గర్జించిన ఉద్యోగ, కార్మిక లోకం
సమ్మె సంపూర్ణం
ఎరుపెక్కిన రహదారులు
మొదటి రోజు విజయవంతం
ప్రజలను నిలువునా ముంచిన మోడీ
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
సిపిఎస్ రద్దు చేయకపోతే గుణపాఠం తప్పదు
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు మంగళ, బుధ రెండురోజుల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజు సంపూర్ణంగా విజయవంతమైంది. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు తదితర కార్మిక సంఘాల సమ్మె పిలుపునకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు మద్దతునిచ్చాయి. బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కేంద్ర కార్యాలయాలన్నీ బోసిపోయాయి. ఎపిఎన్జిఒలు, బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతును ఇవ్వడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెలవెలబోయాయి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడడంతో జిల్లాలో లావాదేవీలన్ని స్తంభించిపోయాయి. ఎపి మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటీవ్ యూనియన్, ఆశావర్కర్స్ యూనియన్, మధ్యాహ్న భోజన, భవన నిర్మాణ తదితర రంగాల వారీగా అసంగటితరంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ట్రాన్స్‌పోర్టు రంగం, ఆటో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో సిఐటియు, ఎఐటియుసిల ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీలను నిర్వహించారు. కర్నూలులో సిఐటియు ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్ నుంచి జిల్లా పరిషత్ వరకు, పాతబస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ర్యాలీలు చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌస్‌దేశారు, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా పశ్చిమప్రాంత కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, సిఐటియు నాయకులు ఎండి అంజిబాబు, పుల్లారెడ్డి, టి రాముడు తదితరులు అగ్రభాగాన ప్రదర్శన సాగింది. జిల్లా పరిషత్ నుంచి సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఎపి మెడికల్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ సేవకులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు సాగించారు. సంఘటిత, అసంఘటితరంగ కార్మికులంతా రోడ్డెక్కడంతో జిల్లాలోని ప్రధాన కూడళ్లన్నీ ఎరుపుమయమయ్యాయి. ర్యాలీకి ముందు జిల్లాపరిషత్ ఆవరణంలో కార్మికులను ఉద్ధేశించి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. మోడీ అధికారంలోకి రాకముందు అచ్ఛేదిన్ తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆశచూపి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి తొలగించారని విమర్శించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన సభను ఉద్ధేశించి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని తెలిపారు. సిపిఎస్‌ని రద్దు చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
గర్జించిన ఉద్యోగ, కార్మిక లోకం
