జోష్‌ ఏదీ?

Apr 29,2024 01:15 #election

మ్యానిఫెస్టోపై వైసిపి శ్రేణుల్లో అంతర్మథనం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 సాధారణ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో వైసిపి శ్రేణులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. 2019 నవరత్నాల పేరుతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి ఇపుడు అవే పథకాలను కొనసాగిస్తామని చెప్పడం తప్ప కొత్తదనం ఎక్కడా ప్రతిబింబించకపోవడం వైసిపిలో చర్చనీయాంశంగా మారింది. నాడు ప్రకటించిన మ్యానిఫెస్టోలో కీలకమైన ఉద్యోగుల సిపిఎస్‌ రద్దు, ప్రతియేటా జాబ్‌ క్యాలెండర్‌, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు మెరుగైన పునరావాస ప్యాకేజీ, మద్యపాన నిషేధం, కేంద్రం నుండి ప్రత్యేక హోదాను సాధించడం, రైల్వే జోన్‌ వంటి కీలకాంశాల్లో చేతులెత్తేసిన వైసిపి ప్రభుత్వం ఇపుడు అవే నవరత్నాలను మళ్లీ అమలు చేస్తామంటూ చేసిన ప్రకటన పట్ల ప్రజల్లో కూడా నిరాశను నింపింది. ప్రత్యర్థి తెలుగుదేశం కూటమి చాలా కాలం కిందటే ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను మరిపించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించే మ్యానిఫెస్టో వుంటుందని అంతా ఆశించారు. అయితే సూపర్‌ సిక్స్‌ను మరిపించడం కాదుకదా వాటికంటే తక్కువ మొత్తాన్ని ప్రకటించారు. సూపర్‌ సిక్స్‌ పథకంలో పెన్షన్‌ను రూ.4 వేలకు, రైతు భరోసా రూ.20 వేలకు పెంచడం, మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్‌లను ఉచితంగా ఇవ్వడం, మహిళలకు ఉచిత ఆర్‌టిసి ప్రయాణం, మూడు వేల నిరుద్యోగ భృతి వంటి అంశాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్‌ సిలిండర్‌ల పథకాలతో కాంగ్రెస్‌ పార్టీ పొరుగున వున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అనూహ్యమైన విజయాలు సాధించిన అంశాలు కళ్లెదుట వున్నా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనీసం ఇలాంటి పథకాలనైనా ప్రకటిస్తారని ఆశించారు.
డ్వాక్రా మహిళలు నిరుత్సాహం
డ్వాక్రాలకు మెరుగైన పథకాన్ని తీసుకొస్తారని, అలాగే రైతు రుణమాఫీపై ప్రకటన వుంటుందని వైసిపి అభ్యర్థులతోపాటు పార్టీ శ్రేణులు అంతా అనుకున్నారు. ఆ రెండు ప్రకటనలు లేకపోవడంతో నిరుత్సాహం చెందారు. 2019లో పెన్షన్‌ను జగన్‌మోహన్‌రెడ్డి మొదట రూ.2 వేలు అనగానే, చంద్రబాబు రూ.3 వేల ప్రకటన చేశారు. నాడు జగన్‌ కూడా వెంటనే తమ ప్రభుత్వం రాగానే మూడు వేలు ఇస్తామనే ప్రకటన చేయడంతో ప్రజలు ముందు వాగ్దానం చేసిన జగన్‌నే ఆదరించారని, ఇపుడు వారికి ధీటుగా ప్రకటన లేకపోవడం తమకు నష్టం చేస్తుందని వైసిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️