''జీవితమే ఒక ప్రయాణం'' అంటారు పెద్దలు. అమ్మ రైల్వే ఉద్యోగిని. ''జర్నీలు'' చేయడంలో ఆవిడ ముందుంటుంది. అలా మా ఎనిమిదో ఏట నుండే ప్రతి సంవత్సరం పండగలు, వేసవి సెలవుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలు చూశాం. అక్కడి స్థానిక ఆహారరుచులు ఆస్వాదిస్తూనే జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండటం వల్ల ఎన్ని యాత్రలు చేసినా, ఏనాడూ యాతనలకు లోనవ్వలేదు. ఇన్నేళ్ళ జర్నీలో నా మనోఫలకంపై చిరస్మరణీయంగా నిలచింది మాత్రం ''కాశ్మీర్ దర్శనం''. అక్కడి నా పర్యాటక అనుభవాలు మీకోసం..
విజయవాడ నుండి న్యూఢిల్లీ మీదుగా జమ్మూ చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మేం మాత్రం ''అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో'' ట్రైన్లో బయలుదేరేందుకు నిశ్చయించుకున్నాం. మా ప్రయాణం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ మీదుగా సాగింది. సుమారు 79 స్టేషన్లలో ఆగుతూ 48 గంటల సమయం. 2,848 కిలోమీటర్ల దూరం.. చైన్న్తె నుండీ జమ్మూ వరకూ వెళ్లే ఈ బండి సహజంగానే ''అతిపెద్ద ప్రయాణం''గా వర్ణిస్తారు. ప్రయాణం ప్రారంభం నుండి జమ్మూ చేరే వరకూ రకరకాల భాషలు వినగలిగాం!
ఆతిథ్యం
ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకన్నప్పుడు ఆ జర్నీకి సంబంధించిన ప్లాన్ ముందుగానే వేసుకోవాలి. మేం 'యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో శాశ్వత సభ్యత్వం ఉండడం వల్ల ముందుగానే ఈ మెయిల్ ద్వారా మా రాకను తెలియజేశాం. ఆన్లైన్లోనే పేమేంట్ చేశాం. అంతర్జాతీయంగా ఎన్నెన్నో ప్రాంతాలలో హాస్టళ్లున్న ఈ సంస్థకు, స్థానికంగా సొంత భవంతులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ రూమ్, డార్మిటరీ వసతి రోజుకింత అని వసూలు చేస్తారు. అలా ఎన్ని రోజులైనా ఉండవచ్చు. సొంత భవనాలు లేని చోట స్థానిక హోటల్స్‌తో అనుసంధానమై, రూమ్స్ వారే ఏర్పాటు చేస్తారు. సభ్యులకు 50 శాతం రాయితీ ఉంటుంది. వెహికల్ కావాలంటే ముందుగా బుక్ చేసుకునే సౌకర్యముంటుంది. జమ్మూలోనూ, శ్రీనగర్‌లోనూ మేము యూత్ హాస్టల్లోనే బసచేశాం.
జమ్మూనగరం
జమ్మూకాశ్మీర్‌లో అధికార భాష ''ఉర్దూ''. అయినప్పటికీ కాశ్మీరీ, హిందీ భాషలు సైతం వాడుకలో ఉన్నాయి. టూరిజం ప్రధాన ఆదాయ వనరైన జమ్మూ,కాశ్మీర్లో ఇంగ్లీషు భాష కూడా అధికంగా మాట్లాడతారు. పరిసర ప్రాంతాల దర్శనార్థం జీప్‌లు, ట్యాక్సీలు, ''ప్రిపెయిడ్ బూత్''ల ద్వారా బుక్ చేసుకోవాలి. అయితే 24 గంటల లెక్కన కాదండోరు 12 గంటలు ఒక షిప్టుగా లెక్కిస్తారు. జమ్మూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు కూడా అన్ని ప్రాంతాలకూ ఉంటాయి. వెహికల్ ఛాయిస్ మనదే. అలా వారం రోజులకు ఒకటే వెహికల్ మాట్లాడుకున్నాం. యూత్ హాస్టల్ వారే బుక్ చేసి పెట్టారు. ఈ ప్రాంతమంతా పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి పొందింది. దగ్గరలో ఉన్న రఘునాథ దేవాలయాన్ని చూశాం. ఆలయం బయట వెదురుతో చేసిన రకరకాల వస్తువులు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. బోట్ షికారుకు అనుగుణంగా సరస్సు ఉంది. పక్కనే 20 రూపాయల ఫీజుతో చేపల మ్యూజియం. అక్వేరియం ఉంది. వివిధ రకాల చేపలు ఒకేచోట చూసేసరికి భలే గమ్మత్తుగా అనిపించింది. అడుగడుగునా సెక్యూరిటీ, ఏ వస్తువునూ వెంట తీసుకెళ్లనీయరు.
కాత్రా ప్రయాణం
ప్రధాన రైలు మార్గంలోనున్న స్టేషన్ కాత్రా. ఉత్తర భారతీయులందరూ ఉత్సాహం చూపే ప్రాంతం ఇది. మత విశ్వాసాన్ని పక్కన పెడితే ''త్రికూట'' పర్వతాల మధ్య 13 కి.మీ ట్రెక్కింగ్.. ఎక్కడా ప్లాస్టిక్ కన్పించని అత్యంత పరిశుభ్ర వాతావరణం...హెలికాప్టర్, డోలీ, నడక....ఎవరి సౌకర్యం వారిది... ప్రకృతి ఒడిలో పరవశమై, అలసట తెలియని నడక ప్రయాణం వైష్టోదేవి ఆలయాన్ని చేరుకోవచ్చు. ప్రాచీన ఆలయ నిర్మాణం ఆద్యంతం మనసును కట్టిపడే స్తుం దంటే నమ్మండి.
జమ్మూ నుండి శ్రీనగర్
10 గంటల జీప్ ప్రయాణం... 17 వ శతాబ్దంలో నాటి మెఘల్ సామ్రాజ్యాధినేత జహంగీర్ ఎలా ప్రేమలో పడ్డాడో, అదే విధంగా కాశ్మీర్లోయతో ప్రేమలో పడని వ్యక్తి ఈ విశ్వంలో ఉండడు అంటే అతి శయోక్తి కాదు. జమ్మూ నుండి శ్రీనగర్‌కి 296 కి.మీ ప్రయాణం. అంటే మరో ప్రకృతి ప్రపంచానికి స్వాగత హారం. అసలు, సిసలైన కాశ్మీరు దర్శనం ఈ ఘాట్ రోడ్లోనే ప్రత్యక్షమవుతుంది. ఎత్తయిన దేవ దారు వృక్షాలు, లోతైన లోయలు, నిర్మలమైన నీటి ప్రవాహాలు... కాలుష్యమన్నదే ఎరుగని కాసారాలు... రాళ్లు బండరాళ్లు సరాగాల జంటల్లా...వింత వింత ఆకృతుల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్లు కనిపించే ఇళ్ళు..! ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడి ప్రజలు అసలు సిసలైన కష్టజీవులు. ప్రతి ఆహారపదార్థం జమ్మూ నుండీ లారీలలో రవాణా జరగాల్సిందే.. అందుకే ఘాట్రోడ్డంతా లారీలు, శాంతి భద్రతలు కాపాడే రక్షకభటుల వాహానాలు...దారిలో అక్కడక్కడా చిన్న డాబాలు కనిపిస్తుంటాయి. రాజ్మా, మేకనెయ్యి, బాస్మతి బియ్యంతో చిన్న చిన్న ప్లేట్లలో భోజనం నిత్యం అందుబాటులో ఉంటుంది. దారంతా గోధుమ పొలాలు.. తారుడబ్బాలపై, గోధుమకంకులను కొడుతూ స్త్రీలు, గ్రేడింగ్ ఆధారంగా రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పోసి అమ్మే యాపిల్స్ మమ్మల్ని భలే ఆకర్షించాయి. దారిలో పాట్నీటాప్... దగ్గర అమరనాథ్ యాత్రకు దారి, శ్రీనగర్‌కి దారి చీలుతుంది. శ్రీనగర్ రహదారిలో 9 కి.మీ గుహ రెండు భాగాలుగా విభజించబడి, డివైడర్ మాదిరిగా ఉంటుంది. అలా శ్రీనగర్‌లో ప్రవేశించి, యూత్ హాస్టల్ చేరగానే మండు వేసవిలో కూడా చల్లనిగాలి సాదర ఆహ్వానం పలికినట్లు అనిపించింది. హాయిగా రూమ్‌లో కునుకు తీద్దాం అనుకున్నా ఎందుకో నిద్ర పట్టలేదు. మేం ప్రయాణించిన మార్గమంతా నిత్యం శ్రమిస్తున్న జవాన్లు, బిక్కుబిక్కుమంటున్న అక్కడి ప్రజానీకం గుర్తుకొచ్చి నిద్ర రాలేదు.
గుల్మార్గ్
మరుసటి రోజు గుల్మార్గ్ వెళ్ళేందుకు బయలుదేరాం. దారిపొడవునా ఎన్నో ఇళ్లు, కానీ మనుషుల్లేరు. వలసపోయారంట. శిథిలావస్థలో ఉన్న అందమైన కట్టడాలను తిలకించేందుకు దాదాపు రోజుకు 200 నుండి 2000 వాహనాల్లో పర్యటకులు గుల్మార్గ్ చేరుకుంటారు. అత్యంత పురాతనమైన చర్చి, ట్రీ హుమస్, ట్రీ హోటల్, గుర్రంపై గుల్మార్గ్ లోయ మొత్తం షికార్, జవహర్లాల్ మేంటనీరింగ్ ఇనిస్టిట్యూట్, స్క్రీయింగ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలో అత్యంత పెద్ద గోల్ఫ్ కోర్టుతోపాటు ఇక్కడి లోయంతా నివాసాలతో నిండిపోయినట్లు దర్శనమిచ్చింది. అక్కడి ప్రకృతి అందాలను వదిలిపెట్టి రావాల నిపించక పోయినా అతి కష్టంగా వచ్చామనే చెప్పాలి. శ్రీనగర్ చేరుకుని, దాల్లౌక్లో బోట్ హేస్‌లో ఒకరోజున్నాం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. ఆ సాయంత్రం మొఘల్ గార్డెన్స్‌లో ''తులిప్ తోటల సౌందర్యం'' చూస్తే సిల్సిలా సినిమాను గుర్తుకు తెచ్చింది.
స్టే చెయ్యాల్సిందే
శ్రీనగరలో కనీసం పదిరోజులు ఉండేట్లు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కారణం అక్కడ నుండే కార్గిల్, లేహా లఢక్ ప్రాంతాలు దర్శించాలి. హై ఎలెర్టెట్ ప్రాంతమవడం వలన వెహికల్ 20 కి.మీ వేగం మించదు. హాస్పిటల్స్, స్కూల్స్ తక్కువగా ఉన్నాయి. టమాట, బంగాళదుంప, యాపిల్స్ తప్ప మరేం కన్పించలేదు. వెదురు వస్తువులు మాత్రం ఎన్ని వెరైటీలో! మనకు బంగాళాదుంప చిప్స్ మాదిరిగా కట్ చేసిన యాపిల్ చిప్స్ అక్రూట్, కుంకుమ పువ్వు,, స్వచ్ఛమైనవి రీజనబుల్ రేటులో లభించాయి. కాశ్మీరీకే ప్రత్యేకమైన దుస్తులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే దుకాణంలో కొన్నాం. నాలుగు రోజులనంతరం వెనుదిరిగాం. అలసట భావించేవారు విమానంలో ఢిల్లీ వెళ్లే సౌకర్యం ఉంది.. జమ్మూ చేరుకుని, మళ్లీ అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లోనే తిరుగు ప్రయాణమయ్యాం. ఇక్కడ కొన్ని ప్రాంతాల ప్రజలు చాలా హీన స్థితిలో ఉన్నారు. జీవన పోరాటం, ప్రాణ, మాన సంరక్షణలకై నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంది. అందమైన ఆ లోయలో జీవితం అడుగడుగునా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచినా, తెరవెనుక స్థానిక సమస్యలు అనేకం. అలాంటి సుఖదు:ఖాల సమ్మేళనాన్ని కళ్ళారా చూడాలంటే కాశ్మీర్ వెళ్ళాల్సిందే మరి. అయితే కాశ్మీర దర్శనం ఖర్చుతో కూడుకున్న ప్రయాణం అనే విషయాన్ని మరువకండి!
- సాహిత్య
కాశ్మీరు చూసొద్దాం!
