రెక్కాడితేగానీ డొక్కాడదు.. పొద్దంతా పనిచేసినా కనీసవేతనం ఉండదు.. రోగమొస్తే ప్రాణాలకు భరోసా ఉండదు.. ఏళ్ల నుంచి బిల్డింగ్ వర్కర్లు, కార్పెంటర్లు, హోటల్ సర్వర్లు, రోజు కూలీలు అనుభవిస్తున్న దుర్భర దుస్థితి ఇది. ఓ పక్క సమాజంలో సగటుజీవి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నా.. కూలి పనులు చేసుకునే వారి పరిస్థితి ఏమాత్రమూ మారడం లేదు. ఆకాశాన్ని తాకే భవనాలు వెలుస్తున్న ఈ రోజుల్లోనూ.. వీరిది పని దొరక్క ఆకలితో అలమటించే దుస్థితి. ఒకప్పుడు అసంఘటితరంగ కార్మికులు పనిచేయడానికి అంతో ఇంతో పని దొరికేది. ఇప్పుడు చేయడానికి పనులే కరువవుతున్నాయి. పని ఉన్నా.. శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. దీంతో ఎన్నో ఏళ్ళుగా అసంఘటితరంగపు కార్మికులుగానే మిగిలిపోతూ కనీస ఆర్థిక, సామాజిక భద్రత లేని జీవితాలను గడుపుతున్నారు. వివిధరంగాల్లో కేవలం నిత్యం చెమటోడుస్తూ.. అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న అసంఘటిత కార్మికుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం..
ఉదయాన్నే గ్రామ కూడళ్ళ వద్దకు చేరి పాటక జనం ఆ రోజు పనికి ఎదురుచూసే పరిస్థితులు ఇప్పటికీ మారడంలేదు. పైగా పనులు కావాలనే వారు పెరిగి, చేయడానికి పనులు లేకపోవడంతో కార్మికుల్లో పోటీ ఏర్పడింది. యజమానిని గట్టిగా నిలదీస్తే మళ్లా మరోసారి పనికి పిలిచే పరిస్థితి లేదు. మరోపక్క వ్యవసాయ రంగమే కాకుండా పరిశ్రమలు, భవన నిర్మాణరంగం, జట్టు కార్మికులు .... ఇలా అనేక రంగాల్లో యాంత్రీకరణ కారణంగా పనిదినాలు తగ్గిపోతున్నాయి. ఇదీ ప్రస్తుతం అసంఘటితరంగ కార్మికుల దుస్థితి. వారి నిత్యజీవన స్థితిగతులు ఎలాంటివో కేస్స్టడీస్లో చూద్దాం.
కేస్‌స్టడీ: 1
''వారానికి నాలుగు రోజులే పని.. అదీ దొరుకుతుందో లేదో తెలీదు. ఒకరోజు పని ఉంటే మరోరోజు ఉండదు. ఏ రోజుకారోజు హమ్మయ్య ఈ రోజుకు పని దొరికిందిలే అనుకోవడమే. ఒకవేళ పని దొరకకుంటే అంతే. వచ్చిన దాంతోనే సరిపెట్టుకోవాలి. దీనికితోడు పని చూపించినందుకు మేస్త్రీకి మామూలు ఇవ్వాల్సిందే. ఇంక మిగిలింది తినడానికి, ఛార్జీలకే సరిపోతుంది...' ఇది రాజధాని అమరావతి పరిధిలోని ఓ వడ్రంగి కార్మికుని ఆవేదన.
కేస్‌స్టడీ: 2
'రాజధాని నేపథ్యంలో నిర్మాణాల వేగం పెరిగింది. ఇంటి అద్దెలు పెరగడంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునే వాళ్లూ పెరిగారు. కానీ కాంట్రాక్టర్లు ఏ రోజు పనికి పిలుస్తారో తెలియదు. రోజూ పని ఉంటుందనే భద్రత లేదు. ఒక వేళ పిలిచినా.. ఇద్దరు, ముగ్గురు చేసే పని ఒక్కరే చేయాలి. పనిచేసే చోట సరైన సదుపాయాలు ఉండవు. ఇదికావాలి అని గట్టిగా అడిగితే, మళ్ళీ పనికి పిలవరు అనే భయం. చెప్పింది చెప్పినట్లు చేయాలి..' ఇది ఓ తాపీ కార్మికుని ఆందోళన.
కేస్‌స్టడీ:3
'హోటల్ అంటే మాటలా.. బోలెడంత పని ఉంటుంది.. నిమిషం తీరిక లేకుండా పనిచేయాలి. అన్నీ సమయానికి అందజేయాలి. లేదంటే ఓనర్ చేతిలో తిట్లు తప్పవు. ఎప్పుడూ ఉరుకులు పరుగులే. ముందుగా చేస్తే సరుకు పాడవుతుందని భయం. ఒక్కోసారి పనికి సహాయకులు రారు.. అన్నీ నేనే చేసుకోవాలి. లేదంటే నాకూ పని ఉండదు' ఇదీ ఓ వంట మేస్త్రీి ఆవేదన.
అంతటా అసంఘటితరంగమే
వ్యవసాయ కూలీలు మొదలుకొని మత్స్యకారులు, బీడీ పరిశ్రమల్లో, పాల ఉత్పత్తి కేంద్రాల్లో, ప్యాకేజింగ్, నిర్మాణరంగం, హోటళ్లలో పనిచేసేవారు, తోళ్ల పరిశ్రమ, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారు, ఉప్పు తయారీ, ఇటుకలు తయారుచేసే బట్టీలు, నూనె మిల్లులు, రాళ్ల క్వారీలు, కలప కోత మిల్లులు మొదలైన రంగాలకు సంబంధించిన వారు. ఇంకా అనేక రంగాలైన కల్లుగీత, ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో బరువులు మోసేవారు, డ్రైవర్లు, ఇంటిపని వారు, వార్తా పత్రికలను పంపిణీ చేసేవారు ఇలా అనేక రంగాల్లో ఎక్కడ చూసినా అసంఘటిత రంగంలో పనిచేసేవారే.
ఒకప్పుడు ...
పదేళ్ల క్రితం మన తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్, ఇతర దేశాలకు, నగరాలకు పనుల కోసం వెళ్ళే పరిస్థితి మొదలైంది. కాలం గడుస్తున్నా వారి జీవితాల్లో ఎటువంటి మార్పూ చోటుచేసుకోలేదు. గత పదేళ్లలో ఇలాంటి వలసలు పెరుగుతున్నాయేగానీ తగ్గిన పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం, స్థానిక ప్రాంతాల్లో పనికి తగిన వేతనాలు లభించక వలసలు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి రాజధాని ప్రాంతానికి పనుల కోసం వేల సంఖ్యలో కార్మికులు వలస వస్తున్నారు. పరిశ్రమలు, కర్మాగారాలు, భవన నిర్మాణరంగాల్లో పనిచేయడానికి స్థానిక ప్రాంతాల్లో వేతనాల కంటే తక్కువ వేతనాలకే ఈ ప్రాంతానికి వలస వచ్చి పనుల్లో చేరుతున్నారు. సిమెంట్ గోడౌన్లు, సినిమాహాళ్లు, హోటళ్లు తదితర వ్యాపార సంస్థల్లోనే కాదు; చివరికి అపార్టుమెంట్ల దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తూ దుర్భర పరిస్థితులతో బతుకులీడుస్తున్నారు. ఇలాంటి అసంఘటితరంగ కార్మికులకు 100 రోజులు పనిదినాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు బుట్టదాఖలు అవుతున్నాయి.
భద్రత కరవు
దేశంలో అసంఘటితరంగ కార్మికులు 45 కోట్ల మంది ఉంటే వారిలో 90 శాతం మందికి సామాజిక భద్రత, ఇఎస్ఐ, పెన్షన్, గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు అందడం లేదని స్వయంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి సంతోష్‌కుమార్ ఇటీవల తిరుపతిలో కేంద్ర భవన, ఇతర నిర్మాణాల కార్మిక సలహామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక చైతన్య సదస్సులో స్పష్టం చేశారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోరి 2008లో ప్రత్యేకంగా చట్టం తెచ్చినా వాటి ఫలాలు వారికి అందడం లేదన్నది ఆయన మాట. ఇలాంటివారి సంక్షేమం కోసం సేకరించిన నిధులు రూ. 42 వేల కోట్లు ఉన్నాయని, ఇంతవరకూ రూ. 12 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశామని స్వయంగా మంత్రే పేర్కొనడం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోంది. ప్రభుత్వం కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు ప్రకటించామని చెబుతున్నప్పటికీ అనేకమంది కార్మికులకు వాటి ఫలాలు అందడం లేదు.
భారత శ్రామిక బలగంలో 92 శాతంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 63 శాతం సమకూరుస్తున్నారు. అయినప్పటికీ వారికి అధికారిక సామాజిక భద్రతా పథకాలు వర్తించడంలేదు. 2008 అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం దారిద్య్రరేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న కార్మికుల కుటుంబాలకు-జీవిత బీమా, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య బీమాతో భద్రత కల్పించాలని ఉద్దేశించింది. వీరిలో కేవలం ఏడు శాతం మందికి మాత్రమే ఈ ఫలాలు అందుతున్నాయని వాస్తవిక గణాంకాలు చెబుతున్నాయి. దీనికితోడు రేయింబవళ్ళు కష్టించి పనిచేసే సగటు అసంఘటిత కార్మికుడికి ఎక్కడా కనీసవేతనం అమలు కావడంలేదు. అమలు చేసే విషయంలో ప్రభుత్వ యంత్రాంగమూ నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తుందనేది అటు కార్మికులు, ఇటు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
ఆకలి.. అనారోగ్యం
సమతుల ఆహారం, శుభ్రమైన తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, కనీస ఆరోగ్యరక్షణ సౌకర్యం ప్రతి ఒక్కరికీ కనీస అవసరాలు. వీటిలో సగానికి పైగా కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లో లేకపోవడం శోచనీయం. దేశంలో సుమారు 59 శాతం మంది బాలలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. వీరిలో అసంఘటిరంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలే ఎక్కువ. పుట్టిన పిల్లల్లో 50 శాతం మంది బరువు 2.5 కిలోల కన్నా తక్కువే.
ఒకపక్క అభివృద్ధి అంటూనే.. ఆ అభివృద్ధి ప్రయాణంలో అసంఘటిత కార్మికులు రాత్రీపగలూ గొడ్డులా కష్టపడుతున్నా.. వీరి సమస్యలు మాత్రం పాలకులకు పట్టని దుస్థితి! అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నా అమలు కావు. కానీ, ప్రభుత్వం, దాని కనుసన్నల్లో వాణిజ్య లావాదేవీలు సాగించే బడా వ్యాపార వర్గాల ఎదుగుదలలో మాత్రం అసంఘటిత కార్మికులు మాత్రం మగ్గిపోవాలి. ఇదెక్కడి న్యాయం? అందుకే, అసంఘటిత కార్మికులు చేయీ చేయీ కలుపుతూ... పిడికిళ్ళు బిగుస్తున్నారు. దేశ రాజధాని నడిబొడ్డున పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అధిక శాతం.. మహిళలే
దేశ ఆర్థికవ్యవస్థకు అసంఘటితరంగ కార్మికులు అందిస్తున్న వాటా అనేది కీలకం. అందులో ఈ రంగంలో పనిచేస్తున్న అత్యధికులు మహిళలే. మొత్తం శ్రామికుల్లో 85 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. అసంఘటితరంగ కార్మికుల్లో 77 శాతం మంది సగటున రోజుకు రూ. 20 కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం నియమించిన అర్జున్‌సేన్‌గుప్తా కమిటీయే తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని పాలకులు గమనంలోకి తీసుకోవాలి.
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
హమాలీ, జట్టు, ముఠా, కళాసీ కార్మికులకు పనిభద్రత, ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్, గ్రాట్యుటీ తదితర పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని దశాబ్దాల తరబడి అనేక పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. హమాలీ కార్మికుల శ్రమ ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, వ్యాపార వాణిజ్య సంస్థలకు ఏటా కోట్లాది రూపాయలు ఆదాయాలు సమకూరుతున్నాయి. అయినా ఒక్క పైసా వీరి సంక్షేమానికి కేటాయించడం లేదు. ప్రభుత్వాలు సైతం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో హమాలీల సంక్షేమానికి ఏమాత్రం కేటాయించటం లేదు. 1967 జెనీవా ప్రపంచ కార్మికసంస్థ సదస్సులో మనుషుల తోటి 55 కిలోల బరువుకు మించి మోయించకూడదని తీర్మానించినా ఈ రోజుకీ దేశంలో ఆ తీర్మానం అమలుకు నోచుకోలేదు. ఇప్పటికీ 120 నుంచి 300 కిలోల బరువులు మోయిస్తున్నారు. ప్రమాదాలకు గురైతే పట్టించుకునే పరిస్థితి లేదు. భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసిన విధంగా హమాలీలకూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు. సెప్టెంబరు 5 ఆందోళనకు మూకుమ్మడిగా కదిలి, గొంతెత్తబోతున్నారు.
- కె.ఉమామహేశ్వరరావు, ఎపి హమాలీ కార్మికుల రాష్ట్ర ఫెడరేషన్ కన్వీనర్ (సిఐటియు)
- ఉదయ్‌శంకర్ ఆకుల