మద్యానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ఎక్కువగా మహిళలే ప్రదర్శనలు చేయడం చూస్తున్నాం. అయితే, రాంచీలోని బూసుర్ గ్రామంలో సంప్రదాయం పేరుతో అక్కడ జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టవేయడం తోపాటు మద్యానికి వ్యతిరేకంగా 30 మంది బాలికలు కలసి ప్రచారం మొదలుపెట్టారు. వారిలోని పోరాటపటిమను వెలికితీసేందుకు దోహదపడిన విషయాలను తెలుసుకుందాం.
రాంచీలోని బూసుర్ గ్రామంలో జన్మించింది సీమా. ఆరుగురు సంతానంలో ఆమె మూడోది. చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మానాన్నల గొడవలు చూస్తు పెరిగింది. ఆమె తండ్రి తెల్లవారుజాము నుంచి తాగడం మొదలుపెడతాడు. ఆ రోజంతా ఇంట్లో అరుపులు, కేకలు. ప్రస్తుతం సీమా ఇగ్నోలో ఎమ్ఎ చదువుతోంది. ఆమె ఇంటి వాతావరణ ప్రభావం చదువుపై ఎక్కువగా పడింది. ఒక్క సీమానే కాదు, ఆ గ్రామంలోని ప్రతి కుటుంబంలోని అమ్మాయిల పరిస్థితి ఇదే. మొదట్లో ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, మద్యం తాగడం ఇక్కడి ఆచారం. సుమారు 500 జనాభా ఉన్న ఈ గ్రామంలో అధికశాతం ఆదీవాసులే (గిరిజనులు). హడియా అనేది అక్కడి ప్రజలు తాగే మందుపేరు. దాన్ని అక్కడి బియ్యం, కొన్ని మూలికలతో తయారు చేస్తారు. ఏవైనా పండుగలు, పెళ్ళిళ్ళ సందర్భాల్లో దీన్ని తాగడం ఇక్కడి ఆనవాయితీ. ఇది ఇక్కడి సంప్రదాయం కాబట్టే మొదట్లో దీన్ని వ్యతిరేకించడానికి ఎవరూ సాహసించలేదు.
ఒక్కరితో కాదని..!
రోజు రోజుకూ సీమ ఇంటి పరిస్థితి చూసి చాలా బెంబెలెత్తిపోయింది. ఎలాగైనా, నాన్నను ఈ తాగుడు నుంచి విముక్తిని చేయాలనుకుంది. ఒక్క తన తండ్రినే కాకుండా ఊరివారందరితో తాగుడును మానిపించి, ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పాలనుకుంది. తనకు తోడుగా కొందరి సహకారం ఎంతైనా అవసరం అనుకుంది. ఇంత మందిని ఎదుర్కోవడానికి, నచ్చజెప్పడానికి తన శక్తి ఒక్కటే చాలదని ఆమెకు అర్థమైంది. అందుకే, ఆ గ్రామంలోని 30 మంది అమ్మాయిలతో కలిసి మొదటగా ఈ విషయాన్ని చర్చించింది. మొదట అమ్మాయిలు కాస్త సంసయించినా తర్వాత సీమా మాటలకు వారు తమ అంగీకారాన్ని తెలియజేశారు. దాంతో 30 మంది అమ్మాయిలతో కలిసి మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. వారి బృందానికి 'సఖి- సహేలి' అనే పేరును కూడా పెట్టారు. ఆ ప్రాచారంలో భాగంగా ఊరివారందరితో ఇకపై మద్యం తాగబోమని పేపర్ మీద రాయించుకోవడం మొదలుపెట్టారు.
ఆచారానికి సమనగీతం
నాన్న తాగొస్తే సీమా భయపడిపోతుంటుంది. ఇది ఒక్క సీమాలోనే కాదు అక్కడ చిన్నారులందరిలో కనిపిస్తుంది. గ్రామస్తుల్లో ఈ వ్యసనం మాన్పిస్తే ఇక్కడి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని వాళ్లకు అనిపించింది. ఒక గ్రూపును ఏర్పాటు చేసి ప్రచారం మొదలు పెట్టారు ఆ బాలికలంతా. ఇలా చేయడం వల్ల మొదట్లో వారికి చాలా సమస్యలు వచ్చాయి. ఇది ఇక్కడి ఆచారమైనందుకు మొదట్లో ఎవరూ తాగుడు మానేందుకు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ బాలికలంతా కలిసి ఆ గ్రామ పంచాయతీ అధికారి రితేష్ ఉరాన్ నుంచి సాయంతో గ్రామసభలలో, రచ్చబండ కార్యక్రమా లలో, మీటింగ్‌లలో మద్యాంపై ప్రచారం మొదలు పెట్టారు.
ఈ ప్రచారానికి పురుషుల కంటే మహిళల మద్దతు ఎక్కువగా లభించింది. టీమ్‌లో ఉన్న అమ్మాయిలు మొదటగా వారి కుటుంబసభ్యులను మందు మాన్పించే ప్రయత్నం చేశారు. ఆదీవాసీలలో అమ్మాయిలు అబ్బాయిలనే భేదం ఉండదు. వారు ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఇతర కమ్యూనిటీ వారు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు చేసుకుంటుంటారు. కానీ, ఆదివాసుల్లో అలాంటి ప్రణాళికలు ఉండవు. పిల్లలు కూడా మందుకు బానిసలై ఆ మత్తులో భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని వారంతా గ్రహించారు. ఆచారాలు, సంప్రదాయాలు అనే పేరుతో మత్తులో భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదనే ఉద్దేశంతో మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలను మెదలు పెట్టారు.
శాంతియుత ప్రచారం
మహిళల వేధింపుల సమస్యలను తీర్చే సక్రియా సంస్థ 'ఆశా'. ఈ సంస్థ తోడ్పాటుతో కొద్ది నెలల్లోనే చాలామంది మద్యం తాగడం ఆపేశారు. అలా ఎక్కువ జనసంచారం ఉన్న చోట మద్యం తాగడం చాలా వరకూ తగ్గింది. అయితే ఈ వ్యసనాన్ని పూర్తిగా మాన్పించేందుకు వీటి తయారీని అడ్డుకోవాలి. అయితే తయారీ ప్రాంతాల్లో అమ్మాయిలు ఎలాంటి హింసలకు పాల్పడకుండా అహింసతో ప్రచారాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామస్థులు మరింత ఉత్తేజితులై చాలావరకు మద్యాన్ని నిషేధించ గలిగారు. ప్రస్తుతం నామ్కుమ్ ప్రాంతంలోని లాల్ఖటంగ్ పంచాయతీలోని బుసుర్ గ్రామంలో జరుగుతోన్న ఈ ప్రచారం గురించి రాజధాని రాంచీతోపాటు అన్ని చోట్లా చర్చ జరుగుతోంది.
- అమల తిలారు