మెరైన్ ఇంజనీర్‌గా వృత్తిరీత్యా ప్రపంచంలోని చాలా దేశాలు విజిట్ చేశాను. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత. సముద్రపు అలలపై ఊగిసలాడే ఈ వృత్తిలో మా పాదాలు నేలను తాకిన ప్రతిసారీ ఏదో తెలియని అనుభూతి. అందుకే అనుకుంటా, ఎక్కడి ప్రకృతి అందాలనైనా మనసారా ఆస్వాదిస్తాం. గతేడాది న్యూజిలాండ్‌లో చూసిన ప్రదేశాలు మాత్రం నా జీవితంలో మర్చిపోలేని ప్రత్యేక స్థానాన్ని పొందాయి. అది న్యూజిలాండ్‌కు దక్షిణాన ఉన్న నెల్సన్ ప్రాంతం. అక్కడి సముద్రపు అలలు కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాయి. మనసుదోచే లేక్స్ అందాలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అక్కడి వాతావరణం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. అలాంటి ప్రకృతి రమణీయత సంతరించుకున్న 'నెల్సన్'లోని ప్రతి ప్రదేశం నన్ను నేను మర్చిపోయేలా చేశాయి.
ఆ.. అనుభవాలు మీ కోసం ఈ వారం 'జర్నీ'లో..!
నెల్సన్ సిటీలో ట్రావెలింగ్ కోసం టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. కానీ, అక్కడ ఎక్కువగా సైకిలింగ్‌కు ప్రాధాన్యతనిస్తారు. ఎంత దూరమైనా సైకిల్‌పైనే వెళ్లేందుకు ఇష్టపడతారు. అంతేకాదు, అక్కడివారు సందర్శకులను మర్యాదపూర్వకంగా పలకరించే పద్ధతి నాకెంతో నచ్చింది. అక్కడివారు ఒక్క హగ్‌తో వారి ఆప్యాయతని తెలియజేస్తారు. అలాగే, 'సారీ, థ్యాంక్స్' పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. సిటీలోని ప్రధాన ఆకర్షణ 'హాట్ట్రాక్ బార్ అండ్ రెస్టారెంట్'. అక్కడ ఉడెన్ గార్మెట్ పిజ్జా తయారీని మొదటిసారి చూశాను. తయారీకి అవసరమయ్యే ఉల్లి, మిరప, కాప్సికమ్, టమాటా, కుమేరా వంటి పంటలను రెస్టారెంట్‌కు అనుకుని ఉన్న పంటపొలాల్లోనే పండిస్తారు. ఓ నాపరాయి బల్లలా అమర్చి, దాని కింద కట్టెల మంటపెట్టి వేడి వేడి పిజ్జాను తయారుచేస్తారు. పిజ్జా మీద వేసుకునేందుకు పదుల సంఖ్యలో సాస్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇక్కడి దగ్గరలో ఉన్న టాహునునై బీచ్ పర్యాటకులు సేదతీరేందుకు అనువుగా ఉంటుంది. సిటీకి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో మొదటిగా అక్కడి వెళ్లాం. బంగారు వర్ణపు ఇసుక రేణువుల మధ్య స్వచ్ఛమైన ఉప్పునీటి అలల సవ్వడులు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. బీచ్ చుట్టుపక్కల కనుచూపుమేరలో ఎక్కడా చెత్త కనిపించలేదు. అందుకోసం వారు తీసుకున్న వినూత్న నిర్ణయాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. ఉదాహరణకు ఓ కుటుంబం ఆ బీచ్‌లో విహారానికి వెళ్లితే.. వారు గడిపిన సమయంలో ప్రతి ఒక్కరూ ఏవో ఒక మూడు ప్లాస్టిక్ చెత్త వస్తువులు సేకరించాలి. వాటిని అక్కడి గార్బేజ్ అనే డస్ట్‌బిన్‌లో వేయాలి. దీనిని అక్కడివారు ఒక అలవాటుగా చేసుకున్నారు. దాని ఫలితమే బీచ్ అంతా పరిశుభ్రంగా ఉండటానికి కారణం. అలాగే, అక్కడి పచ్చదనం ఒక కొత్త అనుభూతిని కలిగించింది. చెట్లు కాకుండా, అక్కడి చిన్నసైజ్ పచ్చనిగడ్డి మనసును ఎంతో ఆహ్లాదపరుస్తుంది.
రొటోటి లేక్ అందాలు!
నెల్సన్ సిటీ నుంచి గంటన్నర రోడ్ జర్నీ చేసి, లేక్ రొటాయిటీని చేరుకున్నాం. ఆ సమయంలో పచ్చని అడవిగుండా వరుసగా పలకరించిన ఎన్నో మలుపులు మనసును ఆహ్లాదపరిచాయి. కానీ, వెహికల్ మధ్యలో ఎక్కడా ఆపకూడదు అనే రూల్ ఉంది. కొన్ని మలుపులు దగ్గర సిగల్ సిస్టమ్ మనల్ని పూర్తిగా నియంత్రిస్తాయి. లేక్ దగ్గరకు చేరుకున్నాక ఆ లేక్‌లో సుమారు పాతిక అడుగుల పొడవుండే చెక్కతో నిర్మించిన వంతెన కనిపించింది. అక్కడ కూర్చొని, రెండు కొండల మధ్య బీచ్ రెండుగా విడిపోయే సీన్ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. వంతెనపై కూర్చొని కాళ్లు నీటిలో పెడితే, ఎన్నోరకాల చేపలు పాదాలను తాకుతాయి. అదో రకమైన మసాజ్‌లా ఉంటుంది. నీటి అడుగుభాగం ఎంతో స్పష్టంగా పారదర్శకంగా కనిపిస్తుంది. గులకరాళ్లతో నిండిన ఆ తీరప్రాంతం అక్కడికి వెళ్లేవారి మనసును దోచుకుంటుంది.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా నేను స్నానానికి దిగిపోయాను. నీటిలో విహరిస్తున్న ఎన్నో రకాల చేపలను అక్కడ కళ్లారా చూశాను. అవి బ్రిడ్జి కింద మాత్రమే కనిపిస్తాయి. ఒక్క చేపనైనా పడదామనుకున్నాను. ఎన్నో అరుదైన జీవరాశులు అక్కడ ఉన్నట్లు పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. అంతేకాదు, ఇక్కడ చేపలు పట్టకూడదు అంటూ హెచ్చరిక బోర్డులూ ఉన్నాయి. దాంతో నేను కాస్త నిరాశకు గురయ్యాను. మా ప్రయత్నం విరమించుకున్నాం.
కైటెరిటరీ బీచ్
తర్వాత ఇండియాలో గోవా బీచ్ ఎంత ప్రాచుర్యం పొందిందో నెల్సన్లో అంతటి పేరు పొందిన కైటెరిటరీ బీచ్‌కు బయలుదేరాం. ఈ బీచ్ నెల్సన్ సిటీ నుంచి రెండున్నర గంటల జర్నీ. ఇక్కడ ఫాస్ట్ బోటింగ్, పారా గైడింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పారా గైడింగ్కు వంద డాలర్లు తీసుకుంటారు. చూసినప్పుడు కాస్త భయం వేసింది. కానీ, ఒక్కసారి ట్రై చేస్తే పోలా అనిపించి పారా గైడింగ్కు వెళ్లాను. మెరైన్ ఇంజనీర్‌గా సముద్రాన్ని చూశాను కానీ, అలా అకాశాన విహరిస్తూ సముద్ర అందాలను చూడటం ఇదే మొదటిసారి. ఆ క్షణంలో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. వాటితోపాటు ఉన్న బోటింగ్ల కోసం యాభై నుంచి అరవై డాలర్లు తీసుకుంటారు. మేం వెళ్లేసరికి సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అలాగే, ఇక్కడ ఓ బండరాయి మీద నుంచి చూస్తే సముద్రం పిల్లకాలువలా రెండుగా విడిపోయే సైట్ సీన్ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఆ ప్రాంతంలో ఫోటో దిగకుండా వెళ్లరు. ఇక్కడ ఉదయం సమయంలో బీచ్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. సాయంత్రం వెనక్కు వెళ్లిపోతుంది. అది మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు.
లిటిల్ ఇండియా బిర్యానీ!
ఒక ప్రత్యేక అనుమతితో క్రిస్ట్ చర్చ్ ప్రాంతానికి వెళ్లాం. నెల్సన్ నుంచి సుమారు ఆరు గంటలు జర్నీ ఉంటుంది. అక్కడ క్యాషినో ప్రత్యేకం. గ్యాంబిలర్ గేమ్స్‌కు ఎంతో ప్రసిద్ధి పొందింది ఆ ప్రాంతం. జూదరులు చాలామంది కనిపించారు. ఎంట్రీ ఉచితం కానీ, లోపల మొత్తం డబ్బుతో ముడిపడి ఉంటుంది. అన్నట్లు అక్కడికి వెళ్లడానికి అసలైన కారణం చెప్పలేదు కదూ! స్థానికంగా ఇండియన్ ఫుడ్ ఫేమస్ అని తెలిసింది. అందుకే, తాపాలారు రోడ్లో ఉన్న 'లిటిల్ ఇండియా' అనే రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ ఇండియన్ బిర్యానీ ఫేమస్. ప్లేట్ బిర్యానీ 30 డాలర్లు ఛార్జ్ చేశారు. అప్పటికే పిజ్జాలు, బర్గర్లు రుచి చూసిన నాలుక ఒక్కసారిగా ఇండియన్ బిర్యానీ రుచి చూసేసరికి ఆహా..అనిపించింది. పంజాబీ నుంచి వచ్చిన ఓ కుటుంబం అక్కడ ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు. అక్కడే మరికొందరి ఇండియన్స్‌ను కలుసుకున్నాను. అక్కడ వారు వంటల్లో ఉపయోగించే ఏ పంటకూ ఫెస్టిలైజర్స్ వినియోగించరని చెప్పుకొచ్చారు. పంటలకు టెక్నాలజీని జోడించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఏదేమైనా విదేశీయులపై నాకున్న కొన్ని అభిప్రాయాలు తప్పని ఈ 'జర్నీ'లో అర్థమైంది.
- చైతన్య మోటూరి,
తాడేపల్లి గూడెం.