కొందరు ఉన్నత చదువులు మాత్రమే చదువుతారు కానీ కొందరు ఉన్నతంగా చదువుతారు. వారిలో ఒకరే సీత అనంతశివన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్), అహ్మదాబాద్ నుండి చదువుకున్నవారు చాలామంది ఉంటారు. వాళ్ళు తమ పేరు నిలబెట్టుకోవడానికి వివిధ రంగాల్లో స్థిరపడి, పేరు ప్రఖ్యాతులే పరమావధిగా పనిచేస్తారు. కానీ సీతా అనంతశివన్ తన జీవిత పయనానికి మరో మార్గాన్ని రూపొందించుకున్నారు. ఐఐఎమ్ నుండి వచ్చిన వారిలో ఎక్కువ మంది వారివారి సొంత కార్పొరేట్ స్థావరాలను ఏర్పాటుచేసుకుంటే, సీత అనంతశివన్ మాత్రం పర్యావరణానికి ఆకర్షితురాలయ్యారు. అప్పుడే ఆమె ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో మేనేజ్మెంట్ డిగ్రీ చేయడానికి సిద్ధపడ్డారు. అప్పట్లో పర్యావరణ శాస్త్రంలో ప్రకృతి పరిరక్షణ గురించిన కోర్సులు విదేశాల్లోనే ఉండేవి. అది చదవడానికి ఈమె ఐదేళ్ల కాలేజ్ చదువు పూర్తిచేయాలి. కానీ ఆమె కేవలం మేనేజ్మెంట్ కోర్సు మాత్రమే చేయాలని అనుకోలేదు. అందుకే గ్రాడ్యుయేషన్ డిగ్రీ తర్వాత భారతదేశంలోని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. అయితే కేరళలోని మున్నార్ ప్రాంతంలో మొక్కలు నాటడం కోసం దాన్నీ వదిలేశారు. ప్రకృతిని గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె ఒక విద్యా సంస్థనే ప్రారంభించారు. దీనిద్వారా చిన్న వయస్సు నుండే విద్యార్థులు తమ కాళ్లపై తాము నిలబడేటట్లు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణ శాస్త్రాన్ని కొన్ని కళాశాలల్లోనే భోధిస్తున్నారు. అయితే జీవావరణం, పర్యావరణాన్ని గురించి తరగతి గదిలో కూర్చోబెట్టి భోధించడం సరైన పద్దతి కాదంటారు సీత. అందుకే బాలల కోసం ప్రత్యేకంగా 'ప్రక్రియా గ్రీన్ విజ్డమ్ పాఠశాల'ను ప్రారంభించారు. ఇక్కడ పర్యావరణాన్ని గురించి చిన్నపిల్లలకు వివిధ పద్ధతుల్లో భోధిస్తారు. కొన్నేళ్ల క్రితం బెంగళూరు శివార్లలో 'భూమి కాలేజ్'ను ప్రారంభించారు. ఇక్కడ విద్యార్ధులు వివిధ కమ్యూనిటీలతో కలిసి జీవిస్తూ పర్యావరణానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటారు. ఈ విద్యా సంస్థ ప్రాంగణంలో వంద రకాల జాతులకు సంబంధించిన చెట్లు ఉండటం ప్రత్యేమైన అంశం. 'భూమి' కళాశాల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ విద్యార్థులకు నేర్పే మొదటి పాఠం 'ప్రకృతే మొదటి టీచర్' అని. అందుకే విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతి సిద్ధాంతాలను నేర్చుకుంటారిక్కడ.
అనంతమైన ప్రకృతే టీచర్
