- పాలిటీ టెర్మినాలజీ - గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
1. ఆయారామ్, గయారామ్ : పార్టీ ఫిరాయింపులు జరిపే వారికి ముద్దుపేరు. వీరిరువురూ హర్యానాలో 1967-68లో తరచూ పార్టీలు మారడం వల్ల ఆ విధంగా పిలుస్తున్నారు.
2. ఫ్లోర్క్రాసింగ్ : ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడం.
3. కోరమ్ : సభ జరగడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. భారతదేశ చట్ట సభలలో కోరమ్ 1/10వ వంతుగా నిర్ణయించారు. ఉదా : లోక్‌సభలో కోరమ్ 55 మంది సభ్యులు కాగా, రాజ్యసభలో 25 మంది సభ్యులు.
4. లేమ్‌డక్ సెషన్ : బ్రిటన్ సామాన్యుల సభ (హైస్ ఆఫ్ కామన్స్) ఎన్నికలు జరిగిన తరువాత అంతకుముందు సభ సభ్యులుగా ఉండి, ప్రస్తుత సభకు ఎన్నికకాని వారిని, నూతనంగా ఎన్నికైన సభ్యులను కలిపి, చిట్టచివరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని లేమ్‌డక్ సెషన్ అంటారు. ఈ విధానం భారతదేశంలో అమలులో లేదు.
5. విజేతృభాగ నిర్ణయ పద్ధతి : ఈ పద్ధతి అమెరికాలో అమలులో ఉండేది. ఎన్నికలలో గెలిచిన పార్టీ తన మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించడాన్ని విజేతృభాగ నిర్ణయ పద్ధతి అంటారు. 1828లో ఆండ్రూజాక్సన్ అనే అమెరికా అధ్యక్షుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1887లో ఉడ్రోవిల్సన్ ఈ పద్ధతిని రద్దు చేశారు.
6. అధికార పృథక్కరణ సిద్ధాంతం : ఈ సిద్ధాంతాన్ని మాంటెస్క్యూ ప్రతిపాదించాడు. ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక వర్గం, శాసననిర్మాణ శాఖ, న్యాయశాఖల మధ్య సంబంధాన్ని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
7. నిరోధ సమతౌల్యాలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) : అమెరికా రాజ్యాంగం ఈ సిద్ధాంతంపై ఆధారపడింది. ప్రభుత్వ అంగాలు మూడు ఒకదానిని మరొకటి నిరోధించుకుంటూ సమతుల్యంతో పనిచేస్తాయి.
8. షాడో క్యాబినెట్ : బ్రిటన్ దేశంలో అమలులో ఉన్నది. బ్రిటన్‌లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ఒక ఛాయా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, మంత్రిత్వ శాఖలను తన సభ్యులకు అప్పగిస్తుంది. ఆయా శాఖలలో వారు అనుభవం పొందుతారు.
9. హంగ్ పార్లమెంట్ : లోక్‌సభ సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయపార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంట్ అంటారు.
10. రీ కాల్ : స్విట్జర్లాండ్‌లో అమలులో ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులలో ఇది ఒకటి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేయని పక్షంలో ప్రజలు వారిని వెనుకకు పిలుస్తారు.
11. న్యాయ సమీక్షాధికారం : కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణశాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే (అల్ట్రావైరెస్) అవి చెల్లవు (నల్ అండ్ వాయిడ్) అని న్యాయవ్యవస్థ ప్రకటించడం. 1803లో మాడిసన్ వార్సెస్ మార్బురీ కేసులో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ న్యాయ సమీక్షాధికారాన్ని ప్రకటించాడు.
12. శ్వేతపత్రం : ప్రభుత్వం ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, అధికార పూర్వకంగా ప్రకటించే పత్రాలు.
13. ఫోర్త్ ఎస్టేట్ : పత్రికా రంగాన్ని, మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరిస్తారు. బ్రిటిష్ పార్లమెంట్‌సభ్యుడు ఎడ్బర్గ్ మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు.
14. ఫిప్త్ ఎస్టేట్ : ఇటీవల కాలంలో 'సోషల్ మీడియాను' ఫిఫ్త్ ఎస్టేట్‌గా వ్యవహరిస్తున్నారు.
15. సుమోటో : న్యాయవ్యవస్థ తనంతట తానుగా, స్వయం ప్రేరితంగా, పిటిషన్ అవసరం లేకుండా ఒక అంశాన్ని విచారణకు స్వీకరించడం.
16. గెర్రిమాండరింగ్ : నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను తమకు అనుకూలంగా అధికారంలో ఉన్న పార్టీ చేపట్టడాన్ని గెర్రిమాండరింగ్ అంటారు.
17. ఫిల్బస్టరింగ్ : శాసనసభలు, చట్టసభలు సమావేశాలు సరిగా జరగకుండా ఉండటానికి సభ్యులు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయడం, అమెరికాలో ఫిల్బస్టరింగ్ అనే సెనేటర్ ఈ పద్ధతిని ఉపయోగించాడు.
18. వాయిదా తీర్మానం (ఎడ్జర్న్మెంట్ మోషన్) : అత్యవసర ప్రజాసంబంధిత విషయంపై చర్చించడానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. సభ్యుడు ఈ తీర్మానం ప్రవేశపెట్టదలిస్తే స్పీకర్‌కు ఆరోజు ఉదయం 10 గంటలులోగా లిఖితపూర్వక తీర్మానాన్ని అందజేయాలి. దీనికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం.
19. అడ్వకేట్ జనరల్ : రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడుని.. 67వ నిబంధన ప్రకారం గవర్నర్ చేత నియమిస్తారు.
20. అటార్నీ జనరల్ : భారత ప్రభుత్వ ప్రథమ న్యాయ సలహాదారుడు.. 76వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ద్వారా నియమిస్తారు.
21. కొలీజియం : న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడానికి భారతదేశంలో కొలీజియం ఏర్పడింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు.
22. వార్షిక ఆర్థిక పట్టిక (యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్) : భారతదేశంలో రాజ్యాంగంలో 112వ నిబంధన ప్రకారం బడ్జెట్‌ను వార్షిక ఆర్థికపట్టిక అని పిలుస్తారు.
23. ఉపకల్పనా బిల్లు (అప్రాప్రియేషన్ బిల్) : బడ్జెట్‌పై చర్చ సందర్భంలో వివిధ శాఖలన్నీ చేసిన గ్రాంట్ల కోసం డిమాండ్స్, అన్నింటికీ కలిపి ఉపకల్పనా బిల్లుగా ప్రతిపాదిస్తారు.
24. సంకీర్ణం (కొయాలియేషన్) : ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు భిన్నమైన పార్టీలు కలిసి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
25. సమిష్టి బాధ్యత : పార్లమెంటరీ విధానంలో మంత్రిమండలి సమిష్టిగానూ, వ్యక్తిగతంగానూ ప్రజలు ఎన్నుకున్న సభకు బాధ్యత వహించాలి.
26. సంఘటిత నిధి : భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలన్నింటినీ 266వ నిబంధన ప్రకారం ఏర్పడిన సంఘటిత నిధికి జమ కడతారు.
27. ఆగంతక నిధి : ఊహించని వ్యయాలను భరించడానికి రాష్ట్రపతి ఆధీనంలో 267వ నిబంధన ప్రకారం ఆగంతక నిధిని ఏర్పాటు చేశారు.
28. కోత తీర్మానం : పార్లమెంటరీ విధానంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభ్యులు బడ్జెట్ ప్రతిపాదనల పట్ల నిరసన తెలపడానికి కోత తీర్మానాలు ప్రతిపాదించవచ్చు.
29. అత్యవసర పరిస్థితి : రాజ్యాంగంలో 352వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆంతరంగిక, బాహ్య అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.
30. రాష్ట్రపతి పాలన : రాజ్యాంగంలో 356వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పటికి సుమారు 125 సార్లు విధించారు.
31. ఆర్థిక అత్యవసర పరిస్థితి : దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ నిబంధన ప్రకారం విధించవచ్చు. ఇప్పటివరకూ విధించలేదు.
32. ఆర్థిక బిల్లు : బడ్జెట్ ఆమోదించే చివరిదశలో ఆర్థికమంత్రి పన్నుల ప్రతిపాదనలన్నింటినీ కలిపి ఆర్థిక బిల్లుగా ప్రతిపాదిస్తాడు.
33. ఆర్థిక సంఘం : కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ కోసం రాష్ట్రపతి 280వ నిబంధన ప్రకారం ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు.
34. గిలిటెనింగ్ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గ్రాంట్ల కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు, కేటాయించిన సమయం అయిపోయిన తర్వాత, మిగిలిపోయిన డిమాండ్లనన్నింటినీ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని గిలిటెనింగ్ అంటారు.
35. హెబియస్ కార్పస్ : అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచమని సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం, హైకోర్టు 226వ నిబంధన ప్రకారం జారీ చేసే రిట్.
36. అంతర్రాష్ట్ర మండలి : కేంద్ర-రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి 263వ నిబంధన ప్రకారం ఏర్పడినది.
37. ఆర్డినెన్స్ : పార్లమెంట్ సమావేశాలలో లేనప్పుడు అత్యవసర విషయాలపై రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయిస్తుంది.
38. నిర్ణాయకపు ఓటు : ఒక బిల్లుపై అధికారపక్షానికి, ప్రతిపక్షానికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణాయకపు ఓటును వినియోగించవచ్చు.
39. జీరో అవర్ : ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభాకార్యక్రమాలు మొదలయ్యే ముందు కాలాన్ని జీరో అవర్ అంటారు. 1962 నుంచి భారత పార్లమెంట్లో ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ సమయంలో ముందస్తు నోటీసు లేకుండా ఏ అంశంపైనైనా వివరణ కోరవచ్చు.
40. ఎడ్జర్న్సైన్డై (నిరవధిక వాయిదా) : లోక్‌సభ సమావేశాలు నిర్ణయించిన కాల వ్యవధిలో పూర్తి అయిన తరువాత స్పీకర్ సభను నివరధిక వాయిదా వేస్తాడు.
41. ప్రోరోగ్ : సభ సమావేశాలను ముగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రోరోగ్ అంటారు.
42. ఆపద్ధర్మ ప్రభుత్వం : అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ కొనసాగే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు.
43. పృథకరించు సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ) : ఒక చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి భంగకరమని న్యాయస్థానం ప్రకటించినప్పుడు, ఆ నిబంధనలను రాజ్యాంగ అనుకూల నిబంధనల నుంచి వేరు చేసి, భంగకర నిబంధనలు చెల్లవు, రాజ్యాంగ అనుకూల నిబంధనలు చెల్లుతాయి అని ప్రకటించడం.
44. గ్రహణ సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్) : రాజ్యాంగం అమలులోకి రాకముందు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత దానికి విరుద్ధంగా భావిస్తే, ఆ చట్టాలు చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది.
45. సమన్యాయ పాలన (రూల్ ఆఫ్ లా) : ఈ సూత్రాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. దీని ప్రకారం చట్టం ముందు పౌరులందరూ సమానులే.
46. ఉభయసభల సంయుక్త సమావేశం : రాజ్యాంగంలో 108వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అవసరమైనప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు.
47. అవశిష్టాధికారాలు : కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో చేరని అధికారాలను అవశిష్టాధికారాలు అంటారు. భారతదేశంలో ఇవి కేంద్రానికి కలవు.
48. పిత్ అండ్ సబ్స్టెన్స్ (డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్) : అధికార విభజన జరిగినప్పుడు ఒక జాబితాలో పొందుపరిచిన అంశం, మరొక జాబితాలో పొందుపరచిన అంశంతో కొంత మేరకు అతిక్రమం జరగవచ్చు. అలా జరిగినప్పటికీ ఆ చట్టాలను రద్దు చేయరు. దీనిని పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు.
49. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) : భారత ప్రభుత్వం వస్తువులపై 'ఒక జాతి - ఒకే పన్ను' నినాదంతో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టి 279-ఎ నిబంధనను రాజ్యాంగంలో చేర్చినది. దీని ప్రకారం పన్నుల వ్యవస్థను నిర్ణయించడానికి ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో జిఎస్టి కౌన్సెల్ ఏర్పడింది. ్య
రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ
- కొన్ని ముఖ్యగ్రంథాలు
1. Granville Austin - Indian Constitution: corner stone of a Nation.
2. Granville Austin - Working a Democratic Institution: The Indian Experience
3. Rajani Kothari - Politics in India
4. Rajani Kothari - Caste in Indian Politics
5. DD Basu - Introduction to Indian Constitution
6. Lord Bryce - Modern Democracies
7. Ivor Jennings - Some characteristics of Indian Constitution
8. HJ.Lask - Grammar of Politics
9. K.C. Wheare - Federal government
10. R. Venkatraman - My Presidential Years
11. TN. Seshan - The Degeneration of India
12. Nani Palkivala - We, the people
13. N. Sanjeeva Reddy - Without fear or favour
14. PV. Narasimha Rao - The Insider
15. M.V. Pylee - Constitutional government of India
16. N.D. Palmer - The Indian Political System
17. W.H. Morris Jones - The government and politics of India
18. R.L. Hard Grave - India: Government and politics in a developing Nation
19. Atul Kohli - The success of India's democracy
20. FR. Frankel - India's Political Economy 1947-1977
21. Selig Harrison - India : The most dangerous decades
22. W.H. Morris Jones - Parliament in India
23. Kuldip Nayar - India After Nehru
24. M. Weiner - Sons of the Soil
25. Paul Brass - Factional politics in an Indian state
- కె.ఎస్ లక్ష్మణరావు
శాసనమండలి మాజీ సభ్యులు.
సెల్ : 9440262072