జీవన స్పర్శ నవల ఆవిష్కరణ

Dec 4,2023 15:54 #books, #Literature
jeevana sparsa noval release

ప్రజాశక్తి-కాకినాడ : సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీగనారా రచించిన జీవనస్పర్శ నవల ఆవిష్కరణసభ ఆదివారం స్థానిక యు.టి.ఎఫ్. హోమ్ లో జరిగింది.
కాకినాడ సాహితీస్రవంతి నగర అధ్యక్షులు మార్ని జానకిరామచౌదరి అతిధుల్ని, వక్తల్ని వేదికపైకి ఆహ్వానించారు. సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్. జోస్యుల కృష్ణబాబు సభకు అధ్యక్షత వహించారు. గనారా సోదరులైన గదుల సాయిబాబా నవలను ఆవిష్కరించారు. ప్రముఖ కవి, సాహితీవేత్త అద్దేపల్లి ప్రభు నవలపై చక్కని విశ్లేషణ చేసారు. ముఖ్య అతిథిగా ఎక్స్ ఎమ్.ఎల్.సి. ఎమ్.వి.ఎస్. శర్మ, ఆత్మీయ అతిథులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రథాన కార్యదర్శి సత్యరంజన్ పాల్గొన్నారు. సభాధ్యక్షులు డా.కృష్ణబాబు మాట్లాడుతూ కాకినాడ పెద్దాపురంలలో, సాహితీస్రవంతి ఆవిర్భావవికాసాల్ని గూర్చి వివరించారు. 2016లో గనారా మొదటినవల కడలికల్లోలం సి.పి.ఎమ్. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయబహుమతిని పొందినదని, మరలా అదే నవలా ప్రక్రియను తీసుకొని గనారా జీవనస్పర్శ అనే మరోనవలను రాయటం చాలా సంతోషన్నారు.
అద్దేపల్లి ప్రభు నవలను విశ్లేషిస్తూ అరవైల నుండి తొంభైల వరకూ ఉన్నకాలంలో ఒక ట్రేడ్ యూనియనిస్ట్ వ్యక్తిగత సామాజిక వ్యక్తిగత సామాజిక ప్రేమగాథ ఈనవల. ఆంతరంగిక మనస్తత్త్వాన్నీ దాని తటపటాయింపుల్నీ, తట్టుకోలేని తనాలూ దానివల్ల వచ్చే ఆగ్రహాలనీ చాలా బాధ్యతతో రాసిన నవలగా దీన్ని విశ్లేషించారు. అనంతరం అవధానుల మణిబాబు, మార్ని జానకిరామ చౌదరి, కొత్తశివ, కట్టాకృష్ణారావు, సాలార్, బొల్లోజు బాబా తదితరులు పాల్గొని నవలను గూర్చి, గనారాను గూర్చి ఆత్మీయ ప్రసంగాలు చేసారు‌.
తరువాత ముఖ్య అతిథులను, వక్తలను గనారా సత్కరించారు. కాకినాడ సాహితీస్రవంతి ప్రస్థానంలో తనకు వెన్నుదన్నుగా ఉన్నవారందరికీ రచయిత గనారా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రచయిత గనారాను కాకినాడ పెద్దాపురం సాహితీ స్రవంతులతోపాటు వివిధసాహితీ సంస్థలు, స్నేహితులు, బంధువులు, అందరూ ఘనంగా సత్కరించారు.

➡️