విద్యతోనే సమాజాభివృద్ధి
కనకదాసు చరిత్ర పాఠ్యాంశానికి సిఫార్సు : కలెక్టర్
ఘనంగా భక్త కనకదాసు జయంతి
ప్రజాప్రతినిధుల గైర్హాజరుపై కురబలు ఆగ్రహం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
ఏ సమాజం అయినా అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ సూచించారు. కర్నూలు జిల్లా అక్షరాస్యత శాతంలో వెనుకంజలో నిలిచిందన్నారు. ఆక్షరాస్యత శాతం పెంపునకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బిసి సంక్షేమశాఖ అధికారి మయూరి ఆధ్యక్షత వహించారు.
ముఖ్య అతిధిగా కలెక్టర్ జి.వీరపాండ్యన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్నలు హాజరయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీలతోపాటు మంత్రులెవ్వరూ హాజరు కాకపోవడంపై కురుబలు కలెక్టర్ ఎదుటనే నిరసన తెలిపారు. కలెక్టర్ వారిని శాంతింపజేసి మాట్లాడారు. భక్త కనకదాసు జీవితం ఆదర్శనీయమైందన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఆయన కాంస్య విగ్రహంతోపాటు జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బత్తిన వెంకట్రాముడు మాట్లాడుతూ కురుబలను పాలక ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. గ్రామాల్లో ఇంకా అట్టడుగు స్థాయిలోనే జీవిస్తున్నారని పేర్కొన్నారు. శివన్న మాట్లాడుతూ శ్రీశైలం బీరప్ప స్వామి సదనం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని, తిరుపతిలో ఆయన పేరుమీద సత్రం ఏర్పాటు చేయాలని కోరారు. గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ కనదాసు జయంతి వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బిసి కార్పొరేషన్ ఇడి శిరీష, జిల్లారెవెన్యూ అధికారి పుల్లయ్య, కురువ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుల్లన్న, దేవేంద్రప్ప, మురళీ శ్రీనివాసులు, వెంకట్రాముడు, రఘురామ్, ఎల్లప్ప, రంగస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి
