కళ్ళను రక్షించుకునేందుకు సన్‌గ్లాసెస్, గాగుల్స్, స్పెక్టకల్స్ ఇలా చాలా రకాల కళ్ళద్దాలను ఉపయోగిస్తుంటాం. వాటికి సంబంధించి కొన్ని ఆసక్తిగొలిపే విషయాలు ఈ వారం మీకోసం.
1000 క్రీ.శ. లోనే కళ్ళద్దాలను ఉపయోగించడం ప్రారంభమయ్యింది. దూరంగా ఉండే వస్తువుల్ని వీక్షించేందుకు వీలుగా మొట్టమొదట ఈ కళ్ళద్దాలను కనిపెట్టారు.
క్రీ.శ.1285-1289 మధ్య కాలంలో సిలికాన్, ఆక్సిజన్ అణువులతో ఏర్పడే క్వార్ట్జ్తో కళ్ళద్దాలను తయారుచేసేవారు. తోలు, లోహాలు, ఎముకలతో తయారు చేసిన ఫ్రేముల్లో అమర్చిన ఈ కళ్ళద్దాలు వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పటి అద్దాల్లా వాటికి ఇరువైపులా పొడవాటి కాడలు లేవు. కేవలం వృత్తాకార ఫ్రేముల్లో వీటిని ఉంచడంతో వాటిని ధరించడం సాధ్యపడలేదు.
అద్దాలను కంటి వద్ద నుంచి జారకుండా ఉండేందుకు ఫ్రేములకు ఇరువైపులా రిబ్బన్లను అమర్చి వాటిని తల భాగంలో కట్టుకునేందుకు వీలుగా ఒక కొత్త నమూనాలో కళ్ళద్దాలను తయారుచేసింది స్పెయిన్ వాసులే. అయితే, ఈ నమూనా పెద్దగా ప్రజాదరణ పొందలేదు.
ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కళ్ళద్దాల కోసం ఒక వ్యక్తి చేస్తున్న ఖర్చు వారి మూడునెలల మించిపోతోందట.
కళ్ళద్దాలను కొందరు తరచూ మార్చేస్తుంటారు. అలా విపరీతంగా కళ్ళద్దాలను మార్చేస్తున్నది యూరప్ వాసులేనట.
అమెరికాలో ప్రతి ఏటా నాలుగు లక్షల జతల కంటే ఎక్కువ కళ్ళద్దాలు వృధా అవుతున్నాయనేది ఒక నివేదిక.
ఎండ నుంచి కాపాడుకునేందుకు చిన్నా పెద్దా అందరూ సన్ గ్లాస్‌లను ఉపయోగిస్తుంటారు. మరి వీటిని మొట్టమొదట ఎందుకు తయారు చేశారో మీకు తెలుసా?. సన్ గ్లాసెస్‌ను మొట్టమొదట తయారుచేసిన దేశం చైనా. 12వ శతాబ్దంలోనే ఇక్కడ సన్‌గ్లాసెస్‌ను ఉపయోగించేవారు. అయితే వీటిని తయారుచేసింది ఎండ నుంచి కళ్ళను సంరక్షించుకోవడం కోసం కాదట. కోర్టులో సాక్షులను ప్రశ్నించేటప్పుడు న్యాయవాదులు తమ భావవ్యక్తీకరణ కనపడకుండా ఉండేందుకు ఈ కళ్ళద్దాలను ఉపయోగించేవారట.
కళ్ళద్దాలకు బదులగా ప్రస్తుతం ఎక్కువమంది హై ఇండెక్స్ లెన్స్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే మొట్టమొదట ఈ హై ఇండెక్స్ లెన్స్‌ను ప్లాస్టిక్ తోనే తయారుచేశారు.
కళ్ళద్దాలకు ఇరువైపులా చేతుల్ని ఉంచి చెవి భాగంలో ధృడంగా ఇమిడి ఉండేలా కళ్ళజోళ్ళను తయారు చేయడం 1730లోనే ప్రారంభమైంది. ఈ నమూనా కళ్ళద్దాలను తయారుచేసింది లండన్‌కు చెందిన ఎడ్వర్డ్ స్కార్లెట్.
బైఫోకల్ లెన్స్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుగొన్నారు. దూర, సమీప వస్తువుల్ని చూసే లోపాన్ని కలిగున్న ఫ్రాంక్లిన్ ఈ సమస్యను అధిగమించేందుకు 1784లో ఈ అద్దాలను తయారుచేశారు.
20వ శతాబ్దం నాటికే అమెరికా, యూరప్‌లలో వివిధ డిజైన్లలో సౌకర్యవంతమైన కళ్ళద్దాలను తయారుచేయడం ప్రారంభమైంది.
కంటి సంరక్షణతోపాటు,స్టైలిష్‌గా ఉండేందుకు ఎక్కువమంది ఉపయోగించే గాగుల్స్‌లో ఏవియేటర్, బ్లొటార్చ్, రెట్రో, స్క్వేర్, కీహోల్ బ్రిడ్జ్, బ్ర్రో బార్, క్యాట్ ఐ ఎక్కువ ప్రజాదరణ పొందాయి.
బ్లోటార్చ్ గాగుల్స్, స్విమ్మింగ్ గాగుల్స్, ల్యాబొరేటరీ-రీసెర్చె గాగుల్స్, వెల్డింగ్ గాగుల్స్, డార్క్ ఎడాప్టర్ గాగుల్స్ లాంటిది వివిధ రంగాల్లో ఉపయోగించే గాగుల్స్.
భారత్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు గాగుల్స్‌ను ఉపయోగిస్తున్నారనేది ఒక అంచనా!.