చుట్టూ పచ్చని దుప్పటి కప్పుకున్న కొండకోనలు.. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు.. పురాతన నిర్మాణాలు.. నులివెచ్చని సూర్యకిరణాలు తాకేవేళ అందాల దాల్ సరస్సు ఒడిలో బోట్‌హౌస్ ప్రయాణం.. ఎత్తయిన రోడ్డు మార్గాలు.. మధురానుభూతులను పంచే రైలు ప్రయాణాలు... ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ పరిసర ప్రాంత అందాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి 'లోలాబ్ వ్యాలీ'. పచ్చని కొండ ప్రాంతాలతో ప్రకృతితో మమేకమవ్వడానికి ఇంతకంటే మంచిచోటు మరొకటి ఉండదు. పోట్నారు వ్యాలీ, బ్రునారు వ్యాలీ, కలారూస్ వ్యాలీలు కలిపి లోలాబ్ వ్యాలీగా వ్యవహరిస్తారు. లోలాబ్ వ్యాలీలో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరం. కాబట్టి ఎప్పుడైనా అక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే చల్లని ప్రశాంత వాతావరణం ఉండటంతో ఎక్కువగా ఈ సీజన్లోనే వెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఇక్కడ 10 నుంచి 30 డిగ్రీల మధ్యలో వాతావరణ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీల వరకూ చేరుకుంటుంది. కుప్వారా జిల్లాలో ఉన్న లోలాబ్ వ్యాలీలో ఎక్కడ చూసినా ఎత్తయిన సరివిచెట్లు దర్శనమిస్తాయి. యాపిల్, వాల్నట్, చెర్రీలు విరివిగా దొరకడంతో లోలాబ్వ్యాలీని 'ఫ్రూట్‌బౌల్ ఆఫ్ జమ్మూకాశ్మీర్' అని కూడా పిలుస్తారు.
కాశ్మీర్వ్యాలీ, నీలమ్ వ్యాలీను విడదీస్తూ కొండల నుంచి జారిపడే లాహ్వాల్ నది ఆ ప్రాంతంలో మరో ప్రత్యేక ఆకర్షణ. స్థానికులు ఈ ప్రాంతాన్ని 'వాడి ఈ లోలాబ్' అని పిలుస్తారు. లోలాబ్వ్యాలీ హెడ్‌క్వార్టర్స్ సోగామ్. ప్రకృతికి దగ్గరగా ఉంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే - అలాంటి ప్రశాంతత లోలాబ్ వ్యాలీలో కావాల్సినంత దొరుకుతుంది. అయితే, ఒక టూరిస్ట్ స్పాట్‌గా చూడాలంటే మాత్రం లోలాబ్వ్యాలీలో లెక్కలేనన్ని ఆకర్షణీయ ప్రాంతాలు ఉన్నాయి. జలపాతాల నుంచి కొండకోనల వరకూ.. పచ్చిక బయళ్ల నుంచి పంటపొలాల వరకూ ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడికి ఢిల్లీ నుంచి అటార్నీ వరకూ ఉన్న నేషనల్ హైవే 1లో కుప్వారా మార్గమధ్యం వస్తుంది. శీతాకాలంలో మాత్రం మంచు ఎక్కువగా ఉంటే మాత్రం బోర్డర్రోడ్స్ ఆర్గనైజేషన్ రోడ్డు మూసివేస్తారు. విమానంలో లోలాబ్కు వెళ్లాలంటే దగ్గరి ఎయిర్పోర్ట్ శ్రీనగర్. అక్కడి నుంచి కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీకి టాక్సీ లేదా బస్‌లో చేరుకోవచ్చు. శ్రీనగర్ నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణం. లోలాబ్వ్యాలీకి రైలులో వెళ్లాలన్నా శ్రీనగరే దగ్గరి స్టేషన్.
