ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అందమైన, ఆహ్లాదకరమైన హోటళ్లు ఉన్నాయి. పర్యటన సమయాల్లో ప్రకృతి ప్రేమికులు అలాంటి హోటళ్లలోనే విడిది చేసేందుకు ఇష్టపడతారు. అలాంటి హోటల్స్ గురించి మీరూ వినే ఉంటారు. కానీ, మనమిక్కడ చెప్పుకోబోయేది భయంకరమైన హోటల్ గురించి! చాలామంది దీనిని చూసుండరు. కనీసం ఎప్పుడూ విని కూడా ఉండరు. ఆకాశాన్నంటే పర్వతాల మధ్యన నిర్మించిన ఈ హోటల్స్‌లో స్టే చేయాలంటే కాస్త ధైర్యం అవసరమే మరి. నిజానికి పర్యాటకులకు ఇదొక అడ్వెంచర్ అనే చెప్పాలి. మీరూ అలాంటి హోటల్స్‌ను ఇష్టపడతారా? అయితే, ఇంకెందుకాలస్యం పదండి చూద్దాం!
పెరూలోని సెక్రెడ్లోయపై నిర్మించిన స్కైలాజ్ హోటల్ ప్రపంచంలోనే అతిభయంకరమైన హోటల్స్‌లో ఒకటి. ఈ హోటల్ సుమారు 400 అడుగుల ఎత్తయిన కొండపై వేలాడదీయబడినట్లు ఉంటుంది. అందులో విడిది చేయడం రిస్క్‌తో కూడుకున్న పని. ఈ హోటల్ ప్రపంచంలోనే అతిఎత్తులో ఉంది. ఈ హోటల్లోని గదులు కొండలకు ఆనుకుని ఉంటాయి. ఇందులో కనీసం ఎనిమిది మంది వరకూ ఉండొచ్చు. అంతేకాదు, గాలి లోపలకు, బయటకు వెళ్లేందుకు అనువుగా ఒక్కో గదికీ ఆరు కిటికీలు అమర్చబడి ఉంటాయి. పర్యాటకులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారట! కొండలపై ట్రాన్స్పెరంట్ క్యాప్సల్ సూట్స్ నిర్మించబడ్డాయి. జిప్‌లైన్ ద్వారా లోపలికి వెళ్లేందుకు వీలు కల్పిస్తారు. క్యాప్సల్ సూట్స్‌లో నాలుగు బెడ్లతో ఒక బెడ్రూమ్, డైనింగ్ రూమ్ ఉంటాయి. ఇక్కడ నుంచి సెక్రెడ్ లోయ అద్భుతాలను వీక్షించవచ్చు. ఈ హోటల్లో ఒక్కరోజు స్టే చేయాలంటే 20 వేల రూపాయలు చెల్లించాలి. ధరకు తగ్గట్టుగానే ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించవచ్చు. ఈ స్కైలాజెస్ నుంచి పైకి చూస్తే ఆకాశం మనకు చేరువలో ఉన్నట్లు, కిందికి చూస్తే భూమిపై ఉండే పచ్చని ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. పెరూలో అడ్వెంచర్, నేచురల్ టూరిజాన్ని పెంచడానికి ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ క్యాప్సల్స్ కొండలోపల గాజుతో తయారుచేశారు. వీటిని నాలుగుదిక్కులా అద్దాలతో ఎంతో పటిష్టంగా అలంకరించబడి ఉంటాయి. ఇక్కడ స్టే చేయడంతోపాటు విభిన్నమైన వంటరుచులను ఆస్వాదించవచ్చు.
స్కైలాజ్ హోటల్లో విడిది చేయాల్సిందే!
