యుక్త వయసులోనూ ఉప్పు ముప్పే అని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మన చిన్నప్పటి జీవనశైలి, ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయట. ఈ విషయంలో ఉప్పు ఏమాత్రం మినహాయింపు కాదంటున్నారు పరిశోధకులు.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తినే అధికబరువున్న యుక్త వయస్కుల కణాల జీవితకాలం వేగంగా తగ్గుతున్నట్లు వీరు గుర్తించారు. మన క్రోమోజోముల చివర టెలోమేర్స్ అనే రక్షణ కవచాలు ఉంటాయి. కణాల విభజన చెందిన ప్రతిసారీ వీటి పొడవు తగ్గుతుంది. ఇవి చాలా పొట్టిగా అయిపోయినప్పుడు కణ విభజన ఆగిపోతుంది. వయసుతో వచ్చే గుండెజబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటి పలు సమస్యలకు ఈ కణ వయసుతో సంబంధం ఉంటుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే టెలోమేర్స్ పొడవు తగ్గుతుంది. ఉప్పు తింటే ఈ ప్రక్రియ వేగం పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల అధికబరువున్న ఎదిగే పిల్లలు ఉప్పు తగ్గిస్తేనే కణాల జీవితకాలం పెరుగు తుందని పరిశోధక బృంద నేత జార్జియా రెజెంట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హైడాంగ్ ఝు పేర్కొన్నారు.
ఈ వయసు వారు ఎంతో ఇష్టంగా తినే పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటి వాటిల్లో ఉప్పు మోతాదు ఎక్కువే. అంతేకాదు కొన్నిరకాల బ్రెడ్స్, అల్పాహార తృణధాన్యాలు, సాస్ల్లోనూ ఉప్పు శాతం ఎక్కువేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకని ఈ వయసు నుండే ఉప్పుతో జాగ్రత్తగా ఉండాలి సుమా!