ఐస్ హాకీ ! ప్రస్తుతం ఈ ఆటను భారతీయ మహిళా టీమ్ ఆడి చూపిస్తుంది. ఈ ఆటకు మనదేశంలో పెద్దగా సదుపాయాలు లేకపోయినప్పటికీ, అతి తక్కువ సమయంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద టీమ్‌లను మట్టికరిపించి విజయ పతాకాలను ఎగురవేసింది ఈ మహిళా బృందం. భారతీయ మహిళల ఐస్ హాకీ టీమ్ ప్రత్యేకత ఏంటంటే.. టీమ్ సభ్యులంతా లడఖ్ చెందినవారే. అయితే ఇలా ఎందుకు జరిగింది? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. లడక్‌లో ప్రతిఏటా నవంబర్ నుంచి జనవరి వరకూ వీపరితంగా మంచు కురుస్తుంది. ఎముకలు కొరికే చలిలో అక్కడి పిల్లలు గడ్డకట్టే నీటి చెరువులపైన ఐస్ హాకీ ప్రాక్టీస్ చేస్తుంటారు. సరదాగా మొదలైన ఆట నేడు భారతదేశం తరపున 'మహిళా ఐస్ హాకీ టీమ్' రూపుదిద్దుకునే స్థాయికి ఎదిగింది. అయితే, ఇంత పెద్ద దేశంలో ఐస్ హాకీ ఆడే క్రీడాకారులు మరెక్కడా లేకపోవడం విచారించాల్సిన విషయం. 'లడఖ్‌లో మంచు కురవడం వల్ల భారతీయ హాకీ టీమ్ క్రీడాకారులకు 2 నెలలు అక్కడ మంచుతో నిండిన నీటిచెరువులపై మాత్రమే ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. లడఖ్‌లో ఏటా 10,000-12,000 మంది యువకులు ఐస్ హాకీ కోసం శిక్షణ పొందుతారు. జనవరిలో నిర్వహించే 'నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్' లేదా ఐహెచ్ఎఐ ( ఐస్ హాకీ అసొసియేషన్ ఆఫ్ ఇండియా) వంటి ప్రముఖ టోర్నమెంట్స్‌లో ఆడతారు'' అని లడఖ్ వింటర్ స్పోర్ట్స్ క్లబ్ వారు చెబుతున్నారు.
ధైర్యంగా ముందడుగు!
సాధనచేసే బృందంలో అమ్మాయిలు చురుకుగా ఉండేవారు. అయితే, లడఖ్‌లో చాలా ఏళ్లపాటు మహిళలకు ఈ ఆట ఆడేందుకు అనుమతి లేదు. వారి ఉత్సాహం చూసి, 2008లో వారికి ఆడే అవకాశమిచ్చారు. అప్పటి నుంచి స్థానిక అమ్మాయిలు వెనుదిరిగి చూడలేదు. 2013లో 'లడఖ్ వింటర్ స్పోర్ట్స్ క్లబ్' ఆధ్వర్యంలో మొదటిసారి మహిళా ఐస్ హాకీ 'నేషనల్ ఛాంపియన్షిప్' నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు కేవలం లడఖ్ పేరునే కాదు యావత్ దేశం పేరునే ఈ ఆటతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. 2017లో 'ఏషియా కప్' సమయంలో భారతీయ మహిళా హాకీ టీమ్ తన రెండో మ్యాచ్‌లో ఫిలిఫ్పిన్స్ వంటి బలమైన టీమ్‌తో 4-3 అంచు వరకూ రావడంతో, అక్కడి కోచింగ్ సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే, అతి తక్కువ సమయంలో భారతీయ టీమ్ అలాంటి గొప్ప ఘనత సాధించింది మరి. దాని తర్వాత మలేషియా వంటి బలమైన టీమ్‌కు గట్టి పోటీనిచ్చి 5-4 తో ఓడించింది. 'మాకు శిక్షణ కోసం ఐస్ రింక్ లేకపోవడం వల్ల తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. కిర్గిస్తాన్, మలేషియా, యుఎఇ వంటి దేశాల్లో శిక్షణ పొందితే మరిన్ని విజయాలు సాధించగలం. గడిచిన కొన్నేళ్ల నుంచి మా ఫెడరేషన్, ప్రభుత్వాన్ని సాయం అడుగుతోంది. కానీ, మన దేశంలో హామీ తప్ప ఎలాంటి సాయం లభించదని మాకు అర్థమైంది. అయినా మా ప్రయత్నాన్ని వదులుకోం' అంటూ ధైర్యంగా చెబుతున్నారు. గడ్డకట్టే చలిలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోన్న ఈ అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ఇండియన్ ఐస్ హాకీ ఉమెన్ టీమ్
