అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం..
ఎత్తిపోతల ద్వారా ఆలస్యంగా నీటి విడుదల
నీటి పన్నులు కట్టనందుకే ఇవ్వలేదంటున్న వైనం
పంటలు ఎండిపోయాక ఇస్తే లాభం లేదంటున్న రైతులు
ప్రజాశక్తి-కొత్తపల్లి
చెంతనే కృష్ణానది నీరు పుష్కలంగా ఉన్నా పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంట పొలాలకు అందని పరిస్థితి కొత్తపల్లి మండలంలో నెలకొంది. కొత్తపల్లి మండలంలో శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలు ఉన్నా రైతులకు ఉపయోగపడడం లేదు. అధికారులు, పాలకుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల అభివృద్ధే ధ్యేయమంటూ గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పంటలు ఎండిపోకుండా ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తామని చెబుతున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమయింది.
కొత్తపల్లి మండలం జిల్లా కేంద్రానికి దూరంగా, నల్లమల అడవులకు అతి సమీపంలో ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిపిఎం పోరాటాల ఫలితంగా మండలంలో సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది. ఎత్తిపోతల పథకాలకు కృష్ణానది నీరు పుష్కలంగా ఉన్నప్పటికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటపొలాలకు అందడం లేదు. రైతులు నీటిపన్నులు చెల్లించక పోవడంతో పంటలకు వదలడం లేదని అధికారులు సాకులు చెబుతూ తప్పించుకుంటున్న దుస్థితి ఏర్పడింది. పంటలు సగం ఎండిపోయిన తర్వాత మొదటగా గత రెండ్రోజుల క్రితం శివపురం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని రైతుల పొలాలకు వదిలారు. అయితే పంటకాల్వలు సరిగ్గా లేని కారణంగా ఏ రైతుకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. శివపురం ఎత్తిపోతల పథకం కింద 3500 ఎకరాలకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఎత్తిపోతల పథకం కింద శివపురం గ్రామం పరిధిలో 2190 ఎకరాలు, గుమ్మడాపురం పరిధిలో 1100 ఎకరాలు, కొత్తపల్లి పరిధిలో 210 ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. అలాగే సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గుమ్మడాపురం గ్రామం పరిధిలో 1785 ఎకరాలు, ముసలిమడుగు 580 ఎకరాలు, మాడుగుల 730 ఎకరాలు, ఎర్రమఠం 1905 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఈ ఎత్తిపోతల పథకాలను ముసలిమడుగు గ్రామ శివారుల్లో నిర్మించారు. ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 8500 ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు. అయితే ఎత్తిపోతల పథకాలు పంట పొలాలకు ఉపయోగపడడం లేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తొలకరిలో పడిన వర్షాల కారణంగా కొత్తపల్లి మండలంలో రైతులు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. పంటలు చేతికి వస్తున్న సమయంలో వర్షాలు సకాలంలో కురువకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. చెంతనే పుష్కలంగా కృష్ణా నీరు ఉండడంతో రైతులు ఎంతో ఆశతో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని పొలాలకు పెట్టుకోవచ్చని పంటలు సాగుచేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు సగం ఎండిన తర్వాత నీరు వదిలారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోవు రోజుల్లోనైనా ఎత్తిపోతల పథకాల ద్వారా సకాలంలో పంట పొలాలకు సాగునీరు అందించాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
పంట కాల్వలు తీయించి సకాలంలో నీరివ్వాలి
రైతు సంఘం నాయకులు సంజీవరాయుడు
కొత్తపల్లి మండలంలోని శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలు రైతులకు ఉపయోగపడడం లేదు. పంటలకు సకాలంలో సాగునీరు అందించాల్సిన అధికారులు నిర్లక్ష్య దోరణి వహించి పంటలు ఎండిపోయిన తర్వాత వదలడం ఎంత వరకు సమంజసం. పంట కాల్వలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అధికారులు, కాంట్రాక్టర్ల కమీషన్ల కోసమే ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే విధంగా పంట కాల్వలను తీయించి, సకాలంలో నీరు ఇవ్వాలి.
అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం..
