సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని సృజనాత్మక బాటలో కార్పొరేట్ గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నవతరం ప్రతినిధి ఆమె. పారిశ్రామిక వ్యర్థాలను సరైనవిధంగా క్లీన్ చేయకుండా నేలతల్లిని, గాలిని విషతుల్యం చేయడం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ నిర్లక్ష్య దోరణితో లాభాలు గడిస్తున్న బడా కార్పొరేట్ కంపెనీలపై యుద్ధభేరీ మోగించి అలజడి రేపుతున్న ఆ యువకిశోరమే సోఫియా అష్రప్. సోఫియా పుట్టింది పెరిగిందీ చెన్నరులో. భోపాల్ విషవాయు బాధితుల వేదనాభరిత కథనాలతో చలించిపోయి ఆ దారుణానికి కారణమైన డౌ కెమికల్స్ సంస్థల్లో పనిచేయొద్దంటూ 'డోన్ట్ వర్క్ ఫర్ డౌ' తొలిసారి ర్యాపర్‌గా అస్త్రాన్ని సంధించింది. గతేడాది యూనీలీవర్ కంపెనీ తమిళనాడులోని కొడైకెనాల్లో థర్మోమీటర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడి పాదరసం వ్యర్థాలను నిర్లక్ష్యంగా వదిలేసి ప్రజలను ఆనారోగ్యాల పాల్జేస్తుంటే సోఫియా సహించలేకపోయింది. యూనీలీవర్ నిర్లక్ష్య దోరణిని కడిగిపారేస్తూ 'కొడైకెనాల్ వోంట్' పేరుతో మరోమారు అలజడి సృష్టించింది. ఇప్పుడు జట్కా (అలజడి) అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థలో క్రియాశీలకంగా పనిచేస్తూ సామాజిక, ప్రజా సమస్యలపై సృజనాత్మక పోరు సాగిస్తున్నారు. యువతలో విప్లవస్ఫూర్తిని రగిలించే ఆ యువకెరటం ఈ వారం మన ప్రతినిధి.
సోఫియా అష్రప్ 1987లో చెన్నయిలో ఓ ముస్లిం సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ముస్లిం యువ సంఘాల్లో చురుగ్గా ఉండేవారు. ఇస్లామిక్ చరిత్ర అధ్యయనం చేశారు. తత్వశాస్త్రాన్ని ఓ పట్టు పట్టారు. మరోవైపు చెన్నరులోని స్టెల్లా మేరీస్ కాలేజీలో గ్రాఫిక్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు. కాలేజీలో ఉన్నన్నాళ్లూ అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సోఫియా పేరే మార్మోగేది. ఉత్సవమేదైనా అందులో సోఫియా 'ర్యాపింగ్' ఉండితీరాల్సిందే. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ముస్లిం పట్ల పెరిగిన వ్యతిరేకతను ప్రశ్నిస్తూ 'ద బుర్ఖా ర్యాపర్' అంటూ సంప్రదాయ 'ముసుగు'ను తొలగించింది సామాజిక బాధ్యతను భుజాన వేసుకుంది.
యూనీలీవర్ క్లయింట్ కంపెనీలో జాబ్
యూనీలీవర్‌కు అత్యంత ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించే ప్రఖ్యాత ఒగిల్వీ అండ్ మాథెర్ (ఓఅండ్ఎం) కంపెనీలో క్రియేటివ్ సూపర్వైజర్గా సోఫియా తన కెరీర్ స్టార్ట్ చేశారు. 'కొడైకెనాల్ వోంట్' ర్యాపర్ సృష్టించేందుకు కొద్ది నెలల ముందే ఆ కంపెనీకి గుడ్‌బై చెప్పింది. సోఫియా లాంటి సృజనాత్మక ఉద్యోగులను వదులుకోలేమని, కానీ ఆమె
కొత్త కెరీర్ ఎంచుకున్నారని ఆ కంపెనీ ఛైర్మన్ పియూష్ పాండే ప్రకటించారంటే సోఫియా టాలెంట్ ఏంటో అర్థమౌతుంది. బాలివుడ్ మూవీ జబ్ తక్ హై జాన్ చిత్రంలో ఓ సాంగ్, అలాగే లేటెస్ట్ తమిళ మూవీ మరియన్లో సంగీత దిగ్గజం ఎఆర్ రెహ్మన్ కోరిక మేరకు మరో సాంగ్ పాడి ఇటు వెండితెర వెనుకా రాణిస్తున్నారు.
యూనిలీవర్‌కు ముచ్చెమటలు
కొడైకెనాల్లో హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ థర్మోమీటర్ ఫ్యాక్టరీ నడుపుతోంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వెలువడే టన్నుల కొద్దీ పాదరస వ్యర్థాల వల్ల పొలాలు, జలవనరులు విషతుల్యమై స్థానిక ప్రజానీకం ఆనారోగ్యపాలౌతున్నారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఆసుపత్రుల పాలౌతున్నారు. . కానీ అదేమీ పట్టని యూనీలీవర్ కంపెనీ వ్యర్థాలను క్లీన్ చేయకుండా, బాధితులకు చిల్లగవ్వ పరిహారం ఇవ్వకుండా పరిహాసమాడుతోంది. నిర్లక్ష్యపూరితంగా ఈ బడా కార్పొరేట్ కంపెనీ సాగిస్తున్న దారుణాలను ఎండగట్టాలన్ని సోఫియా నడుంబిగించి రంగంలోకి దుమికింది. ప్రఖ్యాత ర్యాపర్ నిక్కీ మింజా 'అనకొండ' ర్యాప్‌కు పేరడిగా చక్కని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అంతే వేలాది లైక్‌లు, షేర్లు. గతేడాది జులై 30న పోస్ట్ చేసిన ఈ వీడియోకు అనతికాలంలోనే జాతీయంగా, అంతర్జాతీయంగా విశేష ఆదరణ లభించింది. ఎంతగా పాపులర్ అయ్యిందంటే పోస్ట్ చేసిన కొన్నాళ్లకే 'అనకొండ' ఫేమ్ నిక్కీ మినాజ్‌కు సైతం ఆ వీడియో చేరిపోయింది. పాదరస వ్యర్థాలు క్లీన్ చేయాలని సోఫియా ఆన్లైన్ పిటిషన్లో లక్షలాది మంది నెటిజన్లు సంతకాలు చేశారు. దీంతో యూనీలీవర్‌కు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే సీనియర్ అధికారులతో వివరణ ఇచ్చుకుంది. తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశానుసారం పాదరస వ్యర్థాల తొలగింపునకు తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
ర్యాప్ అంటే..
నల్లజాతి యువతను ఊర్రూతలూగించే డ్యాన్స్. ఆఫ్రికన్ దేశాల్లో ర్యాప్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. సంప్రదాయ ఆట, పాటలకు భిన్నంగా ఉషారునిచ్చే శైలిలో ఉంటుంది. సాధారణ ప్రజానీకం మాట్లాడే భాషలోని పదాలను తీసుకొని, అవసరమైన చోట వచనం జతం చేసి, ఇంకా అవసరమైతే సంభాషణా చేర్చి, బిగ్గరగా అరుస్తూ, స్పష్టంగా పలుకుతూ, వడివడిగా ఆపిఆపి చెప్పాలనుకునేది రిథమిక్‌గా చెబుతూ, హిప్హాప్ నృత్యాన్ని జత చేసే అలజడి సృష్టించే నృత్య జలపాతమే ర్యాప్.
కొడైకెనాల్ స్టార్ కార్పొరేట్ గుండెల్లో గుబులు పుట్టించే
