ఏసియన్ గేమ్స్.. క్రీడాకారులకు నాలుగేళ్ళకోసారి వచ్చే ఓ పెద్ద పండుగ. ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయి పోటీలు జరిగే ఏసియన్ క్రీడల కోసమే ఎంతోమంది మన ఖండ క్రీడాకారులు ఎదురుచూస్తుంటారు. తమ సత్తా చాటుకుంటూ క్రీడారంగంలో మరో శిఖరాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దేశానికి పతకం తేవాలనే కాంక్షతో రగిలిపోయే వారి పోరాటపటిమకు, క్రీడాస్ఫూర్తికి ఇప్పటి ఏసియన్ గేమ్స్ వేదికైంది. అలాగే, మరో రెండు మూడు ఏసియన్ గేమ్స్‌కు ఇప్పుడే భారత్‌కు స్టార్లను అందించింది. వీళ్లలో టీనేజర్లున్నారు. మేటి క్రీడాకారులను, విశేష అనుభవమున్న పోటీదారుల్ని అధిగమించి భారత్‌కు మరిన్ని పతకాల హామీనిస్తున్నారు. షూటింగ్, హెప్తలాన్, స్ప్రింట్ ఇలా వివిధ పోటీల్లో పతకాలతో దూసుకుపోతున్న భారతీయ టీనేజ్ సంచలనాల పరిచయం ఈ వారం మీ కోసం.
కుస్తీ కంటే కాస్త తక్కువస్థాయిలో నిర్వహించే క్రీడ కురష్. ఇప్పటివరకు ఈ క్రీడలో భారత్ తరపున పతకాలు గెలుచుకున్న వారి సంఖ్యా అరుదే. అలాంటి ఓ క్రీడలో మెరిశారు పింకి బల్హారా (19), మలాప్రభ యల్లప్ప జాదవ్(19) కురష్ క్రీడకు ముందు జూడోలో అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదిగిన వీరిద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. పింకి ఢిల్లీకి దగ్గరలోని నెబ్సరారు గ్రామానికి చెందిన అమ్మాయి. ఎన్నో అవరోధాల మధ్య జూడో క్రీడలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ జూనియర్స్ జూడో చాంపియన్‌షిప్ విజేతగా టైటిల్‌ను సొంతంచేసుకున్న పింకి కురష్లోకి ప్రవేశించింది. ఇక ఏసియా క్రీడల్లోనూ తన ప్రవేశం అంతతేలిగ్గా ఏం జరగలేదు. ఈ పోటీలకు ముందు తన జట్టుతో కలిసి 20 రోజులు ట్రెయినింగ్ క్యాంప్‌కు ఉజ్బెకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చింది. అయితే, తన వద్ద అంత డబ్బులేకపోవడంతో ఈ పోటీలను మానుకోవాలనుకుంది పింకి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులే తనకు అండగా నిలిచారు. అలా గ్రామస్తులందించిన 1.75 లక్షల ఆర్ధిక సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ పూర్తిచేసుకోవడంతోపాటు ఏసియన్ గేమ్స్లోకీ ప్రవేశించింది పింకీ. యల్లప్పది మరో హృదయాన్ని కదిలించే పోరాటం.
తండ్రికి అంకితం
కర్నాటకలోని బెల్గామ్కి చెందిన ఒక రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి యల్లప్ప. జూడో క్రీడలో అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది. ఆమె ఏసియన్ క్రీడలకు సన్నద్ధమవుతున్నప్పుడే... గుండెపోటుతో తన తండ్రి మరణించడం ఆమెను షాక్‌కు గురిచేసింది. అయితే. తమ గ్రామానికి మంచిపేరు తీసుకురావాలంటూ తన తండ్రి చెప్పిన మాటల్ని గుర్తుతెచ్చుకుని పోటీలకు సన్నద్ధమైంది. ఇలా గుండెల్ని రగిలించే బాధను మోస్తూనే యల్లప్పా, పింకీ ఇద్దరూ ఉజ్బెకిస్తాన్‌లో ట్రెయినింగ్ పూర్తిచేసుకున్నారు. అక్కడ కనీసం టీమ్‌లో అందరికీ ఉన్న షూస్, స్పోర్ట్స్ కిట్ కూడా వీరికి లేవు. అయితే ఇలాంటివన్నీ వారి విజయానికి అడ్డుపడలేదు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన పింకీ, యలప్పా ఇద్దరూ 50 కేజీల కురష్లో రజత, కాంస్య పతకాల్ని సొంతంచేసుకున్నారు.
పులి గురి..
షూటింగ్ అనగానే మనకు అభినవ్ బింద్రా, జితు రారు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇలా కొందరు భారతీయ షూటర్స్ గుర్తుకొస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో శార్దూల్ విహన్ కూడా చేరాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 11 జనవరి 2003లో జన్మించాడు సౌరభ్. ఎనిమిదేళ్ళ వయసు నుంచే షూటింగ్లో శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాల్ని గెలుచుకున్నాడు. గతేడాది మాస్కోలో జరిగిన ప్రపంచ షాట్‌గన్ చాంపియన్‌షిప్ పోటీలో బంగారుపతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయం ద్వారా షూటర్‌గా తనకు గుర్తింపు లభించింది. ఏసియన్ గేమ్స్ లక్ష్యంగా కృషిచేసిన శార్దూల్ ఈ ఏడాది ఏసియన్ గేమ్‌లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో పాల్గొని రజత పతకాన్ని సొంతంచేసుకున్నాడు. కేవలం పదిహేనేళ్ళకే ఆసియా క్రీడల్లోకి ప్రవేశించి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు శార్దూల్ విహన్. కేవలం నాలుగేళ్ల క్రితమే షూటింగ్ వైపు రావడం ఆశ్చర్యపరిచే విషయం. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇలా ఏ క్రీడలోనైనా రాణిస్తాడనే నమ్మకంతో కోచ్ అన్వర్ సుల్తాన్ శార్దూల్ విహాన్ భవితను క్రీడారంగంలోనే చూశాడట..! ఆయన నమ్మకం నిజమైంది.. 2017లో జర్మనీలో నిర్వహించిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీలతోనే.
ఊషూలో తొలి పతకం
మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో కఠినమైన క్రీడ ఊషు. ఈ క్రీడలో కొనసాగుతున్న భారతీయులు కూడా చాలా అరుదే. అలాంటి క్రీడలో కొనసాగుతూ భారత్‌కు ఒక అరుదైన రికార్డును అందించింది నోరెమ్ రోషిబినా దేవి (17). మణిపూర్‌లోని కొయిజుమన్ క్వసిఫారు అనే ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి రోషిబీనా. నోరెమ్ దాము, రొమీలా అమ్మానాన్నలు. స్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా 'స్పెషల్ ఏరియా స్పోర్ట్స్'లో ఊషుకు కోచ్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్ సింగ్ వద్ద చిన్ననాటి నుంచే శిక్షణ మొదలు పెట్టింది రోషిబినా. 2016లో బల్గేరియాలో జరిగిన ఆరో ప్రపంచ జూనియర్ ఊషూ చాంపియన్‌షిప్ పోటీల్లో బాలికల 48 కేజీల విభాగంలో రజతపతకాన్ని సాధించింది. గతేడాది కొరియాలో జరిగిన తొమ్మిదో ఏసియన్ జూనియర్ ఊషూ చాంపియన్‌షిప్ పోటీల్లో చైనా క్రీడాకారిణితో తలపడి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మణిపూర్‌లో ఊషూ క్రీడలో కొనసాగుతున్న నలుగురు క్రీడాకారుల్లో రోషిబినా ఒకరు. ఏసియన్ గేమ్స్‌లో బంగారు పతకం లక్ష్యంగా కృషిచేసింది రోషిబినా. అయితే, ఈ పోటీల్లో జపాన్, చైనా దేశాల క్రీడాకారులకు గట్టి పోటీనిచ్చి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఏసియన్ గేమ్స్‌లో భారత్ తరపున ఊషూ క్రీడలో పతకాన్ని అందుకున్న తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డును నెలకొల్పింది రోషిబినా. ఇక ఈ క్రీడలో మణిపూర్ తరపున పతకాల్ని గెలుచుకుంది రోషిబినా మాత్రమే.
అతి పిన్న షూటర్
ఈ ఏడాది ఏసియన్ గేమ్స్ షూటింగ్లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు సౌరబ్ చౌదరి (17). ముంబరులోని కలినా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. మీరట్‌లోని బెనోలీలో ఉన్న అమిత్ షియోరన్స్ అకాడెమీలో చేరి షూటింగ్లో మెలకువలు నేర్చుకున్నాడితను. రాష్ట్ర, జాతీయస్థాయి షూటింగ్పోటీల్లో వివిధ విభాగాల్లో ఎన్నో పతకాలను గెలుచుకున్నాడు. కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్ క్రీడల్లో బంగారుపతకాన్ని గెలుచుకుని ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు సౌరభ్. ఇలా అతిపిన్న వయసులోనే సీనియర్స్ షూటింగ్ పోటీల్లో పాల్గొనటమే కాదు, 2010 వరల్డ్ చాంపియన్ టొమెయుకిని 24 -షాట్ పైనల్లో ఓడించి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు సౌరభ్. ఈసారి ఏషియన్ గేమ్స్‌లో పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
లక్ష్యం దిశగా
భారత్‌కు ఈసారి షూటింగ్ ఎయిర్‌పిస్టల్, రైఫిల్ ఇలా వివిధ విభాగాల్లో పతకాలు దక్కినా ట్రాప్ షూటింగ్లో పతకాన్ని అందించించిన ఘనత పంతొమ్మిదేళ్ళ లక్ష్య శరణ్కే దక్కింది. చిన్నతనం నుంచి క్రికెట్, బ్యాట్మింటన్ ఇలా వివిధ క్రీడల్లో పాల్గొన్నా తన అభిరుచి మాత్రం షూటింగ్ పైనే. అలా నాలుగేళ్ళ క్రితమే షూటింగ్‌లోకి అడుగుపెట్టిన లక్ష్య ఈసారి ఏసియన్ క్రీడల్లో ట్రాప్ షూటింగ్లో బంగారు పతకం కోసం ఎంతగానో కృషిచేశాడు. అలా తైవాన్‌కు చెందిన కున్పి యాంగ్‌కు గట్టిపోటీనిచ్చిన లక్ష్య మొత్తం 43 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు.
ఇక ఈ ఏడాది ఏసియన్గేమ్స్ బాక్సింగ్, ఆర్చెరీ, రెజ్లింగ్, హెప్తలాన్ ఇలా వివిధ క్రీడల్లో భారత్‌కు పతకాలు దక్కాయి. ఇంత పెద్ద ఎత్తున భారత్ పతకాలు అందుకోవడంలో కీలక పాత్ర పోషించినవారిలో చాలామంది యువ క్రీడాకారులే.
- అద్దేపల్లి శర్వాణి