వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగినైన నాకు మా డివిజన్ ప్రధాన కార్యాలయానికి (విజయవాడ) ముందున్న రైల్వేస్టేషన్, దాని చుట్టూ ఉన్న రకరకాల ఆఫీసులు, వర్క్‌షాపులు, పదవ నంబర్ ఫ్లాట్‌ఫాం పక్కగా ఉన్న గాంధీపర్వతం, మెలికల్లాంటి కలవని రైలుపట్టాలు.. అన్నీ అబ్బురంగా తోస్తాయి. పున్నమిరాత్రుల్లో వేల వేల వాట్స్ విద్యుత్ రంగుల్లో ఇంద్రధనస్సులా మెరిసే స్టేషన్‌పైన నింగిలో చందమామ సోయగం.. ఇవన్నీ మేళవింపుతో ఇదీ మా రైల్వేకాలనీ అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. నా దృష్టిలో మా రైల్వేస్టేషన్ ఓ దృశ్యకావ్యం. ఏ ఉన్నతాధికారికి వచ్చిందో ఆ ఆలోచన.. 2018 రైల్వేవీక్ అవార్డ్స్ జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించాలన్న తలంపు ఫలితంగా ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, క్విజ్, సాంస్క ృతిక రంగంలో, ఆట-పాట, సంగీత వాయిద్యాల విభాగాల్లో ప్రతి డివిజన్ నుంచీ జోన్‌కు, అక్కడి నుంచి అంతర్ జోన్ల పోటీలకు ఎంట్రీలు ఆహ్వానించబడ్డాయి. ఓ ప్రాంతంలో సంచరిస్తూనే, ఆ సౌందర్యాన్ని వీక్షించాలంటే 'ఏరియల్ వ్యూ'పై శ్రద్ధపెట్టాలి. అందుకే, ఆ చిత్రాలను బంధించాలన్న తలంపుతో సొంత కెమెరా లేకున్నా, అద్దె కెమెరాతో 64 చిత్రాలు తీశా. నా సరదా నాకు జాతీయస్థాయిలో 'కలర్ విభాగం'లో బహుమతిని ఇస్తుందని ఊహించలేదు. ఇంకేముంది, అభినందనల వెల్లువలు, అధికారుల ప్రశంసలతో 'రైల్వే మినిష్టర్ అవార్డు' కోసం నా పయనం పాట్నా నగరం వైపు ప్రారంభమైంది.
ఎర్నాకుళం- పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి విశాఖ, భువనేశ్వర్, చిత్తరంజన్ మీదుగా పాట్నా చేరుకున్నాం. అక్కడి స్టేషన్ ప్రాంగణంలోనే రిటైరింగ్రూంలో వసతి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 35 కిలోమీటర్ల పొడవు, 18 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న పాట్నా నగరంలో చూడదగ్గ విశేషాలన్నీ చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాలే!
పాట్నా నగరం పేరుకు మూలమైన 'పఠాన్‌దేవి మందిర్', స్టేట్ టూరిజం లోగోగా గుర్తించబడ్డ 'పాట్లీ' వృక్షం, అశోకునిచే నిర్మించబడ్డ 'మాత్రిక'ల విగ్రహాలు, గంగానది తీరాన నిర్మించబడ్డ ప్రభుత్వ కార్యాలయాలు, నాటి ప్రధాన ధాన్యాగారం, ఆడియో- వీడియో విజువల్స్ ద్వారా చరిత్రను పరిచయం చేసే గోల్ఘర్ సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి. 1917లోనే ఇండో ముస్లిం కట్టడ రీతుల్లో ఉన్న 'పాట్నా మ్యూజియం'లో భారతీయ కళాసంపద ముఖ్యంగా పెయింటింగ్స్ రూపంలో లభిస్తాయి. చారిత్రక నేపథ్యం ఉన్న 'ఖుదాబక్ష్ ఓరియంటర్ లైబ్రరీ', సిన్హా లైబ్రరీలలో వేల కొలదీ పుస్తక సముదాయాన్ని వీక్షించవచ్చు.
చారిత్రక ఆనవాళ్ల సమ్మేళనం!
కళారంగానికి పట్టుగొమ్మలుగా, భారతీయ నృత్య కళామందిర్, రవీంద్ర పరిషత్, ప్రేమ్‌చంద్ రంగశాల, పాటలీపుత్ర నాట్యమహోత్సవంగా ఖ్యాతిగాంచిన డ్యాన్స్ ఫెస్టివల్ జరిగే 'కాళిదాస్ రంగాలయ', వీటితోపాటుగా 18-20 దశాబ్దాల మధ్యలో విరాజిల్లిన మినీయేచర్ పెయింటింగ్‌లు.. నేటికీ ప్రభావాన్ని కోల్పోక.. నగరం నలుమూలలా దర్శనమిస్తాయి. అలాగే, ఆర్యభట్ట జన్మించి, నడియాడిన నేల కాబట్టి, ఆయన బొమ్మలనే పెయింటింగ్లుగా చిత్రించిన దానాపూర్ రైల్వేస్టేషన్ ప్రధానద్వారం, గాంధీ మైదానం, బుద్ధ స్మృతిపార్క్, ఆసియాలోనే అతిపెద్ద రివర్ బ్రిడ్జి అన్నీ సందర్శకులకు కనువిందు చేస్తాయి. కాళిదాసు, వాత్సాయనుడు, చాణక్యుడు సంచరించారని చెప్పబడే ఈ నగరంలో వసతి సౌకర్యం సమస్యే కాదు. రైల్వే ప్రాంగణంలోనే హోలిడే హోమ్స్, రిటైరింగ్ రూమ్స్, హోటళ్లు, స్టేట్ గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. స్థానికంగా ఆటోలు, ఇద్దరు మాత్రమే కూర్చోగలిగే రిక్షాలు రవాణాకు సహకరిస్తాయి.
ప్రజారోగ్య పరిరక్షణా కేంద్రాలు
బుద్ధుడు నివసించిన ప్రాంతం కాబట్టి ప్రజలు ప్రధానంగా శాకాహారులు. మాంసం తక్కువగా లభిస్తుంది. అలాగే, నదీపరివాహకం కాబట్టి జలపుష్పాలు (చేపలు) పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో ప్రధాన స్థానం ఆక్రమిస్తాయి. సమోసా చాట్ సర్వసామాన్యం. లిట్టీచోకా, పక్కా పాట్నా ప్రత్యేకతలు. మహిళలు ప్రధానంగా చీరలు, పంజాబీ డ్రస్‌లు ధరిస్తారు. మగవాళ్లు అధికశాతం ధోతీ, కుర్తాలతోనే దర్శనమిస్తారు. నలంద, తక్షశిల కాలంలోనే అంతర్జాతీయ విద్యనందించిన ఈ నగరాన్ని చదువులకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. చూడగానే అతి సామాన్యంగా కనిపించే పాట్నా ప్రజలు బీహార్‌లో ప్రభుత్వం విధించిన మద్యపాన నిషేధాన్ని అమలుపరుస్తూ, కుటుంబాలను ఆర్థికంగా నష్టపోకుండా కాపాడుకుంటున్న వివేకవంతులు. అందుకే అక్కడి ప్రతి ప్రదేశం ప్రజారోగ్య పరిరక్షణ కేంద్రాలుగా కనిపిస్తాయి. 25 వేల మంది ప్రేక్షకులు పట్టే మెయిన్ ఉల్హాల్ స్టేడియం, పాట్నా గోల్ఫ్‌క్లబ్, మహిళల తొలి వరల్డ్‌కప్ జరిగిన పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలు అక్కడి ప్రజలు ఆటల్లో మునిగి తేలేందుకు ఎంతో తోడ్పడతాయి.
అన్ని విధాలా చేరుకోవచ్చు!
ఆకాశమార్గాన పాట్నా చేరుకోవాలనుకునేవారికి గమ్యస్థానం 'లోక్ నాయక్ జయప్రకాశ్ ఎయిర్పోర్ట్'. ఇది పరిమితులున్న అంతర్జాతీయ విమానాశ్రయం. అందుకు కారణం ప్రపంచదేశాల నుంచి పెరుగుతున్న ప్రయాణికులు, మరోవైపు 40 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండే మిలటరీ ఎయిర్‌ఫీల్డ్! కోల్‌కతా తర్వాత అతిపెద్ద నగరంగా ఖ్యాతిగాంచింది పాట్నా రైల్వేస్టేషన్. దేశంలోనే రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో ఒకటి. నేషనల్ ఈస్ట్-వెస్ట్ హవే కారిడార్‌లో 100 కిలోమీటర్లు వీక్షణంగా ఉన్న ఈ నగరం మీదుగా ఎన్‌హెచ్30, ఎన్‌హెచ్31, ఎన్‌హెచ్2 మార్గాలు వెళతాయి.
మనదేశంలో వ్యాపారానికి సులభంగా, అన్ని సౌకర్యాలున్న రెండవ అతిపెద్ద నగరంగా ప్రపంచబ్యాంకు చేత ప్రశంసించబడ్డ ఈ నగరానికి జలమార్గమూ ముఖ్యమైనదే! ఏడాది పొడవునా ప్రవహించే జీవనదుల్లో ఒకటైన 'గంగ' ప్రధాన స్రవంతి. భారతదేశంలోనే అతిపెద్ద జలమార్గంగా గుర్తించబడిన 'అలహాబాద్- హల్దియా' పొడవు 1620 కిలోమీటర్లు. 2014లో అసోం-బెంగాల్ నేవిగేషన్ కంపెనీ ప్రారంభించిన విలాసవంతమైన నౌక 'ఎంవి రాజమహాల్' ఇక్కడి ప్రధానాకర్షణ.
ఏప్రిల్ 13న అశోకా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్లో జాతీయస్థాయి ఫొటోగ్రఫీలో తృతీయ బహుమతిగా వెండిపతకం, రైల్వే మినిష్టర్ సర్టిఫికేట్, పదివేల నగదు బహుమతి స్వీకరించి, దానాపూర్ నుంచి వారణాసి, అలహాబాద్, నాగ్‌పూర్ మీదుగా విజయవాడకు చేరడం నా జీవితంలో ఓ మధురానుభూతి. నా కెమెరా కన్నుకు ప్రోత్సాహ మిచ్చిన రైల్వేస్టేషన్‌కు, పురాతనమైన పట్టణాన్ని దర్శించే అవకాశం కల్పించిన భారతీయ రైల్వేకూ సదా.. కృతజ్ఞతలు.
- డాక్టర్ దుట్టా శమంతకమణి