురించి
అకస్మాతుగా ఛాతిలో నా గుండే పెరిగినట్లయ్యింది
ఊపిరి భారమై పోయింది
నీ ముఖ మెప్పుడూ చూడని నేను
నిన్నిప్పుడు బాగా గుర్తు పట్టగలుగుతున్నాను
ఏదో ఎక్కడో కరుగుతున్నట్లు
సన్నటి అవ్యాజ్యమైన నీటి తెర
కళ్ళలో విస్తరించసాగింది
అదేమిటో, నీ కన్నా ఎక్కువ నాకెవరూ లేరన్నట్లు అనిపించసాగింది!!
- డా|| దేవరాజు మహరాజు